హైదరాబాద్, జూన్ 1,
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. అయితే సీబీఐ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్తుందో వేచిచూడాలి.కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో అవినాష్ రెడ్డికి ఊరట లభించినట్లు అయింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గత కొన్ని రోజులగా హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. బెయిల్ కోసం అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. అయితే తాజాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అవినాష్ వర్గం ఊపిరిపీల్చుకుంది. బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ గట్టిగా వాదనలు వినిపించినా ఫలితంలేకపోయింది. సీబీఐ వాదనలతో ఏకీభవించని హైకోర్టు అవినాష్ కు బెయిల్ గ్రాంట్ చేసింది. ఇప్పుడు సీబీఐ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.వివేక హత్య కేసు విచారణలో ఎంపీ అవినాష్ రెడ్డి సహకరించడంలేదని సీబీఐ వాదనలు వినిపించింది. విచారణలో అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని అభియోగించింది. అవినాష్ అనుచరులు సాక్షులను బెదిరిస్తున్నారని సీబీఐ తెలిపింది. హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు జరిగింది. ఈ వాదనల్లో సీబీఐ పలు కీలక విషయాలు ప్రస్తావించింది. వివేకా హత్యకు మూడు నెలల ముందే కుట్ర జరిగిందని తెలిపింది. రాజకీయ కోణంలోనే హత్య జరిగిదని వెల్లడించింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ఓ సీల్డ్ కవర్‌లో సాక్షుల వాంగ్మూలాలు సమర్పిస్తామని చెప్పింది. పిటిషనర్‌కు సాక్షుల వివరాలు ఇవ్వలేమని, వారిని బెదిరించే అవకాశం ఉందని సీబీఐ చెప్పింది. విచారణలో ఓ కీలక సాక్షి ఉన్నారని, ఆ వాంగ్మూలం పరిశీలించాలని కోర్టును కోరింది. హత్య జరిగిన రోజున నిందితుడు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారని ఎలా చెప్తారని కోర్టు ప్రశ్నించింది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే మేనేజ్ చేసి ఉండొచ్చు కదా హత్య చేయాల్సిన అవసరం ఏముందని కోర్టు సీబీఐని ప్రశ్నించింది.ఎంపీ అవినాష్ రెడ్డి తల్లికి గుండెపోటు రావడంతో ముందుగా ఆమెను కర్నూలులోని ఆసుపత్రికి తరలించారు. సీబీఐ విచారణకు వెళ్లాల్సిన అవినాష్ రెడ్డి... గైర్హాజరై కర్నూలు వెళ్లారు. అయితే విచారణను తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి సాకులు చెబుతున్నారని ఆయనను అరెస్టు చేస్తామని సీబీఐ అధికారులు కర్నూలు వెళ్లింది. కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్న అవినాష్ రెడ్డి అరెస్టు చేయకుండా వైసీపీ ఎమ్మెల్యే, పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయని విమర్శలు వచ్చాయి. అనంతరం అవినాష్ రెడ్డి తల్లిని హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ముందస్తు బెయిల్ పై ముందు తాత్కాలిక తీర్పు ఇచ్చిన కోర్టు... బుధవారం తుది తీర్పు ఇచ్చే వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దని తీర్పు ఇచ్చింది. తాజాగా తుదితీర్పు ఇస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.