YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీజేపీలో వైసీపీ, టీడీపీల మధ్య ఆట

బీజేపీలో వైసీపీ, టీడీపీల మధ్య ఆట

నెల్లూరు, జూన్ 14, 
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేతల మాటల దాడి మొదలు పెట్టారు. నాలుగేళ్లుగా ఏపీ ప్రభుత్వంపై ఈగ వాలకుండా చూసుకున్న బీజేపీ తీరు మారడానికి కారణం ఏమిటనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. మొన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా, నిన్న అమిత్ షా ఏపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేశారు. విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయనే ప్రచారం నేపథ్యంలో బీజేపీ అగ్రనేతల మాటల దాడికి కారణం ఏమిటనే ఆసక్తి అందరిలోను ఉంది.ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో పార్టీల మధ్య లెక్కలు మారిపోతున్నాయి. గత నెలలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమిత్‌షా, నడ్డాలతో భేటీ అయ్యారు. ఆయన భేటీలో ఏమి జరిగిందనేది బయటకు రాలేదు. పొత్తుల కోసమే ప్రాథమిక చర్చ జరిగిందని ప్రచారం జరిగినా బీజేపీ కానీ టీడీపీ కానీ దానిని ధృవీకరించలేదు. బాబు భేటీ పొత్తు కోసం కాదని కూడా మరో వర్గం చెప్పుకొచ్చింది.పొత్తుల లెక్కలు ఇప్పుడే తేలకపోయినా ఏపీలో పాగా వేయాలనే బీజేపీ ప్రయత్నాలు మాత్రం నాలుగేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. 2019ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీలో ఉన్న పారిశ్రామికవేత్తలు పార్టీ ఫిరాయించేశారు. టీడీపీలో ఉంటే తమకు చిక్కులు తప్పవనే క్లారిటీతోనే వారు బీజేపీ గూటికి చేరిపోయారు. ఆ తర్వాత వారి రాజ్యసభ పదవీ కాలం ముగిసిన తర్వాత ఒక్కరికి కూడా మళ్లీ పదవి దక్కలేదు.మరోవైపు టీడీపీని కోలుకోకుండా దెబ్బ కొట్టాలని భావించిన బీజేపీ ఆశలు కూడా నెరవేరలేదు. సంస్థాగతంగా బలంగా ఉన్న బీజేపీ నాయకుల్ని పార్టీలో చేర్చుకోవడం ద్వారా బలపడాలని బీజేపీ భావించింది. ఏపీలో బీజేపీకి క్షేత్ర స్థాయిలో బలమైన క్యాడర్ లేకపోవడం, ప్రజలు సామాజిక వర్గాలు, పార్టీల వారీగా ఓటర్లుగా చీలిపోవడంతో బీజేపీ బలం పెంచుకోవడం కష్టమైపోయింది.మరోవైపు నాలుగేళ్లుగా ఏపీలో వైఎస్సార్సీపీకి బీజేపీ లోపాయికారీ సహకారం అందిస్తూనే ఉంది. ప్రభుత్వ మనుగడకు కావాల్సిన సహకారం, రుణాలకు అవసరమైన అనుమతుల విషయంలో ఇతర రాష్ట్రాలకు లేని విధంగా కేంద్రం నుంచి ఏపీకి ఊరట లభించింది.ఏపీలో వైసీపీ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీ ప్రభుత్వం బీజేపీ కనుసన్నల్లోనే ఉన్నా బీజేపీ సొంతంగా ఎదిగే అవకాశాలు మాత్రం దానికి కనుచూపుమేరలో కనిపించడం లేదు. బీజేపీ ఎదగకపోవడానికి రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటమే కారణమనే భావనకు బీజేపీ రావడంతోనే దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించడానికి సిద్దమైనట్లు కనిపిస్తోంది. ఎన్నికలలు మరో ఏడాదిలో జరుగనుండటంతో ఒంటరిగా పోరులోకి దిగితే పెద్దగా ఫలితం ఉండదని భావిస్తోంది.2014లో మాదిరి టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లాలనే విషయంలో నిర్ణయం తీసుకోకపోయినా అందుకు అవకాశాలు లేకపోలేదు. బీజేపీకి కనీసం రెండు మూడు ఎంపీ స్థానాలైనా దక్కుతాయని ఆ పార్టీ భావిస్తోంది. 2024 ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాటి మద్దతు కేంద్రంలో తమకే దక్కేలా ఇప్పటికే పావులు కదుపుతోంది. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ, టీడీపీలతో వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలనే ప్లాన్‌ కూడా ఆ పార్టీకి ఉండే అవకాశం ఉంది.ఏపీలో టీడీపీతో కలిసి పోటీ చేసే విషయంలో గతంలో చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ ఇప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. టీడీపీతో మళ్లీ జట్టు కట్టే ప్రసక్తి ఉండదని గతంలో పలు సందర్భాల్లో అమిత్ సా స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో బీజేపీకి మిత్రపక్షాల బలం అనివార్యంగా అవసరం అవుతోంది. సొంతంగా పోటీ చేయలేని పరిస్థితుల్లో మిత్రులతో కలిసి సాగడం మేలనే భావన ఆ పార్టీ నేతలకు వచ్చి ఉండొచ్చు.మరోవైపు ఏపీలో అధికార పార్టీ టార్గెట్ మొత్తం టీడీపీ లక్ష్యంగానే సాగుతోంది. రాజకీయ వైరుధ్యాలు రెండు పార్టీల మధ్యే సాగుతుండటంతో మూడో పక్షానికి అవకాశం లేకుండా పోతోంది. ఏపీలో బీజేపీ ప్రభావం కనిపించకుండా పోటీ రెండు పార్టీల మధ్యే ఉండటంపై కూడా బీజేపీలో అనుమానాలు ఉన్నాయి. బీజేపీని ఎదగనివ్వకుండా వైసీపీ, టీడీపీల మధ్య ఆట నడుస్తోందని ఆ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. వీటన్నింటికి ఇప్పటికిప్పుడు చెక్ పెట్టే పరిస్థితి లేకపోవడంతోనే రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో కార్యాచరణ మొదలు పెట్టినట్టు కనిపిస్తోంది.ఎన్నికల నాటికి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో దాడి చేయడానికి అవినీతి ఆరోపణల్ని ఆ పార్టీ అస్త్రంగా చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Related Posts