విజయవాడ, జూన్ 16,
ఏదైనా తప్పు చేయాలంటే.. మనిషికి గుండె ధైర్యం ఒక్కటే ఉంటే సరిపోదు. ఓ వేళ మనం నేరం చేసినట్లు వెలుగులోకి వచ్చినా.. పోలీసులు అరెస్ట్ చేసి.. జైల్లో పెట్టినా.. బెయిల్ ఇచ్చి బయటకు తీసుకు వచ్చే అండ దండా అయిన వారు బలంగా.. బలగంగా.. ఎవరో ఒకరు ఉండాలి. అలా కాకుంటే హత్య కేసులోనో, దాడి కేసులోనో మనం అరెస్ట్ అవుతామని ముందే తెలిస్తే... పనులన్నీ పక్కన పెట్టి.. ఆగ మేఘాల మీద ప్రత్యేక విమానంలో దేశ రాజధాని హస్తినకు వెళ్లి కేంద్రంలోని పెద్దలకు శాలువా కప్పి.. తిరుమల శ్రీవారి చిత్రపటంతోపాటు.. స్వామిలోరి కల్యాణం లడ్డు ప్రసాదంగా ఇస్తే.. ఆ దేవదేవుడి చిత్ర పటం సాక్షిగా అడిగిన కోరికలే కాదు.. మన మనస్సులోని కోరికలు సైతం వాళ్ల మనస్సుతోనే తెలుసుకొని.. మనకు, మనవారికి రక్షణగా చక్రం అడ్డు వేస్తారనేందుకు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకొంటున్న పరిణామాలే సజీవ సాక్ష్యం. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. అటు ఏపీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి.. నేటికి అరెస్ట్ కాలేదు. అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలుమార్లు ఢిల్లీలో ఈడీ విచారణకు సైతం హాజరయ్యారు. కానీ ఆమె నేటికి అరెస్ట్ కాకపోవడం గమనార్హం. ఉంటే గింటే ఈ విధంగా ఉండాలి. అలా అయితేనే మీడియాలో హైప్ ఉంటుంది. అందుకు తగ్గట్లుగా ప్రచారం సైతం ఊపందుకొంటుంది. అయితే 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్ట్ సాక్షిగా నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై శ్రీను అనే వ్యక్తి కోడి కత్తితో దాడి చేశాడు. ఆ కేసు విచారణ ఎన్ఐఏ కోర్టులో ఈ రోజు అంటే జూన్ 15వ తేదీన జరిగింది. ఈ సందర్బంగా కోడికత్తి శ్రీను.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. తాను 1,610 రోజులుగా బెయిల్ లేకుండా జైల్లోనే ఉన్నట్లు పేర్కొన్నాడు. అలాగే తాను ఇంకా ఎంత కాలం.. ఈ జైలు జీవితం గడపాలో తెలియడం లేదని.. విముక్తి కలిగించాలని విన్నవించుకొన్నాడు. అదేవిధంగా తనకు న్యాయం చేయాలని అనేక మార్లు కోర్టును కోరినా.. ఫలితం లేకపోయిందని.. అందుకే మీకు లేఖ రాయాల్సి వచ్చిందని సదరు లేఖలో కోడికత్తి శ్రీను పేర్కొన్నట్లు సమాచారం. కోడికత్తి శ్రీనుకు బెయిల్ రాకపోవడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం వైయస్ జగన్.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి ఎన్ఐఏ కోర్టు... 10 కిలో మీటర్ల దూరం కూడా ఉండదని.. కానీ ఆయన ఈ కేసులో కోర్టుకు హాజరు కారనే ఆరోపణలు సైతం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. 2018 అక్టోబర్ 25న 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్ జగన్ హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. వెయిటర్..సెల్ఫీ తీసుకుంటానని అంటూ వైఎస్ జగన్ వద్దకు వచ్చారు. అతను వస్తూనే.. వైఎస్ జగన్‌పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్ జగన్ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ భుజానికి కత్తి తగలడంతో గాయమైంది. చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. హైదరాబాద్ చేరుకున్న తరవాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రి వైద్యులు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. మూడు వారాల వరకూ రెస్ట్ తీసుకున్నారు. ఇది పెద్ద సంచలనం అయింది. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న దర్యాప్తు మీద తమకు అనుమానాలు ఉన్నాయని హైకోర్టులో వైసీపీ నేతలు పిటిషన్ వేయడంతో కేసును కోర్టు ఎన్ఐఏకు ఇచ్చింది. విచారణ జరిపిన ఎన్‌ఐఏ 2019లోనే చార్జిషీటు దాఖలుచేసింది. ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా జనిపల్లి శ్రీనివాస రావును పేర్కొన్నారు. చార్జిషీటుతో పాటు నిందితుడు శ్రీనివాసరావు విశాఖ జైల్‌లో రాసుకున్న 22పేజీల లేఖను కూడా కోర్టుకు అందజేశారు. ఈ కేసును రహస్యంగా విచారించాలని… విచారణకు సంబంధించిన వివరాలు మీడియాకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించ కూడదని.. మీడియా కూడా విచారణకు సంబంధించిన వివరాలు ప్రచురించ కూడదని అప్పట్లో ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసిందికేవలం 15 నిమిషాలు.. సీఎం వైయస్ జగన్ సమయం కేటాయిస్తే.. సరిపోతోందని వాదనలు సైతం వస్తున్నాయి. అయితే వైయస్ జగన్ ఉద్దేశ పూర్వకంగానే తన న్యాయవాదులతో పిటిషన్లు వేయించి.. కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో ఎటువంటి కుట్ర కోణం లేదని ఇప్పటికే ఎన్ఐఏ అధికారుల సుస్పష్టం చేసిన విషయం విధితమే. వైయస్ఆర్ తనయుడు వైయస్ జగన్.. ముఖ్యమంత్రి కావడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం వస్తుందని భావించి.. ఆ క్రమంలో వైయస్ జగన్‌పై దాడి చేస్తే.. ఆయనకు ప్రజల్లో సింపతి వస్తుందని భావించి.. ఆ క్రమంలో దాడి చేసిన.. ఎరక్కపోయి దాడి చేసి జైల్లో ఇరుక్కుపోయిన శీను బాబు లాంటి వారు.. జీవిత కాలం బెయిల్ రాకుండా... జైల్లోనే ఉండిపోయినా.. ఏ మాత్రం ఆశ్చర్యపడనక్కర్లేదేనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.