YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో పెరిగిన అండర్ గ్రౌండ్ వాటర్

ఏపీలో పెరిగిన అండర్ గ్రౌండ్ వాటర్

విజయవాడ, జూన్ 3,
ప్రస్తుత నీటి సంవత్సరంలో రాష్ట్రంలో భూగర్భజలాల్లో 650.22 టీఎంసీలు మిగిలాయి. నీటి సంవత్సరం జూన్‌ 1తో ప్రారంభమై మరుసటి ఏడాది మే 31తో ముగుస్తుంది. ప్రస్తుత అంటే 2022–23 నీటి సంవత్సరం మరో మూడురోజుల్లో ముగియనుంది. రాష్ట్రంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల సగటున 967 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 1,046.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.వర్షాలు సమృద్ధిగా కురవడం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ చర్యల వల్ల రికార్డు స్థాయిలో వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకింది. భూగర్భజలాలు 961.42 టీఎంసీలయ్యాయి. ఇందులో సాగు, తాగు, గృహ తదితర అవసరాలకు 913.35 టీఎంసీలు వినియోగించుకోవడానికి వీలుందని భూగర్భజలవనరుల అధికారులు లెక్కగట్టారు.కానీ నీటి సంవత్సరం ముగింపు దశకు చేరుకునేటప్పటికి అంటే ఆదివారానికి కేవలం 263.13 టీఎంసీల భూగర్భజలాలను మాత్రమే ప్రజలు వినియోగించుకున్నారు. దీంతో భూగర్భజలాల్లో 650.22 టీఎంసీలు మిగిలాయి. జలసంరక్షణ చర్యల ద్వారా వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భంలోకి ఇంకేలా చేసి, భూగర్భజలాలను పెంచడంతోపాటు వాటిని పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా భూగర్భజలాల పరిరక్షణలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని అధికారవర్గాలు తెలిపాయి.  అక్టోబర్‌ ఆఖరుకు వర్షాకాలం ముగిసిన తరువాత నవంబర్‌లో రాష్ట్రంలో భూగర్భజలాలు సగటున 6.13 మీటర్లలో లభ్యమయ్యేవి. రాష్ట్రంలో 15 లక్షల వ్యవసాయ బోరుబావులను భూగర్భజలవనరుల శాఖ జియోట్యాగింగ్‌ చేసింది.వాటికి అదనంగా మరో లక్షకుపైగా వ్యవసాయ బోరుబావులు ఉంటాయని అంచనా. భూగర్భజలమట్టాన్ని 1,806 పిజియోమీటర్ల ద్వారా భూగర్భజలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు లెక్కిస్తూ పర్యవేక్షిస్తున్నారు. రబీలో, వేసవిలో సాగు, తాగు, గృహ అవసరాల కోసం బోరుబావుల నుంచి భారీ ఎత్తున ప్రజలు నీటిని తోడేశారు.తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 3.95 మీటర్ల మేర భూగర్భజలాలను తోడేయగా, నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 0.37 మీటర్ల మేర భూగర్భజలాలను వినియోగించుకున్నారు. వర్షాభావ ప్రాంతాలైన అనంతపురం జిల్లాలో 2.79, శ్రీసత్యసాయి జిల్లాలో 3.29 మీటర్ల మేర రబీలో భూగర్భజలాలను వినియోగించుకున్నారు. నవంబర్‌ నుంచి మే వరకు సగటున 2.54 మీటర్ల మేర భూగర్భజలాలను వాడుకోవడంతో భూగర్భజలమట్టం 8.67 మీటర్లకు పడిపోయింది. నీటి సంవత్సరం ముగిసేటప్పటికి రాష్ట్రంలో సగటున 8.67 మీటర్లలో భూగర్భజలాలు లభ్యమవుతున్నాయి. బాపట్ల జిల్లాలో కనిష్ఠంగా 3.59 మీటర్లలోనే భూగర్భజలాలు లభ్యమవుతుండగా.. ఏలూరు జిల్లాలో గరిష్ఠంగా 20.95 మీటర్ల లోతుకు వెళ్తేగానీ భూగర్భజలాలు దొరకని పరిస్థితి.వర్షాభావ ప్రాంతాలైన అనంతపురం జిల్లాలో 7.84, శ్రీసత్యసాయి జిల్లాలో 8.35 మీటర్లలోనే భూగర్భజలాలు లభ్యమవుతుండటం గమనార్హం. జూన్‌ 1 నుంచి కొత్త నీటి సంవత్సరం 2023–24 ప్రారంభమవుతుంది. గతేడాదిలానే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న వాతావరణశాఖ అంచనాల నేపథ్యంలో.. భూగర్భజలాలు పుష్కలంగా పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.    

Related Posts