YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

యువగళంలో వారసులు...

యువగళంలో వారసులు...

నెల్లూరు, జూన్ 15, 
నారా లోకేష్ యువగళం యాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించింది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామనారాయణ రెడ్డితోపాటు జిల్లా నాయకులు లోకేష్ కి ఘన స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్న సందర్భంలో జిల్లాలో వారి హడావిడి బాగా ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామనారాయణ రెడ్డి బలప్రదర్శన చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2024 ఎన్నికల్లో ఆనం కుటుంబం రెండు చోట్ల పోటీ చేయాలని ఆశ పడుతోంది. ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డికి ఆత్మకూరు సీటు, ఆనంకు నెల్లూరు రూరల్ సీటు ఆశించారు. అయితే అనుకోకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా టీడీపీలోకి వస్తుండటంతో ఆనంకు ఆ సీటు కుదర్లేదు. దీంతో ఆయనే ఆత్మకూరుకు షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పటికే ఆత్మకూరులో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తన అభిమానుల్ని, అనుచరుల్ని దగ్గరకు తీసుకుంటున్నారు. దాదాపుగా ఆయనకు ఆత్మకూరు టీడీపీ టికెట్ కన్ఫామ్ అనే చెప్పుకోవాలి. ఈ దశలో వారసుల్ని కూడా ఆనం ప్రమోట్ చేస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి కుమారుడు శుభకర్ రెడ్డి, కుమార్తె కైవల్యా రెడ్డి, అల్లుడు రితీష్ కుమార్ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి తనయుడు రంగమయూర్ రెడ్డి, ఆనం కుటుంబానికే చెందిన టీడీపీ నేత వెంకట రమణారెడ్డి కూడా పాదయాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. రాబోయే రోజుల్లో ఆనం ఫ్యామిలీ మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు రామనారాయణ రెడ్డి. నారా లోకేష్ తో ఆనం కొత్తతరం నాయకులు కలసి నడిచేలా పాదయాత్రకు ఏర్పాట్లు చేశారు.
నారా లోకేష్ యువగళం యాత్రకు జిల్లాలో ఘన స్వాగతం పలికారు నాయకులు. మర్రిపాడు మండలం ద్వారా జిల్లాలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్రకి ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలనుంచి అపురూప స్పందన లభించింది. వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు బీదా రవిచంద్ర, మాజీ మంత్రులు సోమి రెడ్డి, నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని రామారావు, కంభం విజయరామిరెడ్డి, కాటంరెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి, పరసా రత్నం, నెలవల  సుబ్రమణ్యం, కురుగొండ్ల రామకృష్ణ తదితరులు పాదయాత్రకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాల్లో ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారు. మిగతా చోట్ల కూడా వైసీపీ అసంతృప్తులకు టీడీపీ గేలమేస్తోంది. ఎమ్మెల్యేలు మినహా వారి అనుచరులంతా లోకేష్ సమక్షంలో పాదయాత్రలోనే టీడీపీలో చేరేందుకు కార్యక్రమాలు రూపొందించారు. జిల్లాలో యువగళం పూర్తయిన తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు నేరుగా చంద్రబాబుని కలసి టీడీపీలో చేరతారు. నెల్లూరు జిల్లాలో లోకేష్ యువగళం యాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకున్నారు. వారితోపాటు అనుచరులు కూడా జిల్లాలో యాత్ర విజయవంతం చేస్తామంటున్నారు. యువగళం యాత్ర నెల్లూరులోకి ప్రవేశించడంతో స్థానిక వైసీపీ నేతలు హడావిడి పడుతున్నారు.

Related Posts