కర్నూలు, జూన్ 7,
తొలకరి పడిందంటే అన్నదాతలు వ్యవసాయ పనులు మొదలుపెడతారు. సాగుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకా చకా చేస్తూ ఉంటారు. ఇది సహజంగా తరచూ మనం చూస్తూనే ఉంటాం. కానీ ఆ ప్రాంతంలో తొలకరి జల్లు పడితే ఇక ఇంట్లో ఎవరూ ఉండరు. అంటే వర్షానికి ఇళ్లు కూలిపోతాయని కాదు..అంతా పొలాల్లోకి పరుగులు తీస్తారు. అరె వ్యవసాయం పండించాలనే పట్టుదల అనుకునేరు కాదు వజ్రాల వేట కోసం. ఇంతకీ పొలాల్లో వజ్రాల వేట అంటే ఇప్పటికే ఓ ఐడియా వచ్చేసి ఉంటుంది కదూ. దేశవ్యాప్తంగా తొలకరి జల్లుకురిస్తే అన్నదాతలు పంట పండిచే పనిలో బిజీబిజీగా ఉంటే కర్నూలు జిల్లాలో మాత్రం తొలకరి తర్వాత చిన్నాపెద్దా తేడా లేకుండా జనం పొలాల బాట పడతారు. వజ్రాల వేట కోసం ఇంటిల్లపాది పొలాలను జల్లెడ పడతారు. కర్నూలు జిల్లాలో ఇది ప్రతీ ఏడాది జరిగే తంతే.ముఖ్యంగా వజ్రకరూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వజ్రాలు తరచూ దొరకుతుండటంతో ఈ ప్రాంతంలోని పొలాలను ప్రజలు జల్లెడపడతారు. అదృష్టవంతులు ఎవరైనా ఉంటే ఒక్క వజ్రంతో ఏకంగా రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారు. అలా కోటీశ్వరులు అయినవారు లేకపోలేదు సుమీ. ఇటీవలే తొలకరి జల్లు కురియడంతో కర్నూలు జిల్లా మద్దెకర మండలంలో వజ్రాల కోసం పొలాల్లో రైతులు అన్వేషణ మొదలుపెట్టారు. మండలంలోని బసినేపల్లిలో ఓ రైతుకు విలువైన వజ్రం లభించింది. ఆ వజ్రాన్ని అక్కడే అమ్మకానికి పెట్టగా.. కొనేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. చివరకు గుత్తికి చెందిన ఓ వజ్రాల వ్యాపారి ఆ వజ్రాన్ని రూ.2 కోట్లకు సొంతం చేసుకున్నాడని తెలుస్తోంది. రాయలసీమ నేలల్లో వజ్రాల గనులు ఉన్నాయన్నది ఎప్పటి నుంచో ప్రచారం. మద్దికెర ప్రాంతంలో వజ్రాల వేట తరచూ మనం వినేదే. ఆ నేలల్లో వజ్రాల వేట కోసం వేరేవేరే జిల్లాల నుంచి జనం వస్తుంటారు. విలువైన రాయిలా అనిపిస్తే చాలా పరుగున వజ్రాల వ్యాపారుల దగ్గరకు వెళ్తారు. కొనేందుకు అక్కడ వ్యాపారుల మధ్య కూడా పోటీ ఉంటుంది. అలాంటి మద్దెకర మండలంలోని బసినేపల్లిలో ఓ రైతుకు వజ్రం కళ్లబడింది. ఆ వజ్రాన్ని అక్కడే అమ్మకానికి పెట్టాడు. అక్కడే వేచి చూస్తున్న వ్యాపారికి అమ్మకానికి పెడితే.. దాన్ని రూ. 2కోట్లు పలికినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆ నోట.. ఈ నోట పాకడం.. ఇప్పుడు జనమంతా పొలాల్లో వెదుకులాట ప్రారంభించారు. వర్షాలు పడ్డప్పడు వెదికితే వజ్రాలు దొరుకుతాయని.. స్థానికులు ఏటా ఈ సమయంలో వెదుకులాడుతుంటారు. తమకు కూడా వజ్రం దొరకకపోతుందా.. తాము శ్రీమంతులం కాకపోతామా అని వెదుగుతున్నామని చెప్తున్నారు స్థానికులు.ఈ వార్త తెలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లోని జనం కూడా పొలాల్లో వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు.