YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పర్యాటక ప్రదేశంగా స్మృతివనం విగ్రహం చుట్టూ హరితహారం

పర్యాటక ప్రదేశంగా స్మృతివనం విగ్రహం చుట్టూ హరితహారం

విజయవాడ, జూన్ 14, 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంబేడ్కర్ స్మృతివనాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దనున్నామని అధికారులు తెలిపారు. మొత్తం 19.4 ఎకరాల విస్తీర్ణంలో అంబేడ్కర్ స్మృతివనం ఏర్పాటుచేస్తున్నారు.పర్యాటక ప్రదేశంగా అంబేడ్కర్ స్మృతివనం తీర్చిదిద్దుతామని రాష్ట్ర హరిత, సుందరీకరణ కార్పొరేషన్ ఎండీ బి. రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. విజయవాడ నడిబొడ్డున అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 125 అడుగుల అంబేడ్కర్ స్మృతి వనాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దనున్నామన్నారు. అంబేడ్కర్ స్మృతి వనంలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఏయే ప్రాంతంలో సుందరీకరణ పనులు ప్రారంభించాలో సిబ్బందికి సూచనలు ఇచ్చారు. సీఎం జగన్ ఆదేశాలు, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి సూచనలతో పనులను నిర్దేశిత కాలంలో పూర్తి చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ స్మృతివనం మొత్తం విస్తీర్ణం 19.4 ఎకరాలు కాగా, ఇందులో 8.9 ఎకరాలు పచ్చదనానికి కేటాయించామని కార్పొరేషన్ ఎండీ బి.రాజశేఖర రెడ్డి వివరించారు. విగ్రహం చుట్టూ పచ్చదనం ఉండేలా ముందు వైపు 1.65 ఎకరాలు, వెనుక వైపు 5.39 ఎకరాలు, కుడివైపు 1.48 ఎకరాలు, ఎడమవైపు 0.35 ఎకరాల్లో గ్రీనరీ పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు.ఈ హరితహారంలో మొఘల్ గార్డెన్ ల్యాండ్ స్కేపింగ్ భాగాలు, వెదురు ఫ్రేమ్ లో బౌగెన్విలేయా మొక్కలు, గులకరాయి నమూనాలు, రంగురంగుల పూలలో కనిపించే జాతీయ పక్షి నెమలి కనిపించనున్నాయి. ప్రతిపాదిత స్థలంలో నీటిపారుదల సౌకర్యంతో హరితహారం పనులు ప్రారంభమయ్యాయని రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీతో పాటు ఆర్కిటెక్ట్‌లు, ఇంజినీర్ల, హార్టికల్చర్ అధికారుల బృందం సైట్‌ను సందర్శించి, పని అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను స్పష్టంగా అంచనా వేశారని బి.రాజశేఖర్ రెడ్డి వివరించారు.విజయవాడ స్వరాజ్ మైదాన్‌లో ఏర్పాటు చేయనున్న భారీ అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనం ఏర్పాటుచేస్తున్నారు. అంబేడ్కర్‌ స్మృతివనం వద్ద లైబ్రరీ, మ్యూజియమ్, గ్యాలరీ ఏర్పాటుతో పాటు, ఆయన జీవిత విశేషాలు ఇందులో ప్రదర్శించనున్నారు. అంబేడ్కర్‌ సూక్తులను కూడా ప్రదర్శించనున్నారు. పార్కు వద్ద రహదారిని విస్తరించి, ఫుట్‌పాత్‌ను కూడా అభివృద్ధి చేయాలని, రెండింటిని ఆకర్షణీయంగా తీర్చి దిద్దాలని గతంతో సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా వస్తుందని అధికారులు స్పష్టం చేశారు. విగ్రహ విడిభాగాలను ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్‌ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్‌ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామని వెల్లడించారు. విగ్రహం తయారీతో పాటు దాని చుట్టూ సివిల్‌ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

Related Posts