దేశంలో పశ్చిమ, దక్షిణ రీజియన్ల కలుపుతూ ఏర్పాటు కాబోతున్న హై ఓల్టేజ్ డైరెక్ట్ కరెంట్ పథకానికి జూన్ నెలాఖరులోగా కడప, చిత్తూరు జిల్లాల నుంచి అటవీ శాఖ అనుమతులు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ తెలిపారు. దేశంలో అమలవుతున్న 13 కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిపై దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పీఎం నరేంద్రమోడి పలు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. పశ్చిమ, దక్షిణ రీజియన్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ ఏర్పాటు కాబోతున్న హై ఓల్టేజ్ డైరెక్ట్ కరెంట్ పనుల ప్రగతిని ప్రధానమంత్రి నరేంద్రమోడికి కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భళ్లా వివరించారు. నాలుగు రాష్ట్రాల నుంచి అటవీ హక్కుల(ఆర్.ఓ.ఎఫ్.ఆర్) గుర్తింపు రావాల్సి ఉందన్నారు. దీనిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఇప్పటికే కర్నూల్ జిల్లా నుంచి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ అందిందని, కడప, చిత్తూరు జిల్లాల నుంచి అటవీ హక్కుల అనుమతులు రావాల్సి ఉందని అన్నారు. జూన్ నెలాఖరులోగా ఈ అనుమతి పత్రాలు కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని సీఎస్ తెలిపారు.