విజయవాడ, జూన్ 9,
జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పున: ప్రారంభమవుతయని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 2500 రూపాయలతో ఒక్కో విద్యార్ధికి జగనన్న విద్యా కానుక కిట్ ఇస్తున్నట్లు తెలిపారు. 12 వ తేదీన విద్యార్థులు అందరికీ ఈ కిట్స్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పిల్లలకు కావల్సిన అన్ని వసతులు జూన్ 12వ తేదీనే ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు. ఇక, పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కోసూరులో సీఎం చేతుల మీదుగా జగనన్న విద్యాకానుక ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మరోవైపు.. ఈ నెల 20న రాష్ట్ర స్ధాయి, 17న జిల్లా స్ధాయి, 15న నియోజకవర్గ స్ధాయి టాపర్లకు ప్రోత్సాహకాలు అందించనున్నట్టు వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.ఇక ఈ నెల 28న అమ్మ ఒడిని నగదును సీఎం జగన్ విడుదల చేస్తారని చెప్పారు. మొదటి దశలో 12 వేల స్కూళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్‌ను జూన్ 12 నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. విద్యార్ధులకు బోధించే ఉత్తమ ఉపాధ్యాయులను విదేశాలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తామన్నారు. గోరు ముద్ద ద్వారా విద్యార్ధులకు మంచి భోజనం అందిస్తున్నామన్నారు. ఫౌండేషన్ నుంచే విద్యార్ధి ఎదుగుదలకు చర్యలు తీసుకుంటున్నామని.. నిధుల గురించి ఎక్కడా రాజీపడడం లేదని స్పష్టం చేశారు.ఇక విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖకు పలు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. ప్రతి బాలుడు, బాలిక తప్పనిసరిగా స్కూల్లో చేరాలని, 100శాతం జీఈఆర్ సాధించే దిశగా ముందుకు సాగాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా చూసుకోవాలని, ఒకటి బాలికలకు, రెండోది కో–ఎడ్యుకేషన్ ఉండాలని సూచించారు. నాడు – నేడు ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని సూచించారు.