YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

డిజిటల్ మీడియా టీడీపీ దూకుడు...

డిజిటల్ మీడియా టీడీపీ దూకుడు...

విశాఖపట్టణం, జూన్ 9, 
సోషల్ మీడియా ప్రచారాల్లో వైసీపీ, టీడీపీల మధ్య పోరాటం పతాక స్థాయికి చేరింది. అన్ని హంగులున్న అధికార పార్టీ అనుకూల సోషల్ మీడియా ఖాతాలు వెలవెలబోతుంటే, టీడీపీ, జనసేనలు ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో దూసుకుపోతున్నాయి. దీనికి రకరకాల కారణాలున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది వైసీపీ సోషల్ మీడియా పరిస్థితి. భారీ యంత్రాంగం, సాంకేతిక పరిజ్ఞానం, పుష్కలంగా ఆర్ధిక వనరులు, జీతాలిచ్చే సంస్థలు, పూర్తి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ప్రత్యర్థుల ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో మాత్రం విఫలం అవుతున్నాయి. ఈ సంస్థల మధ్య ఒకటికి పది తలల పెత్తనంగా తయారవ్వడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఫేస్‌బుక్‌, ట్విట్టర్, ఇన్‌స్టా, కూ ఎలా వేటిలో చూసిన సాధారణ ప్రజల కంటే రాజకీయ పార్టీల మద్దతుదారులే నకిలీ ముఖాలతో కొట్లాడుకోవడం ఇప్పుడు సాధారణం అయిపోయింది. ఏపీలో సంప్రదాయక మీడియను పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం పూర్తిగా డిజిటల్ కాంపెయిన్‌ మీదే ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో మీడియా కంటే సోషల్ మీడియా అండతోనే తాము అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టామని ముఖ్యమంత్రి సైతం పలు సందర్భాల్లో ప్రస్తావించారు.ఏపీలో ప్రధాన స్రవంతి మీడియా ప్రభుత్వానికి, వైఎస్సార్సీపీకి వ్యతిరేకం కాబట్టి సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో వాడుకోవాలని భావించి, ఇండస్ట్రీస్‌ అండ్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ విభాగంలో డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. 2020 చివర్లలో ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది. ఆ తర్వాత గత ఏడాది పార్టీ కోసం మరో సంస్థను ఏర్పాటు చేశారు.ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడికి సోషల్ మీడియా, మీడియా కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు. ఈ రెండు సంస్థలతో పాటు వైసీపీ కార్యకర్తలు, మొదట్నుంచి పార్టీకి స్వచ్ఛందంగా సహకరిస్తున్న వారు, యువత పెద్ద సంఖ్యలో సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహిస్తున్నారు.మరోవైపు టీడీపీకి కూడా రకరకాల విభాగాల్లో సోషల్ మీడియా సైన్యం ఉంది. దీంతో పాటు జనసేనకు కూడా భారీగానే మద్దతుదారులు ఉన్నారు. మిగిలిన పార్టీలకు సోషల్ మీడియా విభాగాలు ఉన్నా వాటి పాత్ర పరిమితంగానే ఉంది. ఇటీవల కాలంలో అధికార పార్టీ సోషల్ మీడియా విభాగాలకు, టీడీపీ, జనసేనలకు మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. ప్రధానంగా టీడీపీ, జనసేనలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి మీమ్స్‌, ట్విట్స్‌, కార్టూన్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.వైసీపీలో ఉన్న వేర్వేరు విభాగాల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఒక టీమ్‌తో మరో టీమ్‌కు సఖ్యత లేకపోవడం, ఆధిపత్య పోరు వంటి కారణాలతో ఇవి కలిసి పనిచేయలేని పరిస్థితి టీడీపీ, జనసేనలకు కలిసొచ్చినట్టైంది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా విభాగాల్లో జీతాలు చెల్లించి ఉద్యోగుల్ని నియమించుకున్నా వారితో పూర్తిగా పనిచేయించుకోలేని పరిస్థితి వాటి బాధ్యులకు ఉంది.ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకుల సిఫార్సులతో ఉద్యోగాల్లో చేరిన వారు తమకు జీతాలు చెల్లిస్తే చాలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ చేసుకుంటామని వాటి బాధ్యులపై ఒత్తిడి చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి పనిచేయకుండా జీతాలు తీసుకునే వారు పదుల సంఖ్యలో ఉన్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.ఈ సంస్థల్లో ఉద్యోగుల హాజరుపై ఎవరికి అజమాయిషీ లేకపోవడం, ప్రజా ప్రతినిధుల సిఫార్సులతో ఉద్యోగాలు దక్కించుకుని వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా ప్రభుత్వానికి, అధికార పార్టీకి దమ్మిడీ ఉపయోగం లేకుండా పోతోందని చెబుతున్నారు.యాక్టివ్‌గా ఉండే కొద్దిపాటి ఖాతాలతోనే రోజువారీ డిజిటల్ ప్రచారం, ప్రత్యర్ధులకు విమర‌్శలకు కౌంటర్లు ఇచ్చుకోవాల్సి వస్తోంది. అటు టీడీపీలో దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. క్రియేటివ్ కంటెంట్ విషయంలో పత్రికలపై ఆధార పడకుండా సొంతంగా కంటెంట్ తయారు చేసే విభాగాలను టీడీపీ వృద్ధి చేసుకుంది. టీడీపీ సొంతంగా నాలెడ్జి సెంటర్‌ నిర్వహించడంతో పాటు కన్సల్టెన్సీల సేవల్ని సమర్ధంగా వినియోగిస్తోంది.అధికార పార్టీలో ప్రచారం కోసం ఏర్పాటు చేసుకున్న డిజిటల్ విభాగానికి మరో రకమైన సమస్య ఉందని చెబుతున్నారు. అక్కడ కుర్రపెత్తనం ఎక్కువైపోవడం, కంటెంట్, క్రియేటివిటీ తక్కువైనా, భారీ జీతాలతో నడిచిపోయే పరిస్థితులు ఉందని చెబుతున్నారు.గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా యాక్టివ్‌గా పనిచేసిన హ్యాండిల్స్‌పై ఆ తర్వాతి కాలంలో రకరకాల కేసులు నమోదులు కావడం, ఏడాదిన్నర క్రితం న్యాయవ్యవస్థపై కామెంట్లు చేసి కొందరు జైలుకు వెళ్లాల్సి రావడంతో స్వచ్ఛందంగా పనిచేసే వారంతా సైలెంట్ అయిపోయారు. పార్టీ నాయకుల దగ్గర హడావుడి చేసే వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, పనిచేసిన వాళ్లను పట్టించుకోలేదనే అక్కసు చాలామందిలో ఉంది. మొత్తం మీద వైసీపీ సోషల్ మీడియా పరిస్థితిని గాడిన పెట్టే వారు లేకపోవడమే అసలు సమస్య అని చెబుతున్నారు.

Related Posts