YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ

అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ

విజయవాడ, జూన్ 1, 
టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఇండిపెండెంట్ గా గెలుస్తానేమో? అంటూ మనసులో మాట బయటపెట్టారు. ఏ పిట్టల దొరకు టికెట్ ఇచ్చినా తనకు ఇబ్బంది లేదన్నారు.టీడీపీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఒకవైపు వైసీపీ, టీడీపీ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంటే... కేశినేని నాని వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో అటు అధిష్ఠానం, ఇటు పార్టీ కేడర్ కేశినేని తీరుపై మింగుడు పడడంలేదు. కేశినేని బ్రదర్స్ మధ్య తలెత్తిన విబేధాలు పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయంటున్నారు కొందరు నేతలు. తాజాగా ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకలం రేపుతున్నాయి. వైసీపీ ప్రజాప్రతినిధులు బాగా పనిచేస్తారని, సమస్యలు ఏవైనా వెంటనే పరిష్కారం చూపుతారంటూ ఎంపీ కేశినేని నాని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని సంకేతాలు ఇస్తున్నారు. రేపు ఏ పిట్టల దొరకు టికెట్ వచ్చినా నాకు ఇబ్బంది లేదన్నారు. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా గెలుస్తానేమో? అన్నారు.ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఎంపీ కేశినేని నాని అన్నారు. ప్రజల కోసం ఒక పార్టీ ఎంపీ, మరో పార్టీ ఎమ్మెల్యే కలిసి పనిచేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఇది తన అభిప్రాయం అన్నారు. దీనిని ఇతర రాజకీయ పార్టీలు, వ్యక్తులు ఎలా తీసుకున్నా తనకేం భయంలేదన్నారు. ఈ పార్టీ టికెట్ ఇస్తుందా? మళ్లీ ఎంపీ అవుతానా? అనే భయం తనకు లేదన్నారు. పదేళ్లలో తాను చేసిన అభివృద్ధి పనులు దేశంలో ఇంకెవరైనా చేశారో చూపండన్నారు. విజయవాడ అభివృద్ధికి దిల్లీ స్థాయిలో ఏదైనా చేయించగలన్నారు. పార్టీ ఐడియాలజీ కోసం పోరాడాలి కానీ, పిచ్చి గోల ఏంటని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు కాదు వేదికలు మాత్రమేన్న కేశినేని నాని, మాకు చంద్రబాబు నాయకుడు, వాళ్లకు జగన్ నాయకుడు అని స్పష్టం చేశారు. జగన్, చంద్రబాబు విరోధంగా ఉన్నారు తప్ప మిగతా వాళ్లెవరూ విరోధులు కాదన్నారు. తాను ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తానని చెప్పారు.మరోవైపు కేశినేని నానిపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రశంసలు కురిపించారు. ఎంపీ కేశినేని నానితో కలిసి పనిచేస్తామన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు తర్వాత కేవలం అభివృద్ధి మాత్రమే నాని నినాదం అన్నారు. తనది అదే అభిప్రాయమన్నారు. పార్టీలు వేరైనా అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు. ఎంపీ కేశినేని నాని మైలవరం కోసం రూ.3 కోట్ల నిధులు ఇచ్చారని వసంత కృష్ణ ప్రసాద్ గుర్తుచేశారు. కేశినేని తాత, మా నాన్న పార్టీలు వేరైనా అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు. పార్టీల గురించి వ్యక్తిగత విభేదాలు పెట్టుకోకూడదన్నారు. ఇటీవల సుజనా చౌదరిని కూడా నిధులు అడిగానన్నారు. కొండపల్లి ఎన్నికల్లో ఇరువురం మా పార్టీల కోసం గట్టిగా పనిచేశామన్నారు వసంత కృష్ణ ప్రసాద్.విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు ఇటీవల టీడీపీలో కలకలం రేపాయి. ఇన్నాళ్లు అసంతృప్తితో ఉన్నా ఎప్పుడూ పార్టీపై కామెంట్స్ చేయని ఆయన.. ఏకంగా వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి కోసం వైసీపీతో కలిసి పనిచేస్తానని అనడంతో టీడీపీ నేతలు ఇరుకున పడ్డారు. నందిగామలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ బాగా పనిచేస్తున్నారని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ప్రశంసలు కురిపించారు. ఎమ్మెల్యే జగన్మోహన్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషిచేస్తు్న్నారన్నారు. టీడీపీ, వైసీపీ సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని చెప్పుకొచ్చారు.

Related Posts