విజయవాడ, జూన్ 13,
ఇటీవల కర్నాటక ఎన్నికల్లో బీజేపీ చావు దెబ్బ తిన్నది. సరిహద్దు ప్రాంతాల ప్రజలతోపాటు ఆ రాష్ట్రంలోని తెలుగు వాళ్లంతా కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసినట్లు సమాచారం. దీంతో కాషాయ నేతలు కంగుతిన్నారు. ఇక్కడ జగన్ సర్కారుకు తెరచాటుగా ఎంత సహకరిస్తున్నా కర్నాటకలోని తెలుగు వాళ్లు తమకు ఓట్లేయలేదని గుర్రుగా ఉన్నారట. ఆ రాష్ట్రంలోని తెలుగోళ్లలో ఎక్కువ మంది టీడీపీకి మద్దతుదారులుగా ఉన్నారని కేంద్ర పెద్దలు గ్రహించినట్లు తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం బీజేపీ, వైసీపీ ఓటమి పాలయ్యాయి. ఇక్కడ వైసీపీ, బీజేపీ ఒక్కటేననే భావం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లినందునే తాము ఘోరంగా ఓడిపోయామని బీజేపీ నేత రాంమాధవ్ చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలన్నింటితో వ్యూహం మార్చాలని సీఎం జగన్, ప్రధాని మోడీ భావించినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన పార్టీగా బీజేపీ మీద ముద్ర పడింది. అందువల్ల గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఇక్కడ నోటా కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు నెరవేర్చలేదన్న ఆక్రోశం ప్రజల్లో నెలకొంది. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసరాల ధరలు పెంచిందనే ఆగ్రహం ఉంది. ఇంకా కరెంటు చార్జీలు పెరగడానికి కేంద్ర విద్యుత్ సంస్కరణలు కూడా కారణమని జనం భావిస్తున్నారు. అదానీకి మేలు చేసేలా విద్యుత్ రంగాన్ని మలుస్తున్నారనే ఆరోపణలున్నాయి. విశాఖ ఉక్కు అమ్మకంపై ఉత్తరాంధ్ర ఉడికిపోతోంది. విశాఖ –కాకినాడ పెట్రో కారిడార్ ఏమైందని గోదావరి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్వాసితులను ఏం చేయదల్చుకున్నారని మండిపడుతున్నారు.మొత్తంగా ఇక్కడ బీజేపీ వ్యతిరేకత వైసీపీకి తగలకూడదు. అదంతా టీడీపీ, జనసేనల మీదకు నెట్టే విధంగా పొత్తులుండాలనేది సీఎం జగన్, ప్రధాని మోడీ ఎత్తుగడ అయి ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వాళ్లిద్దరూ మాట్లాడుకున్న తర్వాతనే చంద్రబాబును కేంద్ర పెద్దలు అమిత్ షా, నడ్డా పిలిపించినట్లు భావిస్తున్నారు. వాళ్ల భేటీలో ఎలాంటి ప్రతిపాదనలు వచ్చాయనేది అటు బీజేపీ నేతలుగానీ, ఇటు చంద్రబాబుగానీ బయట పెట్టలేదు. బీజేపీ స్నేహం కోసం అర్రులు చాస్తున్న టీడీపీ, జనసేన పార్టీలకు కాషాయ పెద్దలు రూట్ మ్యాప్ ఏమిచ్చారో తెలీదు. ఇప్పుడు ఈ మూడు పార్టీల మధ్య పొత్తు గురించి జనం మాట్లాడుకునేట్లు చేశారు. ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. ఒకవేళ మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరితే బీజేపీని వైసీపీ టార్గెట్ చేస్తుంది... ఆ వ్యతిరేకత మొత్తాన్ని టీడీపీ–జనసేన తలకు చుట్టేసి బయటపడాలనేది జగన్ వ్యూహం అయి ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబు ఎటూ తేల్చుకోలేక పోతున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికిప్పుడు బీజేపీ ప్రతిపాదనలకు నో అని చెప్పలేరు. అలాగని ఓకే అంటే తమ్ముళ్ల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తోంది. అసలు టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఓట్ల షేరింగ్ ఎలా ఉంటుందనేది చంద్రబాబును మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే పొత్తుల గురించి ఎవరూ మాట్లాడొద్దని తమ్ముళ్లకు సూచించారు. ఎన్నికలప్పుడు చూసుకుందామని నాయకులకు చెప్పారు. ప్రస్తుతం పొత్తుల ప్రస్తావన లేకుండా పార్టీ బలోపేతం మీదనే దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ, బీజేపీ విన్యాసాలను ఓ కంట కనిపెడుతూ ముందుకెళ్లాలనే ఎత్తుగడతో చంద్రబాబు ముందుకెళ్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.