YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కిం...కర్తవ్యం... మౌనంగా ఈటెల

కిం...కర్తవ్యం... మౌనంగా ఈటెల

హైదరాబాద్, జూన్ 13, 
తెలంగాణ బీజేపీ రాజకీయాలు రోజురోజుకీ హాట్‌హాట్‌గా మారుతున్నాయి. అధ్యక్ష పదవి మార్పు అంశం తెరపైకి వచ్చాక సమీకరణాలు వేగంగా కదులుతున్నాయి. ఈటెలకు పదవి ఖాయమనే ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ ఓ మాజీ ఎంపీ ఆధ్వర్యంలో మరో బ్యాచ్ తెరవెనుక సమావేశాలు మొదలు పెట్టడం ఆసక్తిగా మారింది. తెలంగాణ బీజేపీలో రాజకీయం వేడెక్కింది. అధ్యక్షుడి మార్పు అంశం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి మరొకరికి అప్పగిస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దాంతో.. నిన్నమొన్నవరకు కాంగ్రెస్ అనుకుంటే ఇప్పుడు బీజేపీలోనూ గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. అధ్యక్ష పదవి మార్పుపై.. అనుకూల వర్గం ఒకవైపు.. వ్యతిరేక వర్గం మరోవైపు మీటింగ్స్ పెట్టడం బీజేపీలో హీట్‌ పుట్టిస్తోంది. ఇప్పటికే ఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఈటెల రాజేందర్ చక్కర్లు కొట్టడం.. ఆయనకు పదవి ఖాయం అంటూ రాజకీయ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో చర్చలు నడుస్తుండటం కమలం పార్టీలో కాక రేపుతోంది. సరిగ్గా ఈ సమయంలోనే.. అధ్యక్ష పదవి మార్పు వ్యతిరేక బ్యాచ్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇంట్లో సమావేశం కావడం హాట్‌టాపిక్‌గా మారింది. అధ్యక్ష పదవి మార్పు బీజేపీలో అంత ఆషామాషీ కాదని.. అసలు అంత అవసరం ఏముందని జితేందర్‌రెడ్డి టీమ్‌ వాదిస్తోంది. అయితే.. తన ఇంట్లో జరిగిన భేటీలో ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు జితేందర్‌రెడ్డి. కానీ.. పార్టీ ఇంటర్నల్ విషయాలు బయటకు రావడం.. కేసీఆర్ రోజుకో లీక్ ఇస్తూ బీజేపీ క్యాడర్‌ను తప్పుదోవ పట్టిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని ఎదుర్కొలేకే బీఆర్ఎస్‌ అధినేత లీకుల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు జితేందర్‌రెడ్డి.తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మార్పు ప్రచారం సరికాదని, బీజేపీలో లీకుల పద్ధతి ఉండదన్నారు బీజేపీ నాయకురాలు విజయశాంతి. సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ బండి సంజయ్ కొనసాగుతారని తరుణ్ చుగ్ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీని దెబ్బకొట్టేందుకు ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారంగా అభివర్ణిస్తూ విజయశాంతి ట్వీట్ చేశారు. వాస్తవానికి.. తెలంగాణ బీజేపీని హైరేంజ్‌కు తీసుకెళ్లడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు మూడేళ్లకు పైగా కమలం పార్టీని పరుగులు పెట్టించారు. అయితే.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. సారథి మార్పు ప్రచారం ఇబ్బందిగా మారుతోంది. ఈ అంశంపై ఇన్నాళ్లూ అలాంటిదేం లేదని సంకేతాలు ఇచ్చిన అధిష్టానం.. ఇప్పుడు సడీసప్పుడు చేయకపోవడం చర్చకు తావిస్తోంది. అధిష్టానం మనసులో ఏముందో కానీ.. తెలంగాణ బీజేపీ పరిణామాలపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఇక.. అధ్యక్ష పదవి మార్పుపై రియాక్ట్‌ అయిన బండి సంజయ్.. అది ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. అయితే.. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించడానికి సిద్దంగా ఉన్నానన్నారు బండి.ఇదిలావుంటే.. అధ్యక్షుడి మార్పు అంశంపై ఈటల రాజేందర్ మాత్రం పెదవి విప్పడం లేదు. మీడియా చిట్‌చాట్‌లకు దూరంగా ఉంటానని చెబుతున్నారు. కానీ.. అధిష్టానం ఏం చెప్పినా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు సన్నిహితులతో చెబుతున్నారు ఈటల. మొత్తంగా.. తెలంగాణ బీజేపీ పాలిటిక్స్‌ ఆసక్తికరంగా మారుతున్నాయి. అటు.. పార్టీ క్యాడర్‌లోనూ సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎప్పుడు, ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.

Related Posts