YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేవంత్ కు వ్యతిరేకంగా మళ్లీ..మళ్లీ...

రేవంత్ కు వ్యతిరేకంగా మళ్లీ..మళ్లీ...

హైదరాబాద్, ఏప్రిల్ 19, 
తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల వ్యవహార శైలి ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. క్రమశిక్షణ లేమికి కేరాఫ్‌ అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. రాష్ట్రంలో పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సీనియర్‌ నాయకులంతా కలిసి పనిచేయాల్సింది పోయి.. ఎవరికి వారే ఈసారి మేమే సీఎం క్యాండిడేట్‌ అని ప్రచారం చేసుకుంటున్నారట. తాజాగా జరిగిన మంచిర్యాల సభలో ఇది మరోసారి బయటపడిందట. చూడ్డానికి అందరూ ఒకే వేదిక మీద కూర్చున్నా… ఎవరి గ్రూపులు వారివిగానే ఉన్నాయట. సీఎల్పీ లీడర్‌ భట్టి విక్రమార్కనుద్దేశించి ఆయన మద్దతుదారులు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. దీనికి తోడు భట్టితో పాటు పాదయాత్రలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి… దళిత సీఎం అనే ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. మరో అడుగు ముందుకేసిన కోమటిరెడ్డి భట్టిని వైయస్ రాజశేఖర్ రెడ్డితో పోల్చారు. నడక…నడత అంతా వైయస్ లాంటివేనని ప్రశంసించారు. దీంతో మంచిర్యాల సభ వేదిక దగ్గర భట్టి.. సీఎం నినాదాలు గట్టిగానే వినిపించాయట. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు , భట్టి ఇద్దరు మంచి మిత్రులు. అందులో భాగంగానే…పాదయాత్రను కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభించారనేది టాక్. మాజీ ఎమ్మెల్సీ అనుచరులే భట్టి సీఎం అంటూ సభలో నినాదాలు చేశారట. ప్రేమ్ సాగర్ రావు మాత్రం… వ్యూహాత్మకంగా వేదిక మీదున్న నాయకుల్లో ఒకరు సీఎం అవుతారంటూ ప్రకటించారు.గతంలో ఎక్కడ సభలు, సమావేశాలు జరిగినా పిసిసి చీఫ్‌ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి సీఎం.. సీఎం.. అంటూ కార్యకర్తలు నినాదాలు చేసేవారు కార్యకర్తలు. ఇది పార్టీలోని సీనియర్లు కొందరికి అస్సలు నచ్చేదికాదట. అంతర్గత సమావేశాల్లో కూడా దీనిపై చర్చ లేవనెత్తేవారట. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు తన అనుచరులకి వేదిక మీద నుంచే సీఎం నినాదాలు మానుకోవాలని సూచించారు రేవంత్‌. కానీ అది కొనసాగుతూ నే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. అందుకే అంతా కలిసి పనిచేయాల్సిన సందర్భం ఇది.ఉమ్మడి రాష్ట్రంలో రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య బిజెపి వచ్చి చేరింది. బిజెపికి ఉన్న బలం ఎంత అనేదాని కంటే ఆ పార్టీ వేస్తున్న ఎత్తుగడలు..కాంగ్రెస్‌కి రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తున్నాయట. దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించకుండా… అందుకు ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకోకుండా… బహిరంగ వేదికల మీద ఈ సీఎం నినాదాలు ఏంటని పార్టీలోని మరో వర్గం అసహనంగా ఉందట. రాజకీయాల్లో పదవులు ఆశించడం సహజమే అయినా… అసలేమీ లేకుండా… అధికారంలోకి వచ్చే ఉమ్మడి ప్రయత్నాలు చేయకుండా…ఆలులేదు, చూలులేదన్న సామెతను గుర్తు చేస్తూ… ఈ గొడవలేంటని అంటున్నారట మరి కొందరు నాయకులు.ఏదేమైనా… కాంగ్రెస్‌ కల్చర్‌లో మాత్రం ఇలాంటివన్నీ సహజమేనన్న వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి. వాళ్ళంతే… అలా కొట్లాడుకుని అవతలి వాళ్ళకు చేజేతులారా అవకాశం ఇస్తారన్నది తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. ఇన్నాళ్ళు రేవంత్‌ సీఎం అని నినాదాలు వినిపిస్తే… ఇప్పుడు కొత్తగా ఆ లిస్ట్‌లో భట్టి విక్రమార్క వచ్చి చేరారు. జరుగుతున్న పరిణామాలపై పీసీసీ మాజీ ఛీఫ్‌ ఒకరు తీవ్ర అసహనంతో ఉన్నారట. చూడాలి… సీఎం వార్‌ టి కాంగ్రెస్‌ని ఎటు తీసుకువెళ్తుందో.

Related Posts