న్యూఢిల్లీ, జూన్ 1,
ప్రపంచ తయారీ రంగంలో భారత్ సరికొత్త మైలురాయిని చేరింది. "గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్"గా మారాలన్న భారత ప్రభుత్వ సంకల్పం నెరవేరుతోంది. ప్రపంచంలోనే అత్యంత చవకైన/తక్కువ తయారీ వ్యయం ఉన్న దేశాల్లో భారత్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. చైనా, వియత్నాం లాంటి ఘనాపాఠీలను దాటుకుని భారత్ ఈ ఘనత సొంతం చేసుకుంది. ది వరల్డ్ ర్యాంకింగ్ ఈ రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. కొత్త డేటా ప్రకారం, 2023 సంవత్సరంలో, తయారీ పరంగా భారతదేశం 100కు 100 శాతం స్కోర్ చేసింది. గత ఏడాది అమెరికా మీడియా కూడా ఒక సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసింది. తయారీ రంగంలో చైనా, వియత్నాం దేశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, ప్రపంచ దేశాలతో పోలిస్తే తయారీ వ్యయం భారత్‌లోనే అతి తక్కువని ఆ రిపోర్ట్‌లో వెల్లడించింది. గతంలో, MNCలు తమ ఫ్లాంటును విదేశాల్లో ఏర్పాటు చేయాలనుకుంటే, చైనా లేదా వియత్నాం మాత్రమే వాటికి గుర్తుకొచ్చేవి. కరోనా కాలం నుంచి పరిస్థితులు మారిపోయాయి. డ్రాగన్ కంట్రీ విధించిన కఠిన కొవిడ్-19 ఆంక్షలు ఆ దేశ తయారీ & ఉత్పత్తి రంగాలను తీవ్రంగా దెబ్బతీశాయి. వియత్నాంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో, 'చైనా ప్లస్' స్ట్రాటెజీని అమెరికా, యూరోపియన్ కంట్రీస్ అనుసరించాయి. తమ తయారీ కేంద్రాలను చైనాలో కేంద్రీకృతం చేయకుండా, మరో దేశంలోనూ పెట్టుబడులు పెట్టడం ఈ వ్యూహం అంతరార్థం. ఆ వెదుకులాటలో యూఎస్ & యూరోపియన్ కంపెనీలకు వాటికి కనిపించిన ఫైనల్ డెస్టినేషన్ భారత్. కొవిడ్-19ను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొని, కరోనా కాలంలోనూ GDP వృద్ధి రేటును పెద్దగా కుంటుపడనీయకుండా చూసిన భారత్ సామర్థ్యం ఫారిన్ ఇన్వెస్టర్లను ఆకర్షించింది. దీంతోపాటు, 'మేక్ ఇన్ ఇండియా' కింద వివిధ పథకాలను ఇండియన్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. వాటి ద్వారా తయారీ రంగాన్ని భారీగా ప్రోత్సహిస్తోంది. స్వదేశీ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలకు కూడా రాయితీలు ఇస్తోంది. ఇవన్నీ కలిసి ఇండియాలో తయారీ వ్యయాన్ని చౌకగా మార్చాయి.ప్రపంచంలోనే చౌకైన తయారీ వ్యయంలో భారతదేశం ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. మన తర్వాత, 2, 3 ర్యాంకుల్లో చైనా, వియత్నాం ఉన్నాయి. థాయిలాండ్ 4వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో ఫిలిప్పీన్స్, 6వ స్థానంలో బంగ్లాదేశ్, 7వ స్థానంలో ఇండోనేషియా, 8వ స్థానంలో కాంబోడియా, 9వ స్థానంలో మలేషియా, 10వ స్థానంలో శ్రీలంక ఉన్నాయి.మన దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న భారత ప్రభుత్వం, 'మేక్ ఇన్ ఇండియా'తో పాటు, 'ఆత్మనిర్బర్ భారత్' కూడా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం కింద, దేశానికి అవసరమైన ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కాకుండా, స్వదేశంలోనే తయారు చేసేలా దేశీయ కంపెనీలను ప్రోత్సహిస్తోంది. తద్వారా దేశంలో తయారీ సామర్థ్యాన్ని పెంచుతోంది. తయారీ సామర్థ్యం పెరగడం వల్ల, ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయిచైనా తయారీ రంగ పరిస్థితులు ప్రతికూలంగా మారడం భారత్‌కు కలిసి వస్తోంది. చైనాలో ఉన్న విదేశీ కంపెనీలు ఇప్పుడు భారతదేశంలో తయారీ అవకాశం కోసం చూస్తున్నాయి. కొంతకాలంగా, మొబైల్ నుంచి ఆటోమొబైల్ వరకు చాలా వ్యాపారాల్లో వేగంగా పెరిగింది, ఇది కూడా విదేశీ కంపెనీల దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి కారణాలతో, విదేశీ కంపెనీలు చైనా నుంచి భారత్‌కు వస్తున్నాయి. ఇటీవలే, శాంసంగ్ భారతదేశంలో తన కార్యాలయాన్ని ప్రారంభించింది. అదే సమయంలో, ఆపిల్ చైనాలో వ్యాపారం తగ్గించుకుని, భారత్‌లో రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. ఆపిల్ ప్రొడక్ట్స్‌ను తయారు చేసే ఫాక్స్‌కాన్ కూడా భారత్‌లో కొత్త ప్లాంట్లను ఓపెన్ చేస్తోంది. చైనీస్ కంపెనీ Xiaomi సహా మరికొన్ని కంపెనీలు కూడా భారతదేశంలో తమ తయారీ యూనిట్లను ప్రారంభిస్తున్నాయి.