YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

794.64 టన్నులకు చేరిన బంగారం నిల్వలు

794.64 టన్నులకు చేరిన బంగారం నిల్వలు

ముంబై, మే 11, 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బంగారు గనిలా మారుతోంది, ఏటికేడు బంగారం నిల్వలను పెంచుకుంటోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో (FY23) కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర పసిడి రాసులు పెరిగాయి. కేంద్ర బ్యాంక్‌ దగ్గరున్న బంగారానికి FY23లో మరో 32.22 టన్నులు జత కలిసింది. ఈ పెరుగుదల తర్వాత, 31 మార్చి 2023 నాటికి, RBI దగ్గర ఉన్న మొత్తం బంగారం నిల్వలు 794.64 టన్నులకు చేరాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ గణాంకాలను విడుదల చేసింది. 31 మార్చి 2022 (FY22) వరకు, RBI వద్ద 760.42 టన్నుల బంగారం ఉంది. 31 మార్చి 2023 (FY23) నాటికి ఈ నిల్వ 794.64 టన్నులకు చేరింది కాబట్టి, పసిడి నిల్వల్లో సంవత్సరానికి 4.5 శాతం పెరుగుదల నమోదైంది.31 మార్చి 2023 వరకు రిజర్వ్ బ్యాంక్ వద్ద మొత్తం 794.64 టన్నుల పసిడిలో..  437.22 టన్నుల బంగారం విదేశీ బ్యాంకుల్లో భద్రంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్‌ వద్ద సేఫ్‌ కస్టడీలో ఆ పసిడి రాసులను భద్రపరిచారు. మిగిలిన 301.10 టన్నుల బంగారం మన దేశంలోని లాకర్లలో ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద ఉన్న పసిడి నిల్వల్లో 11.08 టన్నుల డిపాజిట్లు ఉండగా, FY23లో అవి 56.32 టన్నులుగా తేలాయి. మొత్తం నిల్వల్లో వీటిని కూడా కలిపి, పసిడి గణాంకాలను ఆర్‌బీఐ విడుదల చేసింది.విశేషం ఏమిటంటే, భారతదేశంలో బంగారం నిల్వలు పెరిగినప్పటి నుంచి విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా పెరిగాయి. భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో బంగారం ఒక ముఖ్యమైన భాగం. కాబట్టి, బంగారపు రాసులు పెరగడంతో విదేశీ మారక ద్రవ్య నిల్వల మొత్తం విలువ కూడా పెరిగింది. రిజర్వ్‌ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2022 సెప్టెంబర్ - 2023 మార్చి మధ్య కాలంలో, అంటే ఆరు నెలల్లో విదేశీ కరెన్సీ నిల్వల్లో బంగారం విలువ పెరిగింది, 7.81 శాతంగా ఉంది. 2022 సెప్టెంబర్ చివరి నాటికి ఇది 7.06 శాతంగా ఉంది. 2022 సెప్టెంబర్ - 2023 మార్చి మధ్య కాలంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 532.66 బిలియన్‌ డాలర్ల నుంచి 578.45 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది జనవరి-మార్చి కాలంలో ఆర్‌బీఐ వద్ద బంగారం నిల్వలు 7 టన్నులు పెరిగాయి. ప్రపంచంలోని మొత్తం బంగారం నిల్వల్లో 8 శాతం ఇప్పుడు భారత్‌ వద్ద ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన వద్ద బంగారం నిల్వలను గత ఐదారేళ్లుగా నిరంతరం పెంచుకుంటోంది. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో మందగమనం కారణంగా గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్‌లో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మెరుగైన రాబడి & సురక్షితమైన పెట్టుబడి కోసం గోల్డ్‌ మీద ఆర్‌బీఐ ఫోకస్‌ పెట్టింది, ఇదే కాకుండా, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (MAS), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, రిపబ్లిక్ ఆఫ్ టర్కీ సెంట్రల్ బ్యాంక్ గత కొన్నేళ్లుగా పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. సింగపూర్ సెంట్రల్ బ్యాంక్ గరిష్టంగా బంగారాన్ని కొనుగోలు చేసింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య, MAS మొత్తం 69 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేయడం ద్వారా విదేశీ మారక నిల్వలను పెంచుకోవడం వల్ల, డాలర్‌తో పోలిస్తే దేశ కరెన్సీలో స్థిరత్వం వస్తుంది.

Related Posts