గుంటూరు, జూన్ 12,
వరుసగా రెండురోజులు ఇద్దరు అగ్రనేతలు ఏపీలో పర్యటించి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. శ్రీకాళహస్తిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, విశాఖలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. అవినీతిమయమైపోయిందన్నారు. ఎక్కడిక్కడ మాఫియాలు రెచ్చిపోతున్నాయన్నారు. ఈ కామెంట్స్‌తో పొలిటికల్‌గా కాక రేగింది. దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది. క్రోసూరు సభలో మాట్లాడి సీఎం జగన్ నేరుగా బీజేపీని ఎక్కడా టార్గెట్ చేసుకోలేదు. కానీ చంద్రబాబుకు మాదిరిగా జగన్‌కు ఉండకపోవచ్చన్నారు. ప్రజలనే తాను నమ్ముకున్నానని అన్నారు. వాళ్లే తన బలం బలగమని కామెంట్స్ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అవినీతమయమైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత నాలుగేళ్లుగా ఎలాంటి అవినీతి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడమేంటని టీడీపీ ఛైర్మన్ ఆక్షేపించారు. చిత్తశుద్ధితో నడుపుతున్న ప్రభుత్వం తమదన్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో జరిగిన దోపిడీ అందరికీ తెలుసు అన్నారు. ఆ దోపీడిలో బీజేపీ కూడా భాగమే అన్నారు. టీడీపీ నుంచి వెళ్లిన ఓ వర్గం నేతల ట్రాప్‌లో బీజేపీ అధినాయకత్వం పడిందన్నారు ఆయన. అందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు అమిత్‌షా మాట్లాడే ముందు స్టీల్ ప్లాంట్ విషయంపై మాట్లాడాల్సి ఉందన్నారు. రెండు రోజుల క్రితం శ్రీశైలంలో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీనిపై వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ పడింది. మాజీ మంత్రి పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎన్ని జన్మలు ఎత్తినా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెల్చుకోలేదని పేర్ని నాని తేల్చిచెప్పారు. కర్ణాటకలో మొన్నటివరకు ఉన్న బీజేపీ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వమని విమర్శించారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ఓటర్లు ఆ పార్టీకి తెడ్డు కాల్చి వాత పెట్టారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. కర్నూలులో హైకోర్టు పెడతామని బీజేపీ హామీ ఇచ్చిందని.. ఆ హామీని టీడీపీ హయాంలో ఎందుకు అమలు చేయలేదని పేర్ని నాని ప్రశ్నించారు. అమరావతిలో జరిగిన పాపాలకు కారణం ఎవరని ప్రశ్నించారు. ఎంపీలు సీఎం రమేష్, సత్యకుమార్, సుజనా చౌదరి మాటలను నడ్డా తన బుర్రలో ఎక్కించుకుని మాట్లాడితే అది వారి కర్మ అంటూ మాట్లాడారు.