విశాఖపట్టణం, మే 10,
ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టడం, రాజకీయంగా పై చేయి సాధించడమే లక్ష్యంగా ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో వైసీపీ-బీజేపీ బంధంపై సోషల్ మీడియాలో సరికొత్త ప్రచారం మొదలైంది. ఏపీలో బీజేపీకి వైఎస్సార్సీపీ బి టీమ్‌గా వ్యవహరిస్తుందనే అర్థం వచ్చేలా కాంపెయిన్ మొదలుపెట్టారు.కాషాయపార్టీలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే అర్థం వచ్చేలా ముఖ్యమంత్రి క్యారికేచర్‌లను రాజకీయ ప్రత్యర్థులు జోరుగా సర్క్యూలేట్ చేస్తున్నారు. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తోంది. నాలుగేళ్లలో అడపాదడపా కేంద్రమంత్రులు, బీజేపీ నాయకులు ఏపీ ప్రభుత్వం విమర్శలు గుప్పించినా కేంద్రంతో వైసీపీ ప్రభుత్వ సంబంధాలను ప్రభావితం చేయలేకపోయాయి.కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో వైసీపీకి ఎలాంటి దోస్తీ లేదు. తమ బంధం కేవలం రాష్ట్ర ప్రయోజనాలకే పరిమితం అని కొద్ది నెలల క్రితం విశాఖలో జరిగిన ప్రధాని పర్యటనలో వేదికపై ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.ఏపీలో బీజేపీతో వైఎస్సార్సీపీకి ఉన్న బంధం ఏమిటనేది చాలా మందికి క్లారిటీ లేదు. అదే సమయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కాకపోయినా వైసీపీని బీజేపీ ఎందుకు ఊపేక్షిస్తుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినా అవి తాత్కలికమే. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే పరిస్థితి నాలుగేళ్లలో ఎప్పుడూ బీజేపీ కల్పించలేదు.2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని బీజేపీ భావించింది. రెండో స్థానంలో ఉన్న టీడీపీ నుంచి వీలైనంత మంది నాయకుల్ని చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని భావించింది. అదే సమయంలో జనసేనతో స్నేహం, కాపులకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి ప్రధాన కులానికి తాము రాజకీయ ప్రత్యామ్నయం అవుతావనే సందేశాన్ని జనాల్లోకి పంపాలని భావించింది.కారణాలు ఏమైనా, కారకులు ఎవరైనా బీజేపీ అనుకున్నట్టు ఏపీలో ఆ పార్టీ బలోపేతం కాలేదు. అదే సమయంలో 2018కు ముందు బీజేపీ నుంచి దూరమైపోయిన టీడీపీ, బీజేపీకి దగ్గరయ్యేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ఇవి కూడా పెద్దగా ఫలించలేదు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఏపీలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే విషయంలో కొంత ఊగిసలాట వైఖరి ప్రదర్శించిందనే విమర్శలు కూడా ఉన్నాయి. టీడీపీకి దగ్గరయ్యే విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వంలో స్పష్టత ఉన్నా, వైసీపీ విషయంలోనే ఆ పార్టీ వైఖరి అంతు చిక్కడం లేదు.ఈ క్రమంలో ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ముద్ర వేసే ప్రయత్నాలు రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నారు. కాషాయ పార్టీలోో లేకపోయినా జగన్ కాషాయ దళంతో అంటకాగుతున్నారని సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి జగన్ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలలో వైసీపీ గట్టి పట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయక ఓటు బ్యాంకులుగా ఉన్న వర్గాలన్ని 2009 తర్వాత పూర్తిగా వైసీపీ వైపు మళ్లాయి. అయా వర్గాల్లో చీలిక తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు ఈ తరహా ప్రచారాలకు తెర తీశారు.బీజేపీ తమ మిత్ర పక్షమనో, బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామనో వైసీపీ చెప్పడం లేదు. అదే సమయంలో ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా ఉండటానికి బీజేపీ కూడా తమతో చేరాలని టీడీపీ-జనసేన కోరుకుంటున్నాయి. దీనికి బీజేపీ అంగీకరిస్తుందో లేదో కూడా తెలీదు. ప్రభుత్వ వ్యతిరేక జట్టులో సిపిఐ కూడా ఉంది. జనసేన-బీజేపీల మధ్య ఉన్న రాజకీయ అవగాహనకు ఈ కొత్త బంధాలు ఎలా సానుకూలిస్తాయనే సందేహం కూడా ఉంది. ఈ లోపు బీజేపీ “బీ ” టీమ్‌గా వైసీపీకి ముద్ర వేసే ప్రయత్నాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి