గుంటూరు, మే 29,
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశంలో క్యాష్ రిచ్ లీగ్ అయిన ఐపీఎల్ కు ఆదివారం రిటైర్మెంట్ ప్రకటించారు. గతంలో రిటైర్మెంట్ ప్రకటించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం రాయుడుకు అలవాటే. దాంతో మరోసారి అలా చేసే ఛాన్స్ లేదని నో యూటర్న్ అని క్యాప్షన్ తో ట్వీట్ చేశాడు. దాంతో రాయుడు నెక్ట్స్ స్టెప్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన పరిణామాలను గమనిస్తే అంబటి రాయుడు రాజకీయ అరంగేట్రం చేయడమే తరువాయి అనిపిస్తోంది. రాయుడు ఏం ప్రకటన చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో క్రికెటర్లు అజారుద్దీన్, నవజ్యోత్ సింగ్ సిద్దూ, గౌతమ్ గంభీర్.. రిటైర్మెంట్ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు.క్రికెటర్ అంబటి రాయుడు రెండు వారాల కిందట తాడేపల్లిలో సీఎం జగన్ కలిశారు. గత కొంతకాలం నుంచి ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ పాలను ప్రశంసిస్తూ రాయుడు ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో రాయుడు రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారని ప్రచారం జరిగింది. తనకు ప్రజలకు సేవ చేయాలని ఉందని, పాలిటిక్స్ పై ఆసక్తిగా ఉన్నట్లు స్వయంగా క్రికెటర్ రాయుడు కూడా చెప్పడంతో ఆయన త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని క్రికెట్ ఫ్యాన్స్ భావించారు. అంతా ఓకే అయితే వైసీపీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.జాతీయ జట్టుకు గతంలోనే రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు తాజాగా ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేశాడు. మిగతా టోర్నమెంట్లలో ఆడేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. రాయుడు వయసు 37 ఏళ్లు. గత రెండు సీజన్లుగా అతడి ఐపీఎల్ ఇన్నింగ్స్ గొప్పగా సాగడం లేదు. వచ్చేసారి ఫ్రాంచైజీ పక్కనపెట్టేలోగా తానే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పాడు. ఇటీవల సీఎం జగన్ ను కలిసిన రాయుడు క్రికెట్ అకాడెమీ పెట్టాలనే ఆలోచనను తెలిపినట్లు కూడా ప్రచారం జరిగింది. అకాడెమీకి భూమి అడిగేందుకు జగన్ ను కలిశారన్న వాదన ఉండగా, రాజకీయాల్లోకి వచ్చేందుకు ఏపీ సీఎంను కలిశారని ప్రచారం జరిగింది. ఏ విషయంపై సీఎం జగన్ ను కలిశారన్న దానిపై పార్టీ వర్గాలుగానీ, సీఎంవో గానీ ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో ఐపీఎల్ కు రిటైర్మెంట్ నిర్ణయంతో నెక్ట్స్ పొలిటికల్ గ్రౌండ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతారంటూ రాయుడు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.గుంటూరులో పుట్టిన అంబటి రాయుడు రాజకీయాల్లోకి రావాలని చాన్నాళ్ల నుంచి ఆలోచిస్తున్నాడు. హైదరాబాద్‌లో క్రికెటర్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ తన స్వస్థలం గుంటూరు కావడంతో ఏపీలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏపీలో బలమైన కాపు వర్గానికి చెందిన రాయుడు తన సొంత జిల్లా అయిన గుంటూరు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ వైసీపీ కాకపోతే వేరే పార్టీ నుంచి అయినా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.