న్యూఢిల్లీ, మే 26,
నూతన పార్లమెంట్ భవనంలో లోక్‌సభ స్పీకర్ కుర్చీ పక్కన రాజదండం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించింది. అప్పటి నుంచి రాజదండంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజదండం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం వెనక ప్రముఖ నృత్యకారిణి పద్మా సుబ్రహ్మణ్యంఉన్నట్టు తెలిసింది. ఆమె అభ్యర్థన మేరకే 1947లో కనుమరుగైన రాజదండం.. ఇప్పుడు పార్లమెంట్‌లో కొలువుతీరబోతోంది. రాజదండం గురించి ఓ తమిళ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆంగ్లంలోకి ఆమె అనువాదం చేసి ప్రధాని మోదీకి పంపారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు నాడు వెల్లడించారు.‘దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన చరిత్రాత్మక ఘడియల్లో అప్పటి మద్రాస్ రాష్ట్రం కీలక పాత్ర పోషించింది.. బ్రిటిషర్ల నుంచి అధికార బదిలీకి నిదర్శనంగా ఏం చేద్దామని భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. సి. రాజగోపాలాచారితో చర్చించారు.. 8వ శతాబ్దంలో చోళుల కాలం నుంచి రాజదండం చేతుల మారడం ద్వారా అధికార మార్పిడి జరుగుతూ వచ్చిన విషయాన్ని రాజాజీ వెల్లడించారు.. అలా 1947 ఆగస్టు 15న బ్రిటిషర్ల నుంచి జవహర్‌లాల్ నెహ్రూ రాజదండాన్ని అందుకున్నారు.. ఈ రాజదండం గురించి 2021 ఫిబ్రవరిలో ఓ తమిళ పత్రిక కథనాన్ని ప్రచురించింది.. దానిని నృత్యకారిణి పద్మా సుబ్రహ్మణ్యం ఆంగ్లంలోకి తర్జుమా చేసి, ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపి అది ఎక్కడో ఉందో తెలుసుకోవాలని అభ్యర్ధించారు.. అనంతరం దానిని ప్రయాగరాజ్‌లోని ఆనంద భవన్ మ్యూజియంలో గుర్తించాం’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు అంతేకాదు, దాని జాడ తెలుసుకునేందుకు రెండు సంవత్సరాలు పట్టిందని పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రాజదండాన్ని ఆవిష్కరణఖు ముందు జరిగే ప్రక్రియ గురించి కూడా ఆమె వివరించారు. ఆ వేడుకకు తిరువడుత్తురై ఆధీనానికి (శైవమఠం) చెందిన స్వామీజీలు హాజరుకానుండగా.. ప్రక్రియ అంతా ద్రవిడ సంప్రదాయంలో జరగనుంది. అనంతరం ఒక స్వామీజీ శుద్ధి చేసిన రాజదండాన్ని ప్రధానికి అందజేస్తారని, ఆయన దానిని స్పీకర్ ఛైర్ పక్కన ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. మొత్తం 20 మంది స్వామీజీలను అహ్వానించామని, పార్లమెంట్ భవనంలో ఆ రోజంతా శివనామస్మరణ చేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక, రాజదండాన్ని తయారుచేసి ఉమ్ముడి బంగారు జ్యువెల్లర్స్‌ను కూడా కార్యక్రమానికి ఆహ్వానించారు. తమిళ ఆలయ గాయకులు ‘కొలారు పదిగమ్’ నాదస్వరం కూడా ఏర్పాటు చేశారు.భారత్‌కు స్వాతంత్ర ప్రకటన సమయంలో సెంగోల్ స్వీకరణ ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా మీడియా ప్రచురించింది. ప్రఖ్యాత టైం మేగజీన్‌తోపాటు పలు అంతర్జాతీయ పత్రికలు గ్రాఫిక్స్‌తో దీనిపై కథనాలు వెలువరించాయి. దేశీయ పత్రికలు కూడా దీనికి అదే గౌరవాన్ని ఇచ్చాయి.ఇక, పద్మా సుబ్రమణ్యం ప్రముఖ భరతనాట్య కళాకారిణి. ఆమె తండ్రి సినీ నిర్మాత కాగా.. తల్లి సంగీతకారిణి. ఆమె 14 ఏళ్ల వయస్సు నుంచే ఇతరులకు నాట్యాన్ని నేర్పించడం మొదలుపెట్టారు. ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. భరత నాట్యానికి ఆమె చేసిన సేవలకుగానూ పద్మశ్రీ, పద్మభూషణ్ సహా పలు అవార్డులు వరించాయి.