విజయవాడ, మే 12,
దేవాదాయ శాఖలో ప్రతి వ్యవహారం మంత్రి వర్సెస్ మాజీ మంత్రి అన్నట్టుగానే తయారవుతోంది. దుర్గగుడిలో ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ వర్గపోరు తాజాగా ఉద్యోగి నగేష్ అరెస్టుతో తెరమీదకు వచ్చింది. సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న వాసా నగేష్‌ను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇటీవల ఏసీబీ అరెస్టు చేసింది. గతంలో ద్వారకా తిరుమలలో ఉద్యోగం చేసినపుడు కూడా నగేష్ పై పలు ఫిర్యాదులు వచ్చి శాఖాపరమైన చర్యలు తీసుకున్న చరిత్ర ఉంది. అలాంటి వ్యక్తికి గుడిలో కీలక బాధ్యతలు ఎలా ఇచ్చారన్నది క్వశ్చన్. పాలక మండలి సమావేశంలో చర్చించి.. నగేష్‌కు బాధ్యతలు ఇవ్వవద్దని ఈఓ భ్రమరాంభకు చెప్పినా.. ఆమె అస్సలు పట్టించుకోలేదన్నది బోర్డ్ సభ్యుల ప్రధాన ఆరోపణ. ఇక్కడి వరకు పాలకమండలి వర్సెస్ ఈఓగా మాత్రమే నడిచిన వ్యవహారం సీన్ కట్ చేస్తే సీఎంవోకి చేరింది.ఈవో భ్రమరాంభ అవినీతిపై విచారణ జరిపించాలని పాలకమండలి ఛైర్మన్ రాంబాబు సీఎం జగన్ ను కలిసి వినతిపత్రం ఇవ్వటం ఆలయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. ఛైర్మన్ మీడియా సమావేశం పెట్టి మరీ… ఈఓపై విచారణకు డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ ఉన్నప్పటికీ పాలకమండలి ఆయనకు ఫిర్యాదు చేయలేదు. కమిషనర్ కు కూడా చెప్పకుండా నేరుగా సీఎంకి వెళ్ళడం కలకలం రేపింది. పాలకమండలి ఛైర్మన్ రాంబాబు… మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ వర్గంగా ఉన్నారు. వెల్లంపల్లి కనుసన్ననల్లోనే కొత్త పాలక మండలి ఏర్పాటైంది. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న దుర్గగుడిపై ఆధిపత్యం కోసం వెల్లంపల్లి, ఆ శాఖ మంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఇదే టైంలో ఉద్యోగి నగేష్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ కావటంతో వెల్లంపల్లి వర్గం టైం చూసి దెబ్బకొట్టిందట. నగేష్ దగ్గర భారీగా ఆస్తులు పట్టుబడటంతో.. పాలకమండలి నేరుగా సీఎంకు ఫిర్యాదు చేయటం, ఈఓపై విచారణ చేయాలనటం ద్వారా మంత్రిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందట.దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనను కాదని… దుర్గగుడి ఈఓపై సీఎంకు నేరుగా ఫిర్యాదు చేయటం మంత్రి కొట్టుకు ఆగ్రహం తెప్పించిందట. పాలక మండలి ఏర్పాటైన మూడు నెలలకే బాగా పనిచేయాలన్న అత్యుత్సాహంతో ఉన్నారని కామెంట్ చేశారు కొట్టు. ఆలయంపై ఆధిపత్యం కోసం కాకుండా నియమ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలంటూ పాలకమండలికి చురకలు వేశారు. పాలక మండలి ఫిర్యాదు చేసిన ఈఓ భ్రమరాంభ సమర్థంగా పనిచేస్తున్నారని, తప్పు చేసే ప్రతి ఉద్యోగికి ఈవో బాధ్యులవుతారా అన్నది ఆయన క్వశ్చన్. సీఎంకు ఫిర్యాదు చేసినా ఆయన తిరిగి తన దగ్గరకే పంపి చర్యలు తీసుకోమంటారంటూ వెలంపల్లి వర్గానికి షాక్ ఇస్తున్నారు మంత్రి. దుర్గమ్మ సాక్షిగా జరుగుతున్న ఈ వర్గపోరు ఎటు దారితీస్తుందో… ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.