YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఈ సారైనా కమల్ ఆశలు ఫలించేనా

ఈ సారైనా కమల్ ఆశలు ఫలించేనా

చెన్నై, మే 24,
అపజయాలతో ఢీలాపడిన ఉళగనాయగన్‌ కమల్‌ హాసన్‌ ఇప్పుడు తాజా చిత్రం విక్రమ్‌ 2 ఘన విజయంతో క్లౌడ్‌ నైన్‌లో ఉన్నారు. ఫ్లాపులతో ఆర్థికంగా కుదేలైన కమల్‌ను ఒడ్డున పడేసింది విక్రమ్‌ 2. హీరోగా కమల్‌ హాసన్‌కు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తమిళనాడులో పెద్ద ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. సిల్వర్‌ స్క్రీన్‌పై కమల్‌ నటనకును ప్రతీ ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే.విక్రమ్‌ టూ సక్సెస్‌ తర్వాత విక్రమ్‌ త్రీ కూడా సిద్ధమవుతోంది. అది కాకుండా ధనుష్‌తో ఒక చిత్రాన్ని కూడా కమల్‌ ప్లాన్ చేస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌ టూతో పాటు రజినీకాంత్‌తో మణిరత్నం రూపొందిస్తున్న దళపతి సీక్వెల్‌ కూడా పైప్‌లైన్‌లో ఉంది. సినిమాల పరంగా చూస్తే ప్రస్తుతానికి కమల్‌ వెరీ వెరీ బిజీ స్టార్‌ అనే చెప్పాలి. ఈ సినిమాలపై కమలే కాదు అభిమానులూ ఎన్నో హోప్స్‌ పెట్టుకున్నారు.వాస్తవానికి 2018లో వచ్చిన విశ్వరూపం 2 చిత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దాన్నుంచి కమల్‌ తేరుకోకముందే 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు ఓటర్లు ఆయనను, ఆయన పార్టీని పూర్తిగా తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన అందుకున్న విజయం విక్రమ్‌ టూ. ఆ సినిమా సాధించిన విజయం కమల్‌లోనే కాదు, ఆయన అభిమానుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. 2024 పార్లమెంట్‌ ఎలక్షన్లలో కమల్‌ పార్టీ మక్కల్‌ నీతి మయ్యానికి పట్టం కట్టాలని వారు కోరుకుంటున్నారు. విక్రమ్‌ చిత్రం ఒక్క తమిళనాడులో 200 కోట్లు వసూలు చేసింది. బాహుబరి 2 కలెక్షన్లను విక్రమ్‌ అధిగమించింది. అంతర్జాతీయంగా ఆ సినిమా 450 కోట్లు రాబట్టింది.మరి ఈ సక్సెస్‌ స్టోరీ, రాబోయే సినిమాలు పొలిటికల్‌గా కమల్‌ హాసన్‌ను విజయతీరాలకు చేర్చుతాయా? విక్రమ్‌ టూపై కలెక్షన్ల వర్షం కురిపించినట్టు తమిళ ఓటర్లు కమల్‌ పార్టీని ఆదరిస్తారా? తమిళనాట ఈ విషయాలపై చర్చ జరుగుతోంది. తమిళనాడు రాజకీయ చరిత్ర గురించి తెలిసిన వాళ్లు మాత్రం బాక్సాఫీస్‌ విజయాలు పొలిటికల్‌ సక్సెస్‌కు దారి తీసే పరిణామాలు ప్రస్తుతం లేవని విశ్లేషిస్తున్నారు. అయితే పాపులారిటీ పరంగా సినీ నేపథ్యం కొంత ఎడ్జ్‌ ఇస్తుందని అంటున్నారు. సినీరంగానికి చెందిన కరుణానిధి, జయలలిత, ఎంజీ రామచంద్రన్‌ వంటి వారు రాజకీయాల్లోకి ప్రవేశించి ఘనవిజయాన్ని అందుకువ్నారు. అనేకసార్లు సీఎం పదవి చేపట్టి తమిళనాడును పరిపాలించారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంతో పేరున్న చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ వంటి వారికి ఎదురైన చేదు అనుభవాలను ప్రస్తావిస్తున్నారు.కమల్‌ సూపర్‌ స్టార్ అయితే కావచ్చు. కానీ తమిళనాడుకు సంబంధించి ఆయన తన విజన్‌ వెల్లడించకపోతే ప్రజలను ఆకట్టుకోవడం కష్టమనే మాటలు వినిపిస్తున్నాయి. ఎంతో ఆశతో తమిళనాడులో కమల్‌ హాసన్‌ 2018లో మక్కల్‌ నీతి మయ్యం పేరుతో పార్టీని స్థాపించారు. కాని రాజకీయంగా తమిళనాడులో అది ఏ మాత్రం ప్రభావం చూపలేదు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కమల్‌ పార్టీకి వచ్చిన ఓట్లు 3.6 శాతం మాత్రమే. 201లో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో 2.6 శాతం, పుదుచ్చేరి ఎన్నికల్లో 1.89 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. ఈ అపజయాలు కమల్‌ హాసన్‌ను బాగా కుంగదీశాయనే చెప్పాలి.రాజకీయ నాయకుడిగా కమల్‌ హాసన్‌ కొంత గందరగోళంలో ఉన్నారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ద్రావిడ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండకపోతే తమిళనాడులో రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమని తేల్చిచెప్తున్నారు. అదే సమయంలో సినిమాలు, రాజకీయాల మధ్య బ్యాలెన్స్‌ చేసుకోవడం అంత తేలికైన విషయం కాదని కూడా హెచ్చరిస్తున్నారు. పాలిటిక్స్‌ను పార్ట్‌ టైమ్‌ హాబీగా తీసుకుంటే తమిళ ఓటర్లు ఆదరించారని అంటున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూ సీరియస్‌ పొలిటిషియన్‌ అని చెప్తే నమ్మేందుకు ప్రస్తుత ఓటర్లు సిద్ధంగా లేరని విశ్లేషిస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయంగా కమల్‌ హాసన్‌ ముందున్నవి రెండే ఆప్షన్లని తమిళ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకటి పార్టీకి ప్యాకప్‌ చెప్పడం, రెండు పొత్తు కుదుర్చుకొని పార్లమెంట్‌ సభ్యుడిగా అడుగుపెట్టడం. అయితే పొత్తు కుదుర్చుకుంటే అది మక్కల్‌ నీతి మయ్యం పార్టీకి ముగింపే అవుతుందన్నదే మాటలు వినిపిస్తున్నాయి. తమిళనాట ప్రస్తుతమున్న ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయమని చెప్పిన కమల్‌ ఇప్పుడు వాటితో పొత్తు పెట్టుకుంటే జనం ఆయనను నమ్మకపోవచ్చు.తాజా పరిణామాలు చూస్తుంటే పొత్తుకు సిద్ధమనే సంకేతాలు కమల్‌ నుంచి కనిపిస్తున్నాయి. ఈ మధ్య జరిగిన ఈరోడ్‌ ఉపఎన్నికలో ఆయన డీఎంకే కాంగ్రెస్‌ అభ్యర్థి ఇలంగోవన్‌కు మద్దతు ప్రకటించారు. అంతే కాదు విక్రమ్‌ సినిమా విజయోత్సవాల్లో డీఎంకే అధినేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి వేదికను పంచుకున్నారు. అన్నట్టు తమిళనాడులో విక్రమ్‌ సినిమా హక్కులను ఉదయనిధి స్టాలిన్‌ కొనుగోలు చేశారు. మరి ఈ పరిణామాలు కమల్‌కు ఏ మేరకు కలిసొస్తాయో చూడాలి. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేస్తే తమిళనాడు ఓటర్లు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో.

Related Posts