చెన్నై, జూన్ 10,
తమిళనాట హీరో విజయ్ పాపులారిటీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దక్షిణాది హీరోలలో విజయ్ ఒకరు. తాజాగా ఆయన రాజకీయ అరంగెట్రం గురించిన వార్తలు వినిపిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎలక్షన్లు లక్ష్యంగా ఆయన సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు విజయ్ రాజకీయ రంగలోకి అడుగుపెట్టబోతున్నట్లు నెట్టింట వార్తలు జోరందుకున్నాయి. పైగా ఈ మధ్యకాలంలో విజయ్ తమిళనాడులో పలు చోట్ల సంక్షేమ కార్యక్రమాల్లోనూ చురుగ్గాపాల్గొంటున్నారు. ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా నటుడు విజయ్ అందరికీ కేంద్రం ఆహారాన్ని అందించాలని నినాదాలు చేశారు. అంతేకాకుండా తమిళనాడులోని పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు పలువురు రాజకీయ నేతల బర్త్ డే వేడుకలకు వరుసగా హాజరవుతున్నారు.ఇక తాజాగా 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం నుంచి పదో తరగతి, ఇంగర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు జూన్ 17న ఘనంగా సత్కరించనున్నారు. చెన్నై నీలగిరిలోని ఆర్‌కే కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమ నిర్వహణకు పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్ధులకు బహుమతులు ప్రధానంతోపాటు, నగదు ప్రోత్సహకం కూడా అందించనున్నట్లు ఇప్పటికే విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ ప్రకటించింది కూడా. గత కొంతకాలంగా విజయ్ కార్యచరణ చూస్తుంటే ఆయన రాజకీయాలను కేంద్రీకృతం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే నియోజకవర్గం అనే పదం ప్రస్తావనకు వచ్చిందని పలువురు అభిమానులు భావిస్తున్నారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్నారా? అనే సందేహం కూడా లేకపోలేదు.మరోవైపు విజయ్ పీపుల్స్ ఫోరమ్‌లో మత్స్యకారులు, మహిళా, విద్యార్థి, కార్మిక టీంలతో సహా మొత్తం 10 టీంలు ఉన్నాయి. ఈ పది టీంల ద్వారా 2026 ఎన్నికలు లక్ష్యంగా విజయ్ తన కార్యకలాపాలను 234 నియోజక వర్గాలో విస్తరింపజేయనున్నట్లు సమాచారం. ఇక విజయ్ రాజకీయ ప్రవేశం గురించిన వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. ఇవి ఎంతరకు నిజమో తేలాలంటే దళపతి మౌనం వీడాల్సిందే. ఏదిఏమైనా సినీ గ్లామర్ రాజకీయాల్లో అందలం ఎక్కించడం మన దేశ రాజకీయాల్లో కొత్తేం కాదు.