అమలాపురం పట్టణంపై ఇక నుంచి నిఘా నేత్రాలు పనిచేయనున్నాయి. ఏపీ ఫైబర్ నెట్ వర్కింగ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పట్టణంలో సీసీ కెమెరాలు అమరిక పనులు జరుగుతున్నాయి. పట్టణంలో నెలకొల్పుతున్న 50 సీసీ కెమెరాలు పూర్తిగా ఆన్‌లైన్ విధానంతో ఆ సంస్థ పర్యవేక్షణలో పనిచేయనున్నాయి. వీటి నియంత్రణ అంతా విజయవాడలోని ఆ సంస్థకు చెందిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జరుగుతుంది. అక్కడి నుంచే అమలాపురం పోలీసు స్టేషన్‌కు అనుసంధానం అవుతుంది. పట్టణంలో ఎక్కడైనా చోరీలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తినా... కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో గమనించి తక్షణమే అమలాపురం పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తుంది. వారి సెల్‌ఫోన్లకు ఈ సర్వర్ అనుసంధానమై ఉండడం వల్ల వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే వీలుంటుంది. కొద్ది రోజుల్లోనే అమలాపురంలో సీసీ కెమెరాల వ్యవస్థ పనిచేయనుందని ఏపీ ఫైబర్ నెట్ వర్కింగ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. వీటితో పాటు స్థానిక మున్సిపాలిటీ కూడా పట్టణ ముఖ్య వ్యాపార కూడళ్లలో పలు వ్యాపార సంస్థల సహకారంతో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ సీసీ కెమెరాలు కూడా అందుబాటులోకి వస్తే పట్టణమంతా పూర్తిగా నిఘా నీడలోకి రానుంది.అటు ఇరుకు రోడ్లతో ట్రాఫిక్ పద్మవ్యూహం...ఇటు 122 మంది రౌడీ షీటర్లు, 178 సస్పెక్ట్ షీటర్లతో ఉండే పట్టణంలో క్రైమ్ రేటు కూడా అధికంగానే ఉంటుంది. ఈ క్రమంలో నేరాలు, ప్రమాదాల అదుపునకు పట్టణమంతా సీసీ కెమెరాలతో నిఘా అత్యవసరం. అందుకే ఏపీ ఫైబర్ నెట్ వర్కింగ్ లిమిటెడ్ పట్టణాన్ని సీసీ కెమెరాల నిఘా కిందకు తెస్తోంది. పట్టణంలో ఎంపిక చేసిన 19 ప్రధాన కూడళ్లలో 50 సీసీ కెమెరాల ఏర్పాటు పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే గడియారం స్తంభం సెంటర్, హైస్కూలు సెంటర్, ఎర్రవంతెన, నల్ల వంతెన, ఈదరపల్లి వంతెన, ముమ్మిడివరం గేటు సెంటర్, పేరూరు వై జంక్షన్ తదితర రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు పనులు పూర్తయయ్యాయి.పేరూరు వై జంక్షన్, గడియారం స్తంభం సెంటరు, హైస్కూలు సెంటరు, ముమ్మిడివరం గేటు సెంటరు, నల్ల వంతెన, ఎర్ర వంతెన ఈదరపల్లి వంతెన, సుబ్బారాయుడు చెరువు జంక్షన్, ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్, ఆర్టీసీ బస్ స్టేషన్ ఇన్‌గేట్, రాష్ట్ర హోం మంత్రి హౌస్ ఇన్ గేట్, ఎస్‌కేబీఆర్ కళాశాల, శ్రీదేవి అమ్మవారి ఆలయం, శ్రీదేవి మార్కెట్, గోల్డ్ మార్కెట్, సాకుర్రు టి.జంక్షన్, అమలాపురం రూరల్ మండలం, కిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాల గేట్–1, కిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాల గేట్–2, కనకదుర్గ ఆలయం, భటవిల్లి, అమలాపురం రూరల్ మండలం, సమనస, అమలాపురం రూరల్ మండలం.