YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఏడాది పాటు గులాబీ ఉత్సవాలు

ఏడాది పాటు గులాబీ ఉత్సవాలు

హైదరాబాద్, మే  13, 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ‘దశాబ్ది ఉత్సవాల’ నిర్వహిణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2014 జూన్‌ 2న తెలంగాణ ఏర్పడగా.. 2023 జూన్‌ 2వ తేదీన పదో వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ క్రమంలో గత తొమ్మిదేళ్ల అవలోకనాన్ని గుర్తుచేసుకుంటూ.. ఉత్సవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.రాష్ట్రం ఏర్పడిన రోజున వివిధ రంగాల్లో తెలంగాణ పరిస్థితి, ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను గణాంకాలతో సహా ప్రజల ముందుంచాలని భావిస్తోంది. ఎన్నికల ఏడాదికావడంతో.. క్షేత్రస్థాయిలో ఉత్సవాలతో ప్రజల మన్ననలు పొందాలనే ఆలోచనకు వచ్చింది. ఈ కార్యక్రమానికి జూన్‌ 1వ తేదీన శ్రీకారం చుట్టనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ఏటా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ ఏడాదిలో సాధించిన పురోగతికి సంబంధించిన వివరాలను అన్ని శాఖలు ప్రభుత్వానికి అందజేసేవి. ఈసారి కూడా అలా వివరాల సేకరణపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. అయితే ఒక్క ఏడాది కాకుండా.. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలోని అన్ని శాఖల పరిధిలో జరిగిన పురోగతి వివరాలను సేకరిస్తోంది. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ప్రతి శాఖ నుంచి పూర్తిస్థాయిలో వివరాలు తెప్పించుకుంటున్నారు. రెండు రోజుల్లో డేటా పంపాలని ఆర్థిక శాఖ నుంచి అన్ని శాఖలకు సమాచారం అందింది.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రత్యేకంగా ఈ పనిని పర్యవేక్షిస్తున్నారు. సేకరించిన వివరాలను ప్రత్యేకంగా క్రోడీకరించనున్నారు. సీఎస్‌ సూచనల మేరకు ప్రతి శాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన సావనీర్‌లను రూపొందించే పనిలో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది. ఈ సావనీర్‌లు, కాఫీ టేబుల్‌ కేలండర్లలో ఆయా శాఖల్లో 2014 నాటి పరిస్థితి ఏమిటి? ప్రస్తుత పరిస్థితి ఏమిటన్న వివరాలను పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇదే కసరత్తు జరుగుతోందితెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. ఆసరా పింఛన్ల పెంపు, రైతుబంధు, దళిత బంధు, కేసీఆర్‌ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సబ్సిడీ గొర్రెల పంపిణీ, ఉచిత చేప పిల్లల పంపిణీ, ధాన్యం ఉత్పత్తిలో రికార్డు, అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కొత్త మెడికల్‌ కళాశాలల ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్ట, బీసీ గురుకులాల ఏర్పాటు వంటివి.. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య రంగాల్లో అనేక మార్పులు తీసుకువచ్చాయి. ఈ పథకాలకు సంబంధించిన గణాంకాలతోపాటు.. వాటి అమలు ద్వారా వచి్చన మార్పును కళ్లకు కట్టినట్టు ప్రజలకు వివరించేలా ఈ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల మనన్నలు పొందేలా..ఎన్నికల ఏడాది కావడంతో గత తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం ద్వారా వారి మన్ననలు పొందడమే ఈ దశాబ్ది ఉత్సవాల ఉద్దేశమని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఏ పథకం అమలు చేసినా గణంకాలు మారుతుంటాయని.. కానీ ఆయా పథకాలు, ప్రాజెక్టుల ద్వారా సమాజంలో వచి్చన మార్పును వివరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు పాలనను చేరువగా తీసుకువచ్చామని.. ప్రతీ జిల్లాలో సమీకృత కలెక్టరేట్ల ద్వారా జిల్లా అధికార యంత్రాంగమంతా ఒకేచోట ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని వివరించనున్నట్టు సమాచారం. అద్భుతంగా నిర్మించిన నూతన సచివాలయం, తెలంగాణ ఏర్పాటుకు స్ఫూర్తి నిచి్చన బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహ స్థాపన, తెలంగాణ ఉద్యమం, అమరుల త్యాగాలను గుర్తు చేసుకునేలా అమరవీరుల స్మారకం, అమరజ్యోతి వంటి వాటిని సగర్వంగా చాటాలని భావిస్తున్నట్టు తెలిసింది.దశాబ్ధి ఉత్సవాలను ఈ ఏడాది జూన్‌ 1 నుంచి వచ్చే ఏడాది జూన్‌ 2వ తేదీ వరకు నిర్వహించాలని.. చివరి రోజున ప్రత్యేకంగా వేడుకలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ మధ్యలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. తొలుత ఈ ఏడాది జూన్‌ 1 నుంచి వారం రోజుల పాటు ఉత్సవాలకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ వారం రోజుల పాటు గ్రామస్థాయి నుంచి హైదరాబాద్‌ దాకా వివిధ దశల్లో ఉత్సవాలు నిర్వహించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన రూట్‌మ్యాప్‌ను ప్రభుత్వ వర్గాలు త్వరలో ఖరారు చేయనున్నాయి.
బడ్జెట్ లో భారీ కేటాయింపు
రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణలో భాగంగా 2023-24 బడ్జెట్‌లో ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంట్‌కు సుమారు వెయ్యి కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ కేటాయింపులను ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు ఖర్చు చేయాలని సర్కారు భావిస్తోంది. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రెండింటికి ప్రభుత్వ ప్రచారం కలిసి వస్తుందని భావిస్తోంది.ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందే విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సమాచార శాఖకు కేటాయించిన బడ్జెట్ నాలుగు నెలల్లో ఖర్చు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రభుత్వం తరపున చేస్తున్న ఖర్చు అనే విమర్శలు కూడా లేకపోలేదు.తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐ అండ్ పీఆర్ శాఖపై ఏనాడు పెద్దగా దృష్టి పెట్టని ముఖ్యమంత్రి ఇటీవలి కాలంలో రెండు, మూడు సార్లు ఆ శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు అర్థమయ్యే తీరుగా ప్రచారం చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఆ ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఉపయోగపడే విధంగా డిజైన్ చేయాలని సూచించినట్టు తెలుస్తోందిరాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబరులో షెడ్యూలు విడుదల కావొచ్చు. ఈ లోపు ప్రభుత్వం తరుపున ప్రకటనల రూపంలో భారీగా ఖర్చు పెట్టాలని యోచిస్తోంది. ఈ డబ్బును ఎలా ఖర్చు చేయాలి? ఏయే రాష్ట్రాల్లో ఖర్చు చేయాలి? అనే అంశాలపై సీఎం కేసీఆర్ స్వయంగా కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు వస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ప్రభుత్వం నుంచి ప్రకటనలకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయడానికి అవకాశం ఉండదు. షెడ్యూల్ కన్నా ముందే వాటిని ఖర్చు చేయాలని భావిస్తున్నారు.

Related Posts