విజయవాడ, మే 12,
వైసీపీ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అంటే యిదేదో జగన్ కు జనాదరణ బ్రహ్మాండంగా ఉందనడానికి తార్కానంఎంత మాత్రం కాదు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే జనాలు తమ సమస్యలను ప్రభుత్వానికి నివేదించుకునే అవకాశం యివ్వడమే. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నంబర్ ను కేటాయించింది.ఆ నంబర్ కే కాల్స్ వెల్లువెత్తాయి. రమారమి గంటకు250 చొప్పున కాల్స్ వస్తున్నాయి. అంటే జగన్ నాలుగేళ్ల కాలంలో సమస్యలు ఎంతగా పేరుకుపోయాయి అన్నది ఈ కాల్స్ ను బట్టే అవగతమౌతోంది. జనాలు ఈ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి చెప్పుకుంటే.. వారి సమస్య అలా పరిష్కారం అయిపోతుందన్నంత రేంజ్ లో ప్రచారం చేశారు. దీంతో జగన్ పాలనలో పేరుకుపోయిన సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నాలుగు గంటల్లో వెయ్యిమంది ఫిర్యాదులు చేశారంటేనే సమస్యలు ఏ స్ధాయిలో పేరుకుపోయాయన్నది అర్ధమైపోతోంది. నిజానికి ప్రజా సమస్యల పరిష్కారాలకే ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది.గ్రామస్ధాయి నుండి సెక్రటేరియట్ లో పనిచేసే అత్యున్నత స్ధాయి అధికారులందరు ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి. అయితే జగన్ హయాంలో ఆ దిశగా పనులు జరగడం లేదనడానికి జగనన్నకు చెబుతాం కార్యక్రమానికి ఈ స్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తడమే నిదర్శనం. రోడ్లు ,ఆరోగ్య కేంద్రాల పనితీరు, ఫించన్లు, రేషన్ వంటి సమస్యలే అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై సందేహాలు, అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. పాలనలో నాలుగేళ్లు పూర్తయ్యాయి. మరి నాలుగేళ్లలో చేయనిది, చేయలేనిదీ.. ఒక్క ఫోన్ కాల్ కు స్పందించి జగన్ ప్రభుత్వం చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధే కాదు.. సంక్షేమం కూడా అందని ద్రాక్షగానే మారిందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయన్నది కేవలం విమర్శే కాదు.. కాదనలేని వాస్తవం.