రాజమండ్రి, మే 25,
ఎన్నికలకు సమయం చాలానే ఉన్నప్పటికీ.. ముందు జాగ్రత్తగా మేనిఫెస్టోను సిద్ధం చేసుకుంటోంది తెలుగు దేశం పార్టీ. ఈ సంవత్సరం విజయదశమి పండగ రోజున మేనిఫెస్టోను రిలీజ్ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ప్రీ పోల్స్ వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మేనిఫెస్టోను రూపొందిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నిల్లో టీడీపీకి ఈ మేనిఫెస్టో అత్యంత కీలకంగా మారనుంది. వివిధ వర్గాల ప్రజలను తనవైపుకు తిప్పుకునేలా టీడీపీ మేనిఫెస్టోను రచిస్తోంది. పేదల సంక్షేమం, రైతులు, యువత లక్ష్యంగా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుత ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో లోటుపాట్లపై టీడీపీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తోంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించాలని భావిస్తోంది. ఇప్పటికే అధికార పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ.. అంతకు రెట్టింపు సంక్షేమ హామీని ఇస్తోంది టీడీపీ. తాజాగా రూపుదిద్దుకుంటున్న మేనిఫెస్టో సంక్షేమమే అజెండగా ఉంటుదని తెలుస్తోంది. రైతులు, యువతను లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్తున్న టీడీపీ.. మద్ధతు కూడగట్టుకునేందుకు రైతుల కోసం పలు పోరాటాలు చేస్తోంది. యువతకు కూడా మేనిఫెస్టోలో అధిక ప్రాధాన్యత కల్పిస్తోంది. గతంలో ఎన్నికల ముందు నిరుద్యోగులకు టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతిని చెల్లించింది. ఈ పథకాన్ని మెరుగుపరచడంతో పాటు పూర్తి స్థాయిలో యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది.పేద వర్గాలు ఉన్నత స్థాయికి చేరుకునేలా టీడీపీ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. రాష్ట్రంలోని పేద ప్రజల పరిస్థితి మెరుగయ్యేందుకు ఆర్థిక స్వావలంబన లభించే స్కీమ్‌లకు శ్రీకారం చుట్టనుంది. మహిళలకు కూడా మేనిఫెస్టోలో పెద్దపీట వేస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగు పెన్షన్లలో భారీ మార్పులతో పాటు సామాజిక భద్రత పెన్షన్ల విషయంలో కూడా తెలుగు దేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే టీడీపీ రూపొందిస్తున్న మేనిఫెస్టో అత్యంత కీలకంగా మారబోతోందని రాజకీయ వర్గాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.