కర్నూలు, మే 24,
భీడు భూములను తడిపి రైతులకు సిరులు కురిపించేందుకు ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు పాలకులు, అధికారుల పుణ్యమానీ ఉత్తిపోతలుగా మిగిలాయి. మోటార్ల మరమ్మతులు, ఎత్తిపోతల పథక నిర్వహణ కోసం రైతుల నుంచి వసూలు చేసిన డబ్బులు పెద్దలు కాజేయడంతో పథకం అబాసు పాలైంది. పెద్ద రైతులేమో గానీ చిన్న సన్నకారు రైతులు పెద్దల తీరుతో తీవ్ర ఇబ్బందులేదుర్కొంటున్నారు. వీటిపై దృష్టి సారించాల్సిన అధికారులు, పాలకులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఫలితంగా రైతులు ఆశించిన స్థాయిలో పంటలు సాగు చేసుకోవడంలేదు. పథకం ప్రారంభించిన ఏడాది తప్ప నేటి వరకు పరిస్థితులు మరింత దయనీయంగా మారాయి. ఈ ఏడాదైనా నీటి సరఫరా చేసి పంటల సాగుకు సహకరించేలా చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామ శివారు ప్రాంతంలో 8,500 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు సంగమేశ్వరం, శివపురం ఎత్తిపోతల ప్రాజెక్టులను ఒకే చోట నిర్మించారు. శివపురం ఎత్తిపోతల కథకం కింద శివపురం, కొత్తపల్లె, గుమ్మడాపురం గ్రామాలకు చెందిన 2,405 మందికి చెందిన 3,500 ఎకరాలకు సాగు అందించేందుకు గానూ రూ.2526 లక్షలతో పథకాన్ని నిర్మించారు. అలాగే 3, 255 మంది రైతులకు చెందిన 5 వేల ఎకరాకు సాగు నీరు అందించేందుకు గానూ రూ.3,649 లక్షలతో 2014 ఫిబ్రవరి 26వ తేదిన ఈ పథకాలకు శంకుస్థాపన చేశారు. ప్రారంభించిన ఏడాదిలో రైతులకు పుష్కలంగా సాగు నీరు సరఫరా అయింది. ఆ తర్వాతి సంవత్సరం నుంచి సరైన రీతిలో నీరు సరఫరా కాకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు.నీటి కోసం కొన్ని సందర్భాల్లో రైతుల మధ్య గొడవలు చోటు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. రైతులకు సకాలంలో నీటిని సరఫరా చేసేందుకు, వాచ్ మెన్, మోటార్ల మరమ్మతుల కోసం ఎర్రమఠం, గుమ్మడాపురం, కొత్తపల్లె, శివపురం, సింగరాజుపల్లె, ముసలిమడుగు వంటి గ్రామాలకు చెందిన రైతుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. కానీ ఆ డబ్బులు పథకం నిర్వహణ కోసం ఖర్చు చేయకుండా పెద్దలు నిర్లక్ష్యం వహించారు. కొందరు పెత్తందార్లు డబ్బుల చెల్లించలేదు. దీంతో పెద్దరికంగా బాధ్యత తీసుకున్న కొందరు ఎర్రమఠం గ్రామానికి చెందిన రైతులు రైతుల డబ్బులను తమ సొంత ఖర్చుల కోసం వాడుకున్నారు. ప్రశ్నించిన వారికి ఎలాంటి సమాధానం చెప్పకపోవడమే కాకుండా రాజకీయం చేయడంతో నిలదీసేందుకు రైతులు ముందుకు రాలేదు.2016 నుంచి ఈ ఎత్తిపోతల పథకాలు నిర్వహణ లేమి కారణంగా ఆశించిన స్థాయిలో రైతులకు సాగు నీరు అందలేదు. అందుకు కారణాలు లేకపోలేదు. మోటార్లు కాలిపోవడంతో వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో ఎర్రమఠం గ్రామ పెద్దలు రైతులకు సాగు నీరు అందాలంటే ఎకరాకు రూ.500ల నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేశారు. ఇలా దాదాపు రూ.20 లక్షల వరకు వసూలు చేశారు. అందులో పెత్తందార్లు చాలా మంది ఎలాంటి డబ్బులు చెల్లించలేదు. పైగా వారిదే పెత్తనం కావడంతో ఆ రైతుల నిధిని గ్రామ పెద్దల వద్దే ఉంచుకు న్నారు. కానీ ఆ డబ్బులను ఏ పనికి వినియోగించిన దాఖలాల్లేవని రైతులు వాపోయారు. రైతుల నుంచి వసూలు చేసిన డబ్బలు ఏమైందో అడిగేందుకు కూడా రైతులు జంకుతున్నారు.ఈ సారి రైతులను పోగు చేసి రానున్న వర్షాకాలంలో డీసీల నుంచి నీటిని సరఫరా చేసేందుకు గానూ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సహకరించాలని కోరడం దురదృష్టకరం. గతంలో చెల్లించిన డబ్బుల లెక్కల వివరాలు చెప్పకుండా మళ్లీ డబ్బులు ఎందుకు చెల్లించాలంటూ కొందరు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఎత్తిపోతల పథకాల నిర్వహణను ఎవరూ పట్టించుకోక పోవడంతో వాటికోసం ఏర్పాటు చేసిన ఇనుప కంచెను గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. శివపురం ఎత్తిపోతల పథకం మాత్రం రైతుల సహకారంతో సజావుగా సాగుతోంది. వారి మాదిరిగానే సంగమేవ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణ బాధ్యతను నిబద్ధతతో కల్గిన రైతులకు అప్పగించాలని రైతులు కోరుతున్నారు.