YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేంద్రంలోని నేతలతో టచ్ లో సుజనా

 కేంద్రంలోని నేతలతో టచ్ లో సుజనా

సుజనా చౌదరి….నిన్న మొన్నటి వరకూ కేంద్రమంత్రిగా పనిచేశారు. నెల రోజుల క్రితం కేంద్రప్రభుత్వం నుంచి టీడీపీ మంత్రులు తప్పుకోవడంతో సుజనా చౌదరి పదవిని కోల్పోయారు. సుజనా చౌదరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోటరీలో సభ్యుడు. ఇప్పుడు సుజనా చౌదరికి చంద్రబాబు ప్రధాన మైన ఆపరేషన్ అప్పగించారనే టాక్ నడుస్తోంది. సుజనా చౌదరి తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఢిల్లీలో అత్యున్నత పదవిలో ఉన్న ఆ నేతను కలుస్తున్నారని సమాచారం. ఆయన సూచనలు, సలహాల మేరకు సుజనా చౌదరి ఢిల్లీలో అన్ని విషయాలు తెలుసుకుని చంద్రబాబుకు చేరవేస్తున్నారు. ఆయనే కొందరు బీజేపీ నేతల అపాయింట్ మెంట్లు కూడా ఇప్పిస్తున్నారని తెలిసింది. వైసీపీ ఎంపీల రాజీనామాలు జూన్ మొదటి వారంలో స్పీకర్ ఆమోదిస్తారని కూడా సుజనాకు ఆ నేత చెప్పడంతో వెంటనే చంద్రబాబుకు ఆ విషయాన్ని చేరవేసినట్లు చెప్పుకుంటున్నారు. ఒకవైపు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ కదలికలను గమనిస్తూ, వారితో టచ్ లో ఉంటూ అన్ని విషయాలను చంద్రబాబుకు సుజనా చేరవేస్తున్నారని, ఇప్పట్లో ఐటీ దాడులు, సీబీఐ దర్యాప్తులు ఏమీ ఉండవని సుజనా నుంచి సమాచారం రావడంతో తెలుగుదేశం నేతలు ఊపిరి పీల్చుకున్నారన్నది అమరావతి పార్టీ వర్గాల టాక్. కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగిన తర్వాత చంద్రబాబు మోడీపై విమర్శలను పెంచేశారు. మోడీ ఆంధ్రప్రదేశ్ కు చేసిన అన్యాయాన్ని ధర్మపోరాట దీక్షల ద్వారా ఎండగడుతున్నారు. పోలవరం వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును పక్కన పెట్టేసి మరీ బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు.మోడీ తో కటీఫ్ చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలపై ఆదాయపు పన్నుశాఖ దాడులు జరుగుతాయని, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో జరిగిందని చెబుతున్న అవినీతిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తారన్న ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తెలుగుదేశం పార్టీ నేతల సమావేశాల్లో చెప్పారు కూడా. అంతేకాదు దేనికైనా సిద్ధంగా ఉండాలని కూడా చంద్రబాబు నేతలకు ముందుగానే ధైర్యం నూరిపోశారు. ఇక బహిరంగ సభల్లో అయితే కేంద్రం ప్రభుత్వం తమపై కుట్రలు చేస్తుందని ప్రజలే తనను రక్షించాలని విచిత్రమైన విజ్ఞప్తిని కూడా చేశారు. సుజనా చౌదరి పక్కా వ్యాపారవేత్త. ఆయనపై కూడా మారిషస్ బ్యాంకు కేసులో రుణ ఎగవేత కేసులున్నాయి. ఆయన ముందునుంచే బీజేపీ నేతలతోనూ, కేంద్రంలోని పెద్దలతోనూ సఖ్యతగా ఉంటూ వస్తున్నారు. నెల క్రితం వరకూ ఆయన రాష్ట్ర విభజన హామీల అమలు చేయడం కోసం కేంద్ర మంత్రులతో అనేకదఫాలు చర్చలు జరిపారు. ఆయన ఇప్పటి వరకూ మోడీని గాని, కేంద్ర ప్రభుత్వాన్ని కాని పల్లెత్తు మాట అనలేదు. విమర్శల జోలికి పోలేదు. చంద్రబాబు స్వయంగా సుజనా చౌదరిని ఢిల్లీలో నిఘా పెట్టేందుకు నియమించారని తెలుగుదేశం పార్టీలోనే చర్చ జరుగుతోంది.

Related Posts