బెంగళూరు, మే 16,
ఎప్పుడూ అంతా మనకు కలసి రాదు. ఏదో ఒకటి, రెండు సార్లు కలసి వచ్చిందని నమ్మి అదే ఫార్ములా వర్క్ అవుట్ అవుతుందని రాజకీయాల్లో ఉండటమూ సరికాదు. జేడీఎస్ పని ఇప్పుడు కర్ణాటకలో అంతే. ఎప్పుడూ 30 నుంచి నలభై స్థానాలకు మించి రాకపోయినా ముఖ్యమంత్రి పదవి దక్కుతుండటంతో కుమారస్వామి అదే ఫార్ములా ప్రతి ఎన్నికలో పనిచేస్తుందని భ్రమించారు. తాను కింగ్ మేకర్‌ను అవుతానని భ్రమించి ఈసారి భంగపడ్డారు. కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమై ముఖ్యమంత్రి పదవిని ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. అక్కడ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రధాన శత్రువులుగా ఉండటంతో కొన్ని సార్లు కుమారస్వామికి కలసి వచ్చింది. కానీ అన్ని రోజులూ మనవి కావు. కేవలం పాత మైసూరు ప్రాంతానికే పరిమితమైన జనతాదళ్ ఎస్ ఈసారి అక్కడ కూడా పెద్దగా విజయం సాధించలేకపోయింది. అక్కడ కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో నిలిచింది. ఒక్కలిగ సామాజికవర్గం కూడా ఈసారి కుమారస్వామి కుటుంబానికి హ్యండ్ ఇచ్చిందనే చెప్పాలి. డీకే శివకుమార్ కూడా అదే సామాజికవర్గం కావడంతో ఒక్కలిగలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు తప్పించి, కుమారస్వామి వైపు చూడలేదు. మరోవైపు జేడీఎస్ కుటుంబ పార్టీగా బలమైన ముద్ర పడింది. కుమారస్వామి నితిన్ గౌడ కూడా ఓటమి పాలయ్యారంటే ఏ మేరకు ఫలితాలు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. రామనగరలో ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. బలమున్న ప్రాంతాల్లోనే జేడీఎస్ బలహీనంగా మారిపోయింది. ఇందుకు కుటుంబంలో తలెత్తిన విభేదాలు కూడా కారణమని అంటున్నారు. ఎన్నికలకు ముందు రేవణ్ణ, కుమారస్వామిల మధ్య విభేదాలు కూడా ఈసారి ఎన్నికల్లో కొంపముంచాయంటున్నారు. కుమారస్వామి కష్టపడకుండానే గెలవాలనుకున్నారు. పార్ట్ టైం పొలిటీషియన్‌గా మారారన్న అపవాదును కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయంలోనే ఆయన ప్రజల మధ్యకు వస్తారని తర్వాత కనిపించరన్న ఆరోపణలు కూడా కుమారస్వామిపై ఉన్నాయి. దేవెగౌడ ఆరోగ్యంతో ఉన్నంత కాలం ఆయన పార్టీని సక్రమంగా చూసుకునేవారు. ప్రజల్లో తిరిగే వారు. కానీ కుమారస్వామికి అంత తీరిక లేదు. అన్ని సార్లు మనం అనుకున్నట్లు జరగవు. ఏదో ఒక ప్రాంతానికి పరిమితమై, ఒక సామాజికవర్గం మీద ఆధారపడితే చివరకు కుమారస్వామికి పట్టిన గతే పడుతుందని రాజకీయపార్టీలు గుర్తెరగాల్సి ఉంటుంది.