YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

భానుడి భగ భగ

భానుడి భగ భగ

ఎండలు మండిపోతున్నాయి. మే చివరివారం కావడంతో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. రాత్రి పూట కూడా ఉక్కపోత అదుపులోకి రావడంలేదు. దీంతో జనాలు అల్లాడిపోతున్నారు. వేడిమి తట్టుకోలేక సతమతమవుతున్నారు. ఉదయం 7 గంటలకే సూరీడి ఎఫెక్ట్ స్టార్ట్ అవుతోంది. 8 గంటలకు మోస్తరుగా మారుతున్న వేడిమి..9గంటలకే పుంజుకుంటోంది. ఇక అక్కణ్ణుంచి తిరుగేలేదన్నట్లు ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. దీంతో జనాలు ఉదయం పూట కూడా ఇళ్లల్లోంచి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. ఇక మధ్యాహ్నమైతే పరిస్థితి దారుణంగా ఉంటోంది. రోడ్లన్నీ ఖాళీ అయిపోతున్నాయి. అత్యవసర పనులు ఉంటేనే జనాలు బయటకు వస్తున్నారు. లేదంటే.. ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ టెంపరేచర్ 40 డిగ్రీలు దాటిపోతోంది. దీంతో జనాలతో పాటూ మూగజీవాలు సైతం ఉక్కిరిబిక్కిరైపోతున్నాయి. వన్యప్రాణులైతే దాహార్తికి సతమతమవుతున్నాయి. అటవీప్రాంతాల్లోని జంతువుల కోసం నీటితొట్లు ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు నీరు అందుబాటులోనే ఉంచుతున్నారు సిబ్బంది. అయితే అటవీ ప్రాంతం తగ్గిపోవడంతో కొన్ని చోట్ల వన్యప్రాణులు శివారు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని జంతువులు మృత్యువాత కూడా పడుతున్నారు. దీంతో స్థానికుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. 

 

గృహాలు, కార్యాలయాల్లో ఉండేవారి పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నా.. చిరువ్యాపారులు, రోజువారీ కూలీల పరిస్థితి దారుణంగా ఉంది. ఇంటి పట్టునే ఉంటే రోజు గడవడం వారికి కష్టం. బయటకు వస్తే.. ఎండతో పోరాటం. చేసేదేమీ లేక.. ఠారెత్తిస్తున్న ఎండల్లోనే పనులు చేసుకుంటున్నారు పలువురు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో వైద్య నిపుణులు ప్రజలకు పలు జాగ్రత్తలు చేస్తున్నారు. శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని స్పష్టంచేస్తున్నారు. మంచినీళ్లు, పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మజ్జిగతో పాటూ వేసవిలో దొరికే మామిడి, పుచ్చకాయ వంటి పండ్లు సేవించాలని చెప్తున్నారు. ఇక అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని స్పష్టంచేస్తున్నారు. బయటకు వచ్చేవారు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలని ఎండ తగలకుండా టోపీలు లేదా గొడుగులు ధరించాలని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు తెలిపారు.  

Related Posts