విజయవాడ, మే 25,
రాష్ట్రంలో అన్ని పార్లమెంటు నియోజక వర్గాల్లో పాగా వేయాలన్న వైసీపీ ఆశలు బెజవాడలో మాత్రం నెరవేరలేదు. సామాజిక సమీకరణలు, కుల ప్రభావంతో కొనసాగుతున్న సరళికి గండి కొట్టాలని వైసీపీ భావిస్తోంది.బెజవాడ పార్లమెంటు నియోజక వర్గంపై వైసీపీ జెండా ఎగురవేయాలని భావిస్తోన్న వైసీపీ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. వరుసగా రెండుసార్లు బెజవాడలో వైసీపీ అభ్యర్థులు ఓటమి పాలవ్వడంతో ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా పార్టీ జెండాను బెజవాడ వీధుల్లో రెపరెపలాడించాలని వైసీపీ భావిస్తోంది.విజయవాడలో గత నలభై ఏళ్లలో ఎంపీలుగా గెలిచిన అభ్యర్థులంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ అంశాన్నే ప్రధానాస్త్రంగా చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది. ఉమ్మడి కృష్ణా రాజకీయాల్లో తిరుగులేని ప్రభావాన్ని చూపించిన కమ్మ సామాజిక వర్గానికి చెక్ పెట్టడానికి బీసీ అభ్యర్దిని బరిలో దించాలనే ఆలోచన కూడా ఆ పార్టీలో ఉన్నట్టు తెలుస్తోంది.స్వాతంత్య్రం వచ్చిన తర్వత తొలిసారి జరిగిన ఎన్నికల్లో బెజవాడ నుంచి హరిశ్చంద్ర చటోపాధ్యాయ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 1957 నుంచి 80వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు. 1984లో టీడీపీ తరపున వడ్డే శోభనాద్రీశ్వరరావు గెలిచారు. అప్పటి నుంచి నలబై ఏళ్లుగా బెజవాడలో కమ్మ సామాజిక వర్గం తప్ప మరో వర్గానికి చెందిన అభ్యర్థికి అవకాశం లేకుండా పోయింది.1984 నుంచి బెజవాడ పార్లమెంటు అభ్యర్థి అంటే కేవలం ఓ సామాజిక వర్గానికి చెందిన వారికే అవకాశం ఉంటుందనే భావన ప్రజల్లో స్థిరపడిపోయింది. పార్టీలు ఏవైనా కేవలం కమ్మ అభ్యర్థులను మాత్రమే బరిలో దింపడానికి మొగ్గు చూపాయి. జనాభా పరంగా, ఓట్ల పరంగా అన్ని కులాలకు చెందిన వారు విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నా ఆర్ధికంగా పుష్కలంగా వనరులు ఉండటంతో పాటు, వ్యవసాయ రంగంలోను ఆధిపత్యం కలిగి ఉండటంతో పార్టీలన్ని ఆ కులానికే ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి.టీడీపీ ఆవిర్బావం తర్వాత ఈ భావన మరింత బలపడింది. కృష్ణా,గుంటూరు జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని పార్లమెంటు సభ్యులుగా ఎంపిక చేయడం అన్ని రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిపోయింది. 1980లో ఎంపీగా చెన్నుపాటి విద్య గెలిచారు. గోరా కుమార్తెగా గుర్తింపుతో పాటు, మెట్టినింటి గుర్తింపు కూడా ఆమెకు కలిసొచ్చాయి. ఆ తర్వాత వడ్డే శోభనాద్రీశ్వరరావు రెండు సార్లు టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు. 1996,98లో పర్వతనేని ఉపేంద్ర రెండుసార్లు ఎంపీగా గెలిచారు. 99లో గద్దె రామ్మోహన్, 2004,2009లో లగడపాటి రాజగోపాల్, 2014,19లో కేశినేని నానిలు ఎంపీలుగా గెలిచారు.బెజవాడ నుంచి ఎంపీలుగా గెలిచిన అభ్యర్థులు, పార్టీలు మారినా వారి సామాజిక వర్గాలకు మారకపోవడంపై వైసీపీ ఇప్పుడు దృష్టి పెట్టింది. 2014లో వైసీపీతరపున పారిశ్రామికవేత్త కోనేరు రాజేంద్రప్రసాద్ పోటీ చేశారు. 2019లో సినీ నిర్మాాత పొట్టూరి వరప్రసాద్ పోటీ చేశారు. 2019లో కేశినేని నాని 8726ఓట్ల తేడాతో గెలుపొందారు. వైసీపీ విజయవాడ నుంచి ఎంపీ అభ్యర్థులుగా కమ్మ వర్గానికి చెందిన అభ్యర్థులను పోటీలో నిలిపినా ఫలితం లేకపోవడంతో ఈసారి ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులను బరిలో దింపేందుకు సిద్ధమవుతోంది.విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఎందుకు అవకాశం ఇవ్వాలనే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని కలిసొస్తే ఆర్ధికంగా పుష్కలమైన వనరులు ఉన్న బలమైన బీసీ అభ్యర్థిని విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించినా ఆశ్చర్యం లేదంటున్నారు. గతంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం పార్లమెంటు నియోజక వర్గంలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉండేది.1989వరకు అక్కడ కేవలం కమ్మ అభ్యర్థులు మాత్రమే ఎంపీ అభ్యర్థులుగా ఉండేవారు. 1991లో కేపీ రెడ్డయ్యను టీడీపీ బరిలోకి దింపింది. ఆ తర్వాత బందరు పార్లమెంటు కాస్త బీసీ కోటాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం విజయవాడలో కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యానికి గండికొట్టడానికి, ఇతర కులాలను తమ వైపు ఆకర్షించడానికి వైసీపీ ఇదే ఫార్ములా అమలు చేస్తుందని చెబుతున్నారు. వైసీపీ తరపున ఎంపీగా ఎంట్రీ ఇచ్చే బీసీ అభ్యర్థి ఎవరనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది.