YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రెండు లక్షల మంది ఉద్యోగాలు ఔట్

రెండు లక్షల మంది ఉద్యోగాలు ఔట్

బెంగళూరు, మే 24, 
ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. ఐటీ రంగంలో సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. ఆయా కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ఆల్ టైం హైకి చేరింది. 2023, జనవరి ఒకటో తేదీ నుంచి మే 18వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా 696 కంపెనీలు.. రెండు లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఐటీ రంగం పుట్టినప్పటి నుంచి ఐదు నెలల్లో ఈ స్థాయిలో ఉద్యోగుల తొలగింపు అనేది జరగలేదని.. ఇది ఆల్ టైం హై అంటున్నారు నిపుణులు. ఐదు నెలల్లోనే ఈ స్థాయిలో ఊస్టింగ్స్ ఉంటే.. మిగిలిన ఏడు నెలల్లో ఇంకెన్ని లక్షల మంది ఉద్యోగం కోల్పోనున్నారు అనేది ఉద్యోగులను భయాందోళనలకు గురి చేస్తుంది. 2022 సంవత్సరం మొత్తం.. 12 నెలల్లో వెయ్యి 56 కంపెనీలు.. లక్షా 64 వేల మందిని ఐటీ ఉద్యోగులను తొలగించాయి. ఇది 12 నెలల రికార్డ్ అనుకుంటే.. అంతకు మించి.. ఏకంగా 2 లక్షల మంది ఉద్యోగులను.. కేవలం ఐదు నెల్లో.. 696 కంపెనీలు తీసివేయటం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. 2023లో ఉద్యోగులను ఇంటికి పంపించటంలో.. అమెజాన్, ట్విట్టర్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్,గూగుల్, అసెంచర్స్ వంటి బడా కంపెనీలు ఉండటం విశేషం. వీటితోపాటు డూంజో, షేర్ చాట్, రెబల్ ఫుడ్స్, భారత్ అగ్రీ, ఓలా వంటి కంపెనీలు సైతం తమ ఎంప్లాయిస్ సంఖ్యను భారీగా తగ్గించుకున్నాయి. యాపిల్ కంపెనీ ఒక్కటే ఇప్పటి వరకు ఉద్యోగులను తొలగించలేదని.. అయితే ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ తగ్గించినట్లు చెబుతున్నారు నిపుణులు.
2023 సంవత్సరం ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలంగా చెబుతున్నారు. డిసెంబర్ 31వ తేదీ నాటికి ఉద్యోగుల తొలగింపు సంఖ్య ఐదు లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఐటీ రంగంలోనే ఆల్ టైం రికార్డ్ అని భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఒక కారణం అయితే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ ప్రభావం మరో కారణంగా అంచనా వేస్తున్నారు. ఐటీ కంపెనీల ఆదాయం తగ్గిపోవటంతోపాటు.. నగదు నిల్వలను పెంచుకునే ఆలోచన చేయటం వలనే ఈ తొలగింపులు అని స్పష్టం చేస్తున్నాయి ఆయా కంపెనీలు. చాలా ఐటీ కంపెనీలు లాభసాటి లేని ప్రాజెక్టులను మూసివేస్తున్నాయి. ఈ క్రమంలోనే వందల మంది ఒక్కసారిగా రోడ్డున పడుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే.. ఇండియాపైనా ఈ ప్రభావం భారీగా ఉంది. ఇప్పటి వరకు ఇండియాలోని స్టార్టప్ కంపెనీలు 27 వేల మందిని తొలగించినట్లు అంచనా. పెద్ద కంపెనీల నుంచి 5 వేల మంది వరకు ఉద్యోగాలు కోల్పోయినట్లు చెబుతున్నారు నిపుణులు. మిగతా దేశాలతో పోల్చితే ఇండియా కొంచెం బెటర్ గా ఉన్నా.. రాబోయే రోజుల్లో తీవ్రత ఎంత అనేది స్పష్టంగా తెలుస్తుందంటున్నారు ఐటీ ఉద్యోగులు, నిపుణులు.

Related Posts