YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టార్గెట్ లింగమనేని...

టార్గెట్ లింగమనేని...

విజయవాడ, మే 16, 
లింగమనేని రమేష్.. ప్రముఖ వ్యాపారవేత్త. ఎయిర్ కోస్టాకు ఆయన ఛైర్మన్. రియల్ ఎస్టేట్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. అంత వరకూ ఓకే. అయితే ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లింగమనేని రమేష్ ఎందుకు టార్గెట్ అయ్యారు? ఉండవల్లి కరకట్ట మీద ఉన్న అతిధి గృహాన్ని ఎందుకు ఏపీ సీఐడీ సీజ్ చేసింది. చంద్రబాబు అందులో ఉంటున్నందుకా? లేక లింగమనేని రమేష్ తో వైసీపీకి ప్రత్యేక మైన శత్రుత్వం ఉందా? అన్న ప్రశ్నలు అనేక మంది మదిలో ఉన్నాయి. లింగమనేని రమేష్ వ్యాపారవేత్త మాత్రమే కాదు రాజకీయ నేతలకు అత్యంత సన్నిహితుడు.  ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మాత్రమే కాదు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా ఆప్తమిత్రుడుగా ఉన్నారు. జనసేన పార్టీ కార్యాలయం నిర్మాణానికి లింగమనేని సహకారం కూడా ఉందంటారు. అసలు రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడానికి ప్రధాన కారణం లింగమనేని రమేష్ అన్నది కూడా రాజకీయ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తుంది. అందుకే వైసీపీ ప్రభుత్వం లింగమనేని రమేష్ ను టార్గెట్ చేసింది. ఆయన గెస్ట్ హౌస్ ను సీజ్ చేసిందని చెబుతున్నారు. గతంలోనూ ఒకసారి లింగమనేని గెస్ట్ హౌస్ పై కేసులు నమోదు చేసినా ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించి స్టేలు తెచ్చుకున్నారు.ఇక అమరావతి రాజధాని నిర్ణయం వెనక కూడా లింగమనేని రమేష్ ఐడియా ఉందనే వారు కూడా లేకపోలేదు. ఆయన చెప్పిన మీదటే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్న వాదన కూడా లేకపోలేదు. అక్కడ వేలాది ఎకరాలను ముందుగానే కొనుగోలు చేసిన లింగమనేని ఎస్టేట్ ఆ తర్వాత అక్కడ రాజధాని ప్రకటన వచ్చేలా చేశారంటారు. ఆయన కు అనుకూలంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు చేర్పులు జరిగాయని, ఇందులో క్విడ్ ప్రోకో జరిగిందని ఏపీ సీఐడీ ఆరోపిస్తుంది. అప్పటి సీఆర్డీఏ అధికారులను విచారించినప్పుడు అలైన్ మెంట్ ను ార్చాలని చెప్పింది మంత్రి నారాయణ అని, లింగమనేని రమేష్ భూములు, గెస్ట్ హౌస్ కు ఇబ్బంది కలగకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించారని వారు చెప్పడంతో కేసు నమోదు చేశారు.అయితే నిన్న మొన్నటి వరకూ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో దీనిపై ఏపీ సీఐడీ ఎలాంటి కేసులు నమోదు చేయలేకపోయింది. చర్యలు తీసుకోలేకపోయింది. కానీ ఇటీవల సుప్రీంకోర్టులో హైకోర్టు స్టే ఎత్తి వేయడంతో ఏపీ సీఐడీ మరోసారి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పులపై చర్యలకు దిగింది. నాలుగేళ్లు స్టేలపై నెట్టుకువచ్చినా, ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఎత్తివేయడంతోనే తాము చర్యలకు దిగామని ప్రభుత్వం వాదిస్తుంది. అందునా చంద్రబాబు, పవన్ ల మధ్య పొత్తు కుదరడానికి ప్రధాన కారకుడైన లింగమనేని రమేష్ ను ఆర్థికంగా నష్టపర్చాలన్న ఆలోచనే ఇప్పుడు కరకట్టపై ఉన్న గెస్ట్ హౌస్ ను అటాచ్ చేయడంతో పాటు అనేక బ్యాంక్ ఖాతాలను ఏపీ సీఐడీ సీజ్ చేసిందనే వారు కూడా లేకపోలేదు. మొత్తం ఏపీ పాలిటిక్స్ లోకి మరొకసారి లింగమనేని రమేష్ వచ్చారనే అనుకోవాలి.

Related Posts