న్యూఢిల్లీ ఏప్రిల్ 17
స్వలింగ సంపర్కుల వివాహాలకుచట్టబద్ధత కల్పించలేమని ఇవాళ మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. ఆడ, మగ మధ్య జరిగే పెళ్లిళ్లను మాత్రమే వ్యవస్థ గుర్తిస్తుందని కేంద్రం సుప్రీంకోర్టులో తెలిపింది. ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థతో సమానంగా గే వివాహాలను చూడలేమని, ఇది ప్రతి పౌరుడి ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కోర్టు పేర్కొన్నది. సేమ్ సెక్స్ మ్యారేజీలకు గుర్తింపు కల్పిస్తే అప్పుడు వివాహ చట్టాన్ని సంపూర్ణంగా మార్చాల్సి వస్తుందని కోర్టు తెలిపింది.స్వలింగ సంపర్కుల వివాహాలపై దాఖలైన పిటీషన్లకు కౌంటర్‌గా సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ వేసింది. అయితే గే మ్యారేజీలపై వేసిన పిటీషన్లు కేవలం పట్టణ ఎలైట్ వ్యక్తుల అభిప్రాయాలు మాత్రమే అవుతాయని, సామాజిక ఆమోదం కోసం ఆ పిటీషన్లు వాళ్లు వేశారని కేంద్రం తన అఫిడవిట్‌లో తెలిపింది. గే మ్యారేజీల గురించి పార్లమెంట్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం చెప్పింది.చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నర్సింహాలతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టింది. గే మ్యారేజీలకు చట్టబద్ధత కల్పించకపోవడం వివక్ష కాదు అని, ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ వివాహాలకు గుర్తింపు ఉందని, భారతీయ సామాజిక కోణంలోనూ పెళ్లికి ప్రత్యేక విశిష్టిత ఉందని, హిందూ మత చట్టాల్లోని అన్ని శాఖల్లో ఆడ,మగ పెళ్లిని పవిత్రంగా చూస్తారని కేంద్రం తెలిపింది. ఇస్లాం మతంలోనూ పెళ్లి ఓ కాంట్రాక్టే అయినా, ఆ ఒప్పందం పవిత్రమైందని, కేవలం ఆడ, మగ మధ్య జరిగే పెళ్లిళ్లకు మాత్రమే ఆ మతంలోనూ ఆమోదం ఉందని కేంద్రం తన అఫిడవిట్‌లో వెల్లడించింది.