YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఏం జరుగుతోంది.. రెండు పార్టీల మధ్య ఒప్పందం

ఏం జరుగుతోంది.. రెండు పార్టీల మధ్య ఒప్పందం

హైదరాబాద్, జూన్ 16, 
బీజేపీ, బీఆర్ఎస్ లు ఒకే గూటి పక్షులు అన్న విమర్శ తెలంగాణ ఆవిర్భావం నుంచీ వినిపిస్తూనే ఉంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత వరుసగా రెండు ఎన్నికలలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ విజయం సాధించేంత వరకూ కూడా ఇరు పార్టీల మధ్యా చక్కటి స్నేహ సంబంధాలు వెల్లివిరిశాయి.  అయితే ఆ తరువాతే కారణాలేమైనా బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా అన్నట్లుగా విభేదాలు తలెత్తాయి.బీజేపీ ముక్త భారత్ నినాదాన్ని అందుకున్న కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతకు తన శక్తికి మించిన ప్రయత్నం చేశారు.  ఇతర రాష్ట్రాలకు వెళ్లి, కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.మోడీ ప్రభుత్వం మహా డేంజర్ అంటూ కాలికి బలపం కట్టుకుని మరీ ఒక్కో రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా దాదాపు ఏడేళ్ల పాటు కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి తలూపి హఠాత్తుగా ప్లేటు ఫిరాయించారు. దేశానికి గుజరాత్ మోడల్ కాదు తెలంగాణ మోడల్ కావాలంటూ.. జాతీయ రాజకీయాలలోకి అర్జంటుగా దూకేశారు. తన ఐక్యతా యత్నాలకు స్పందన కరవు కావడంతో  తానే సొంతంగా జాతీయ పార్టీని ప్రారంభించేశారు. అందుకోసం తనకు ఇన్నేళ్లుగా అధికారాన్ని ఇచ్చిన తెలంగాణ సెంటిమెంటుకు గండి కొట్టేశారు. తెలంగాణ అన్న పదాన్ని పార్టీ పేరులోంచి తీసేసి భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ ను మార్చేశారు.  ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ నెలకు ఆ నెల జీతాలు ఇవ్వలేని, ‘తెలంగాణ మోడల్’ దేశానికి ఏం చేస్తుందంటూ బీజేపీ కూడా విమర్శలు ఎక్కుపెట్టింది.  అదే సమయంలో ముఖ్యమంత్రి కేసేఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొనడమే కాకుండా ఈడీ, సీబీఐ విచారణకు కూడా హాజరయ్యారు.  మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని.. ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారంటూ కేసీఆర్ పై బీజేపీ రాష్ట్రనాయకత్వం, కేంద్ర నాయకత్వమే కాదు.. కేంద్ర మంత్రులు కూడా విమర్శల దాడి  చేశారు.  అయితే ఇదంతా గతం ఇటీవల కొంత కాలంగా కేసీఆర్ బీజేపీ మాటెత్తడం లేదు. బీజేపీ కూడా కేసీఆర్ పై విమర్శల తీవ్రతను ఒకింత తగ్గించింది. కర్నాటక ఎన్నికల ఫలితమే.. ఈ ప్లేట్ ఫిరాయింపునకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో బలం ఉన్న కాంగ్రెస్ ను బలహీనం  చేయడమనే వ్యూహంలో భాగంగా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. మోడీ కాంగ్రెస్ ముక్తభారత్ లక్ష్యం కోసం కేసీఆర్ తెలంగాణలో బీజేపీకి హైప్ ఇచ్చి బలోపేతం చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం తరువాత కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో  కాంగ్రెస్ ను ఇగ్నోర్ చేయడం ద్వారా బలహీనపరుద్దామన్న తమ వ్యూహం బెడిసి కొట్టిందని తెలుసుకున్నారు. దీంతో రెండు పార్టీలకూ ఇప్పుడు కాంగ్రెస్సే ప్రధాన వైరిపక్షమైపోయింది. దీంతో ఇప్పటి వరకూ పరస్పర విమర్శలు ఆరోపణలతో రక్తికట్టించిన డ్రామాకు తెరతీసి ప్రధాన శత్రువైపై జమిలిగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో   బీఆర్ఎస్, బీజేపీల ఉమ్మడి వ్యూహం బెడిసికొట్టిందని పరిశీలకులు భావిస్తున్నారు.

Related Posts