గుంటూరు, జూన్ 1,
వ్యవసాయంలో ప్రయివేటు సంస్థల భాగస్వామ్యం పెరుగుతోంది. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో పత్తి సాగులో ఆధునిక పద్ధతుల పేరుతో మోడల్ ప్లాంట్లను ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలతో కలిపి ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు మన రాష్ట్రాన్నీ ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టుకు విత్తన కంపెనీల అసోసియేషన్ భాగస్వామ్యం ఎక్కువగా కల్పించింది. 2023-24 వ్యవసాయ సంవత్సరంలో రాష్ట్రంలోని ఆరు జిల్లాల పరిధిలో 17 క్లస్టర్లను ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్ర వ్యవసాయ శాఖ ఇటీవల లేఖ రాసింది. అనంతపురం జిల్లా గుత్తి, పెద్దఒడుగూర్, గుంటూరు జిల్లా యడ్లపాడు, పత్తిపాడు, వట్టి చెరకూరు, కృష్ణా జిల్లా ఎ.కొండూరు, మైలవరం, కర్నూలు జిల్లా ఆదోని, నంద్యాల జిల్లా నంద్యాల, పల్నాడు జిల్లా దాచేపల్లి, గురజాల, కారంపూడి, మాచవరం, మాచర్ల, పిడుగురాళ్ల, అచ్చంపేట తదితర ప్రాంతాలను ఈ క్లస్టర్లకు ఎంపిక చేశారు. మొత్తం 861 మంది రైతుల పొలాల్లో పత్తి సాగు ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క క్లస్టర్‌లో ప్లాంట్‌ను 3,650 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) ఆధ్వర్యంలో రూ.41.86 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్న కేంద్ర వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమ విభాగం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో తెలిపింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించడం, నాణ్యమైన ఉత్పత్తులను సాధించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ఎంపిక చేసినట్టు పేర్కొంది. నాగపూర్‌లోని భారత పత్తి పరిశోధన సంస్థ (ఐసిఎఆర్), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చి పర్యవేక్షణలో ఈ ప్లాంట్లను ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండిస్టీ (ఎఫ్‌ఎస్‌ఐఐ), నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో నిర్వహించేలా భాగస్వామ్యం కల్పించారు. జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం పంపిన రైతుల జాబితాలను నాగపూర్‌లోని భారత పత్తి పరిశోధన సంస్థ (ఐసిఎఆర్), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చి పరిశీలించి ఈ ప్రాజెక్టుకు రైతులను ఎంపిక చేయనుంది. ఇందుకయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. నూజివీడులోని జాతీయ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌ఎఐ) రైతులకు ఇన్‌పుట్స్‌ను సరఫరా చేస్తుంది. నాగపూర్‌లోని భారత పత్తి పరిశోధన సంస్థ (ఐసిఎఆర్), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చి పర్యవేక్షణలో ఈ ప్లాంట్లను ఫెడరేషన్ ఆఫ్ సీడ్ ఇండిస్టీ (ఎఫ్‌ఎస్‌ఐఐ) రైతులకు సాంకేతిక శిక్షణ అందిస్తాయి. దేశంలో పత్తి విస్తీర్ణం పెంచాలని, ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ఆర్గానిక్ కాటన్ డిమాండ్‌కు అనుగుణంగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు వ్యవసాయ శాఖాధికారులు తెలిపారు. నేషనల్ సీడ్ అసోసియేషన్ రైతులకు ఏ విధంగా సహాయం చేస్తుంది? ఏ శాఖ అధికారులు ఎంతవరకు భాగస్వామ్యం అవుతారు? రైతులకు జరిగే ఉపయోగాలపై ఇంకా నిర్దిష్టంగా ఆదేశాలు విడుదల కాలేదు.