తిరుపతి, మే 29,
సినీ ఇండస్ట్రీకి పాలిటిక్స్‌కు అవినాభావ సంబంధం ఉందన్నడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినీ రంగంలో ఓ వెలుగు వెలుగొందిన వారు అటు రాజకీయాల్లో సైతం తమదైన శైలిలో చక్రంతిప్పడమే అందుకు ఉదాహరణ. నందమూరి తారక రామారావు, ఎంజీఆర్, జయలలిత, ఆర్‌కే రోజా, నందమూరి బాలకృష్ణలే ఇందుకు నిదర్శనం. వీరితోపాటు దాసరి నారాయణరావు, కృష్ణంరాజు, కృష్ణ, జయసుధ, బాబూమోహన్, కోట శ్రీనివాసరావు, జీవిత రాజశేఖర్ దంపతులతోపాటు అనేకమంది నటీ, నటులు రాజకీయాల్లో రావడం తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. కొంతమంది నటులు ఏదో ఒక పార్టీకి ప్రచారానికో, మద్ధతుగానో నిలిచిన సంఘటనలు దేశవ్యాప్తంగా అనేకం ఉన్నాయి. ఇప్పటికీ సినీ గ్లామర్ పాలిటిక్స్‌లో కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇకపోతే టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేర్గాంచిన మోహన్ బాబు సైతం అటు సినీ ఇండస్ట్రీతోపాటు ఇటు పాలిటిక్స్‌లోనూ కీలకంగా వ్యవహరించారు. టీడీపీ తరపున రాజకీయారంగేట్రం చేసిన మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా సైతం పనిచేసిన సంగతి తెలిసిందే. అనంతరం 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం మోహన్ బాబు రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారు. మోహన్ బాబు కావాలనే సైలెంట్ అయ్యారా? మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రారా? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి తమ మద్దతు ప్రకటిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచితమైన వ్యక్తి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీలో తన కెరీర్‌ను ప్రారంభించిన మోహన్ బాబు అనంతరం విలన్‌గా, కామెడీ విలన్, హీరో, నిర్మాతగా సక్సెస్ అయ్యారు. సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు మోహన్ బాబు. సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు, రజనీకాంత్‌లతో సత్సంబంధాలు ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న తరుణంలో ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు టీడీపీలో చేరారు. టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అనంతరం ఆయన రాజకీయాలకు దూరమైపోయారు. ఎన్టీఆర్ మరణం అనంతరం టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం సినీ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేసుకుంటూ నెట్టుకొస్తున్నారు. ఇలాంటి తరుణంలో విద్యాసంస్థలను సైతం నెలకొల్పారు. శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను స్థాపించారు. దీనిలో అంతర్జాతీయ పాఠశాల, డిగ్రీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల, నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇటీవలే మోహన్ బాబు యూనివర్సిటీ కూడా స్థాపించిన సంగతి తెలిసిందే. టీడీపీకి దూరంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు కలిగే ఉన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. కొడుకులతో కలిసి రోడ్డెక్కారు. ఈ ఘటనలో కేసులను సైతం ఎదుర్కొన్నారు. అదే సమయంలో తనయుడు మంచు విష్ణు దివంగత సీఎం వైఎస్ఆర్ సోదరుడి కుమార్తెను వివాహం చేసుకోవడంతో వైఎస్ కుటుంబానికి మంచు ఫ్యామిలీ దగ్గరైంది. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మోహన్ బాబు సైలెంట్ అయిపోయారు.2019 ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబుకి సీఎం వైఎస్ జగన్ సముచిత స్థానం కల్పిస్తారని అంతా భావించారు. రాజ్యసభ లేదా ఎమ్మెల్సీగా అయినా ఛాన్స్ ఇస్తారని గుసగుసలు వినిపించాయి. లేని పక్షంలో టీటీడీ చైర్మన్ పదవి అయినా వరిస్తుందని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. చివరకు శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు సంబంధించి ఫీజు బకాయిలు సైతం విడుదల కాలేదని తెలుస్తోంది. దీంతో ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరమైపోయారు. అదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీని కుటుంబ సభ్యులతో కలవడం చర్చనీయాంశంగా మారింది. మోహన్ బాబు వైసీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరతారంటూ ఊహాగానాలు వినిపించాయి. అలాంటిదేమీ జరగలేదు.అయితే ప్రస్తుత రాజకీయాలపట్ల మోహన్ బాబు తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ‘నన్ను రాజకీయాలలో మోసం చేశారు..అయితే నన్ను వాళ్ళు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారని నేను ఎప్పుడూ చెప్పను. ఇక అన్న ఎన్టీఆర్ నన్ను ఆ కాలంలోనే రాజకీయాలలోకి రమ్మన్నారు. అయితే నేను ముక్కుసూటితనంగా వ్యవహరించే తీరు రాజకీయాలకు పనికిరానని చెప్పాను. రాజకీయాలలో ప్రత్యర్థులకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేయాలి అప్పుడే మనం రాజకీయాలలో ఉండగలం లేకపోతే రాజకీయ సన్యాసం తప్పనిసరి. ఇలాంటి ఎత్తులు నాకు వెయ్యరాదు. అందుకే నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. అంతే తప్ప నన్ను ఎవరు రాజకీయాలలో వెనక్కి లాగలేదు’ అని మోహన్ బాబు తెలిపారు.వైఎస్ జగన్ కుటుంబంతో బంధుత్వం ఉన్న నేపథ్యంలో గత ఎన్నికల్లో ప్రచారం చేసినట్లు తెలిపారు. అయితే ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. మోహన్ బాబు వ్యాఖ్యలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.