హైదరాబాద్
యోగా మన జ్ఞానం, సంపద, జీవన విధానమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 25 రోజుల యోగా డే కౌంట్ డౌన్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలాగే తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర ఆయుష్, ఓడరేవుల, షిప్పింగ్ అండ్ జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, కార్మిక- ఉపాధి పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారు, కేంద్ర ఆయుష్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి ముంజపరా మహేంద్రభాయ్ కాళూభాయ్, సినీ, రాజకీయ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలాంటి కార్యక్రమం హైదరాబాద్ లో జరగడం ఎంతో గర్వకారణమన్నారు కిషన్ రెడ్డి.
భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. యోగా మన దేశంలో వేల సంవత్సరాల క్రితం పుట్టిందన్న కిషన్ రెడ్డి.. దానిని ప్రధాని మోదీ ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. జూన్ 21 యోగా దినోత్సవం రోజున అనేక దేశాల్లో ఉన్న వారు యోగా చేస్తారన్నారు. ఆ రోజు మన దేశంలోనూ ప్రతీ ఒక్కరూ యోగా చేయాలన్నారు. ఎవరి ఇంట్లో వారు.. ఎవరి గ్రామాల్లో వారు, ఎవరి బస్తీల్లో వారు యోగా చేయాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని మనిషిని సంలీనం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే శాస్త్రీయమైన పక్రియకు సరైన గౌరవాన్నిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న వేళ.. 100రోజులపాటు దేశవ్యాప్తంగా యోగా బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమం మార్చి 13న ప్రారంభమైందన్న కిషన్ రెడ్డి.. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నగరాల్లో జరిగిందన్నారు. దానిలో భాగంగానే 100 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమంలో ఢిల్లీలో, 75 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమం అస్సాంలో, 50 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమం జైపూర్ లో నిర్వహించామన్నారు. ఇప్పుడు 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమం హైదరాబాద్ లో ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగా సాధనను ప్రోత్సహించడంలో ఇది ఓ బెంచ్ మార్క్ గా నిలిచిపోనుందన్నారు. 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.