కడప, మే 13,
ఫ్యాక్షన్, రాజకీయ రగడతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నియోజకవర్గం కడపు జిల్లా ప్రొద్దుటూరు. నిత్యం ఇక్కడ గొడవలు, రగడలే. ఇప్పుడు మరో వివాదంతో వైసీపీ, టీడీపీ నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు…రాయలసీమలో ముఖ్య వ్యాపార పట్టణమే కాదు.. రాజకీయాలకు కూడా ప్రధానమైన ప్రాంతమే.. రాయలసీమ స్థాయి రాజకీయాలు గతంలో ఇక్కడి నుంచే నడిచాయి. ఇక్కడి నేతల వ్యవహార శైలి, రాజకీయ ఎత్తుగడలు అన్నీ వెరైటీగా కనిపిస్తాయి. సేవ చేసినా.. రాజకీయాలు చేసినా, అది మంచైనా, చెడైనా ఇక్కడి ప్రతి పరిణామం రచ్చ కావాల్సిందే. దానిపై చర్చ జరగాల్సిందే. నాలుగేళ్లుగా ప్రొద్దుటూరు నియోజవకర్గంలో చోటు చేసుకున్న అనేక పరిణామాల్లో, అనేక అంశాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరో వారం పది రోజుల్లో రాజన్న భోజనం పేరుతో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడిదే ప్రొద్దుటూరు పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రాజన్న భోజనం పేరుతో శాశ్వతంగా నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు కూడా. ఇది ఎన్నికల స్టంట్ అనో… సేవ పేరుతో ఓటు బ్యాంకు కోసమో అనో ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోనని, మంచి పని చేయాలని సంకల్పించి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి. బాల్యంలో అర్థాకలితో గడిపిన రోజులు, ఆనాడు పడ్డ కష్టాలే నేడు ఈ పనికి పూనుకునేలా చేశాయని చెప్పొకొచ్చారు. అవసరమైతే మొబైల్ క్యాంటిన్ ను నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేస్తానని వెల్లడించారు.ఇంత వరకు బాగానే ఉంది…ఎమ్మెల్యే రాచమల్లు తాము పెట్టాలనుకుంటున్న అన్నా క్యాంటిన్లకు పోటీగా రాజన్న భోజనం కార్యక్రామం పేరుతో పోటీ అన్నదానం చేస్తున్నారంటూ టిడిపి నేత రమేష్ నాయుడు ఆరోపించడంతో అన్నదాన కార్యక్రమం కాస్త పొలిటికల్ ఈవెంట్‌గా మారిపోయింది. లోకేష్ యువగళం జిల్లా పాదయాత్రలో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అన్నా క్యాంటిన్లను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చి, నిరుపేదలకు ఉచితంగా అన్నదానం చేయాలని ముందే నిర్ణయించుకున్నామని, అయితే తమ ఉచిత అన్నదా కార్యక్రమం తెలుసుకుని….ఎమ్మెల్యే ఇప్పుడు ఇలా రాజన్న భోజనాన్ని ప్రకటించారన్న విమర్శలను ఎక్కుపెట్టారు.ఇదే సందర్భంలో ఎమ్మెల్యేపై ఘాటైన విమర్శలే చేశారు టీడీపీ నేత. గతంలో అన్నా క్యాంటిన్లను మూసివేసి, ఇప్పుడు ఎన్నికల కోసం రాజన్న భోజనం పెడతానని ముందుకు రావడం ఏమిటని ప్రశ్నలు వర్షం కురిపించారు. శాశ్వతంగా అన్నదానం చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే రాచమల్లు చెప్పిన మాటకు కట్టుబడతారా అని సూటిగా ప్రశ్నించారు. అన్నదాన కార్యక్రమ ప్రకటనలతో అధికార ప్రతి పక్ష పార్టీల మధ్య రాజకీయ వివాదం మొదలైంది. అయితే టిడిపి విమర్శలకు మళ్ళీ కౌంటరిచ్చారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. టిడిపి నేత సీఎం సురేష్ నాయుడు రాజకీయ దురుద్దేశంతో అన్నా క్యాంటిన్లు పెట్టినా ప్రజలకు మేలు జరుగుతుందని కాబట్టి స్వాగతిస్తున్నానని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. నాలుగేళ్ల కిందట మూతపడిన అన్నా క్యాంటిన్లను ఇంతకాలం ఎందుకు నిర్వహించలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అన్నాక్యాంటిన్ల పేరుతో అవినీతి జరుగుతోందని…అందుకే వైసిపి అధికారంలోకి వచ్చాక వాటిని తీసివేసిందని ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు.ఎమ్మెల్యే చెప్పినట్లుగా మరో వారం పది రోజుల్లో రాజన్న భోజనం…ఉచిత అన్నదాన కార్యక్రమం మొదలు కాబోతోంది. టిడిపి నేతలు కూడా ఈనెల 23న జిల్లాలోకి వస్తున్న లోకేష్ పాద యాత్రలో అన్నా క్యాంటిన్లను ప్రారభించాలని చూస్తున్నారు. దీంతో ప్రొద్దుటూరు అన్నదాన కార్యక్రమాలతో రాజకీయం వాడివేడిగా సాగనుంది. సేవా కార్యక్రమాల నిర్వహణలో రాజకీయాల కారణంగా వివాదం అవుతుందా.. లేక ఎవరి పని వారు చేసుకుపోతారా అన్నది చూడాలి.