న్యూఢల్లీ, మే 24,
నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని మోదీ ప్రారంభించడంపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. దేశంలో అత్యున్నత రాజ్యాంగాధికారం ఉన్న రాష్ట్రపతిని వదిలేసి ప్రధానమంత్రి ప్రారంభించడం ఏంటని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ప్రధాని మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించాలని మొదట నిశ్చయించారు. అయితే దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్యాంగం ప్రకారం.. అత్యున్నత అధికారం కలిగిన వ్యక్తి భారత రాష్ట్రపతని, రాష్ట్రపతి చేత నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. రాష్ట్రపతి చేత కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ ఔచిత్యానికి ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకని ఆయన అన్నారు.రాహుల్ గాంధీ సైతం ఈ అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తుండడంపై కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనాన్ని భారత రాష్ట్రపతి ప్రారంభించాలని, ప్రధానమంత్రి కాదని ఆయన అన్నారు. ఆదివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాహుల్ స్పందిస్తూ ‘‘నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభించబడాలి. ప్రధానమంత్రి కాదు’’ అని హిందీలో ట్వీట్ చేశారుఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం స్పందిస్తూ ‘‘ప్రధానమంత్రి పార్లమెంటును ప్రారంభిండం ఏంటి? ఆయన శాసన సభకు కాదు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. రాజ్యంగం ప్రకారం.. మనకు అధికారాల విభజన స్పష్టంగా ఉంది. పార్లమెంట్‌కు అధిపతులు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. వారిచేత ప్రారంభించవచ్చు. పార్లమెంట్ నూతన భవనం ప్రజల సొమ్ముతో నిర్మించారు. ప్రధానమంత్రి తన స్నేహితుల డబ్బుతో నిర్మించినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారు?’’ అని ట్వీట్ చేశారు.