జైపూర్, మే 9,
రాజస్థాన్ రాజకీయాల్లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. బీజేపీ సీనియర్ లీడర్ వసుంధర రాజేపై సీఎం అశోక్ గహ్లోట్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 2020లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా ఇద్దరు బీజేపీ నేతలు తమకు సహకరించారని చెప్పారు గహ్లోట్. వారిలో వసుంధర రాజే కూడా ఉన్నారని బాంబు పేల్చారు. ఈ కామెంట్స్‌తో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ వివాదంపై వసుంధ రాజే తన వాదన వినిపించారు. అవన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పారు. ఓడిపోతామేమో అన్న భయంతో గహ్లోట్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు. కుట్రపూరితంగా ఆయన ఈ కామెంట్స్ చేశారని అసహనం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమే అయితే అందుకు ఆధారాలేంటో చూపించాలని ఛాలెంజ్ చేశారు. "ఇది నాకు తీవ్ర అవమానం. కుట్రపూరితంగా చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. మా ఎమ్మెల్యేలు లంచం తీసుకున్నారన్న ఆధారాలు మీ వద్ద ఉంటే FIR నమోదు చేయండి. ఇంత వరకూ ఎవరూ నన్ను ఇంత దారుణంగా అవమానించలేదు"ధోల్‌పూర్‌లో జరిగిన సభలో అశోక్ గహ్లోట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఇద్దరు బీజేపీ నేతలు సాయం చేశారని అన్నారు. "మాజీ ముఖ్యమంత్రులు వసుంధర రాజే సిందియా, శోభా రాణి, కైలాష్ మేఘ్వాల్..ఈ ముగ్గురికీ మా ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని తెలిసింది. డబ్బు ఆశ చూపించినా వాళ్లు తలొగ్గలేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే హక్కు తమకు లేదని తేల్చి చెప్పారు. వసుంధర రాజేతో పాటు కైలాష్ మేఘ్వాల్ మాకు మద్దతుగా ఉన్నారు. అందుకే...మా ప్రభుత్వం నిలబడగలిగింది. అమిత్‌షా, ధర్మేంద్ర ప్రదాన్, గజేంద్ర షెకవాత్ కొందరికి డబ్బు ఆశ చూపించారు. డబ్బు ఆశ చూపిస్తే ఆ విషయం మాకు చెప్పాలని మా ఎమ్మెల్యేలకు అప్పుడు చెప్పాను. మీకు డబ్బు కావాలంటే నేను ఇస్తానని వాళ్లకు వివరించాను. కానీ బీజేపీ డబ్బులు తీసుకోవద్దని తేల్చి చెప్పాను"ఈ వ్యాఖ్యలపైనే బీజేపీ, కాంగ్రెస్ మధ్య నిప్పు రాజుకుంది. ఆ ఆరోపణలకు ఆధారాలు చూపించాలని వసుంధర రాజే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గహ్లోట్, పైలట్ మధ్య రాజకీయ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కూడా చేశారు పైలట్. అధిష్ఠానం సర్ది చెప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ సక్సెస్ అవ్వడం లేదు. పైలట్ సొంత పార్టీ పెడతారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. ఇప్పటి వరకూ అలాంటి ప్రకటన చేయకపోయినా...ఎప్పుడైనా ఆ స్టేట్‌మెంట్ రావచ్చని అంచనా వేస్తున్నారు.