విజయవాడ, జూన్ 17,
2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు బీజేపీ విషయంలో సైలెంట్ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను బీజేపీపై తీవ్రంగా పోరాడినా ప్రజల మద్దతు లభించలేదు. ఇక అప్పటి నుంచి బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. బీజేపీ నాయకులు టీడీపీని దూరంగా ఉంచినప్పటికీ, చంద్రబాబు పట్టుదలతో వారిని వెంబడించారు. చివరగా వచ్చే ఏపీ ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ చేతులు కలిపే సూచనలు కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ కనీసం 13 ఎంపీ సీట్లను అభ్యర్థిస్తోందని, 10 సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ చంద్రబాబు ఈ ఒప్పందానికి అంగీకరిస్తే, ప్రస్తుతం టీడీపీకి మద్దతు ఇస్తున్న మైనారిటీ మరియు ఎస్సీ-ఎస్టీ వర్గాల ఓటర్ల నుండి మద్దతు కోల్పోయే అవకాశం ఉంది. ఒక సర్వే ప్రకారం.. ఈ మైనారిటీ, ఎస్సీ-ఎస్టీ ఓటర్లలో సుమారు 30% మంది టీడీపీకి మద్దతు ఇస్తున్నారు. వారు వైసీపీకి విధేయత చూపడం చాలా పెద్ద దెబ్బ అనే చెప్పాలి. జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే వైసీపీకి సవాల్‌గా మారుతుందని టీడీపీ సొంత సర్వేలు చెబుతున్నాయి. అయితే, బీజేపీ కూటమిలో చేరితే టీడీపీ కనీసం 3-4% ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్లిష్ట సమయంలో చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కలిగే నష్టాలు, వాటిని తిరస్కరించడం వల్ల కలిగే ప్రమాదాల మధ్య నలిగిపోతున్నారు కొత్త మాట చంద్రబాబు ప్రస్తుతం అనిశ్చిత స్థితిలో ఉన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాలను కలిగించే కఠినమైన నిర్ణయాన్ని ఎదుర్కొంటున్నారు. మరోవైపు టీడీపీ పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. ప్రజల్లో ఆదరణ తగ్గిపోయింది. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఎక్కడ ఓడిపోతానేమోన్న భయం పట్టుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా స్కెచ్‌లు గీస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. అధికారంతో పాటు తన పార్టీకి పూర్వ వైభవం తెప్పించుకునేందుకు చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు. మరో వైపు తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న వారాహి విజయ యాత్ర సంచలనాలకు కేంద్రంగా మారుతోంది. గతంలో పవన్ బహిరంగ సమావేశాల్లో, ర్యాలీల్లో పాల్గొన్నప్పుడు అధికారం వైకాపాను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకునేవారు. ముఖ్యంగా జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించేవారు. పొత్తులతోనే తాను ముందుకు వెళ్తానని అనేవారు. కానీ మొన్నటి నుంచి ప్రారంభమైన వారాహి యాత్రలో తన మ్యానిఫెస్టోను కూడా ప్రకటించారు. కత్తిపూడిలో జరిగిన వారాహి యాత్ర అనంతరం పవన్ కాకినాడ దగ్గర ఉన్న చేబ్రోలులో రైతులు, చేనేత కళాకారులు, పట్టు రైతులతో ఆయన మాట్లాడారు. జనసేనకు ఒక్కఛాన్స్ ఇవ్వాలని, రాష్ట్రాన్ని బంగారు ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తానని చెప్పారు. దానికి కొనసాగింపుగా 2024, 2029 లో తనను ముఖ్యమంత్రిని చేయాలని రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తానని చెబుతున్నారు. ఒకవేళ తన పాలన నచ్చకుంటే రెండేళ్లలో తానే స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకుంటానని చెబుతున్నారు. పదేళ్లు పరిపాలించడానికి ఛాన్స్ అడిగి రెండేళ్లలో తప్పుకుంటానని పవన్ చెప్పడంపై రాజకీయ పరిశీలకులు విభిన్నంగా స్పందిస్తున్నారు. పేరుకు జగన్‌లా ఒక్క ఛాన్స్ అని అంటున్నా, తనకు రెండు ఛాన్సులు కావాలని పరోక్షంగా పవన్ అడుగుతుండటం విశేషం