న్యూడిల్లీ, జూన్ 9,
ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య నగరాల్లో 14 నగరాలు ఇండియాలో ఉన్నాయి. వాటిలో మహారాష్ట్రలోని భీవండి 3వ స్థానంలో ఉండగా.. 4వ స్థానంలో ఢిల్లీ, 6వ స్థానంలో దర్భంగ, 7వ స్థానంలో అసోపూర్, 9వ స్థానంలో న్యూఢిల్లీ, 10లో పట్నా, 11లో ఘజియాబాద్, 12లో ధరుహెర, 14లో ఛప్ర, 15లో ముజఫర్‌నగర్, 17లో గ్రేటర్ నోయిడా, 18లో బహదుర్‌గఢ్, 19లో ఫరీదాబాద్, 20వ స్థానంలో ముజఫర్‌పూర్ నగరాలున్నాయి. పెరుగుతున్న పట్టణీకరణలో భాగంగా ప్రజలు, యువత గ్రామాల నుంచి పట్టణాలకు తరలి వస్తున్నారు. ఉపాధి కోసం కావచ్చు.. ఉన్నత విద్య కోసం కావచ్చు.. అవసరం ఏదైనా.. గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. భారత దేశంలో గడచిన 10 ఏళ్ల కాలంలో సుమారు 30 శాతం పట్టణీకరణ పెరిగిందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడయింది. అయితే ఇండియాలోని చాలా పట్టణాలు కాలుష్యంగా మారాయని ఒక అధ్యయనంలో వెల్లడయింది. ఇండియాలోని నగరాలు ఎంత కాలుష్యంగా మారాయంటే… ప్రపంచంలోని అత్యధిక కాలుష్యం ఉన్న 100 నగరాల్లో 65 నగరాలు ఇండియాలోనే ఉన్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు. ఇండియాలోని నగరాలు ఎంత కాలుష్యంగా ఉన్నాయనేది. ఇండియాలోని నగరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం వాహనాల సంఖ్య పెరగడమే అనేది మరొక సర్వేలో తేలింది. ఇంకా భయంకరమైన నిజం ఏమిటంటే మన దేశ రాజధాని ఢిల్లీ నగరం ప్రపంచంలోని అత్యంత 4వ కలుషిత నగరం కాగా.. రెండో అత్యంత కలుషిత రాజధానిగా నిలిచింది.ప్రపంచంలోని కలుషిత నగరాలు ఏమిటో తెలుసుకోవడం కోసం స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూఎయిర్ సర్వే నిర్వహించింది. ప్రపంచ వాయు నాణ్యత నివేదక – 2022 ఆధారంగా ఈ సంస్థ కలుషిత నగరాలను నిర్ణయించింది. ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలోని 100 అత్యధిక కాలుష్య నగరాల్లో 65 నగరాలు భారత్‌లోనే ఉన్నట్టు సంస్థ నివేదికలో ప్రకటించింది. అయితే ఈ జాబితాలోని కాలుష్యం ఎక్కువగా ఉన్న భారతీయ నగరాలన్నీ ఉత్తర భారత్‌లోనివే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎనిమిదో స్థానంలో ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే నాలుగో అత్యంత కలుషిత నగరంగా మరియు రెండో అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ ఉండటం విచారకరం. ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో .. కాలుష్యాన్ని తగ్గించడం కోసం వాహనాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.