YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో కాపు కాక

ఏపీలో కాపు కాక

రాజమండ్రి, జూన్ 10, 
ఏపీలో ‘కాపు’ కేంద్రంగా వాడీవేడీ రాజకీయం మొదలైంది. ఈ నెల 14 నుంచి పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర మొదలు కానుంది. ఈ సమయంలో ముద్రగడ పద్మనాభంను తెరపైకి తెస్తోంది వైసీపీ. జనసేన రాజకీయాలకు వైసీపీ విరుగుడు మంత్రంగా ప్లాన్ చేస్తోంది. ఇదే తాజా ఏపీ రాజకీయ ముఖచిత్రం. ఎత్తుకు పైఎత్తులు వేయడం రాజకీయాల్లో సహజమైనా.. ప్రధాన పార్టీలు మాత్రం.. వాటికి ఇంకాస్త పదును పెడుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నెల 14 నుంచి పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర మొదలు కానుంది. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఆయన యాత్ర ప్రారంభిస్తున్నారు.అయితే పవన్‌ కల్యాణ్‌ యాత్రకు విరుగుడు మంత్రం వేయాలని వైసీపీ అనుకుందో ఏమో.. సడెన్‌గా మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెరపైకి వచ్చారు. ముద్రగడతో వైసీపీ నేతలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పవన్‌ యాత్రకు కేవలం ఐదురోజుల ముందు అల్పాహార విందు పేరుతో.. వైసీపీ నేతలు ముద్రగడతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సంచలన రాజకీయ సెగలకు వేదిక కిర్లంపూడి. గతంలో కూడా ముద్రగడ పద్మనాభం అనేక మంది రాజకీయ ప్రముఖులతో సమావేశం అయ్యారు. కానీ.. వైసీపీ నేతలతో తాజా భేటీకి బలమైన గ్రౌండ్‌ వర్క్‌ ఉందన్నది విశ్లేషకుల మాట.పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర సాగే నియోజకవర్గాలు ఎక్కువగా కాపు సామాజికవర్గం ప్రభావం ఉన్నవే. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మొదలై పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, నర్సాపురం, భీమవరం యాత్ర సాగుతుంది. ఒక్క రాజోలు మినహా మిగతా నియోజకవర్గాలన్నీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఖాతాలో పడ్డవే. రాజోలులో జనసేన నుంచి గెలిచిన రాపాక వర ప్రసాద్‌ సైతం తర్వాత అధికారపార్టీకి జైకొట్టారు.పైగా జనసేనకు సానుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో పవన్‌ కల్యాణ్‌ పాదయాత్ర చేస్తే ప్లస్‌ అవుతుందనేది ఆ పార్టీ వాదన. దీంతో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర ప్రభావం తగ్గించే పనిలో వైసీపీ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ముద్రగడ పద్మనాభంతో వైసీపీ నేతల భేటీని ఆ కోణంలోనే చూస్తున్నారు. ఒకే ఒక్క నియోజకవర్గం.. పిఠాపురం. కాపు ఓటర్లు ఎక్కువుగా ఉన్న సెగ్మెంట్‌. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకలు అటెన్షన్‌ క్రియేట్‌ చేస్తే.. ఇప్పుడు పిఠాపురం చర్చలకు సెంటర్‌ పాయింట్‌గా మారుతోంది.వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేయొచ్చనే టాక్‌ నడుస్తోంది. ఇదే పిఠాపురంలో వైసీపీ నుంచి ముద్రగడ పద్మనాభం బరిలో ఉంటారని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో కిర్లంపూడిలో ముద్రగడతో వైసీపీ నేతల అల్పాహార విందు పిఠాపురాన్ని కూడా కీలకంగా మార్చేసింది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. ప్రస్తుతం వైసీపీ కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత సైతం వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ టికెట్‌ ఆశిస్తున్నారు. తాజాగా ముద్రగడతో భేటీ అయిన వైసీపీ బృందంలో వంగా గీత కూడా ఉన్నారు.

Related Posts