YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దాహం తీర్చండి మహాప్రభో..

దాహం తీర్చండి మహాప్రభో..

కర్నూలు, జూన్ 16, 
నల్లమల అటవీ ప్రాంతంలో జీవనం సాగించే చెంచులకు తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. పలు చోట్ల తాగు నీటి వనరులున్నా వాటిని చెంచుల దరికి చేర్చేందుకు అధికారులు శ్రద్ధ చూపడం లేదు. వీరి సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) మొద్దు నిద్ర వీడడం లేదు. దీంతో తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక చెంచులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. అధికారులు స్పందించి చెంచులు ఎదుర్కొంటున్న తాగునీటి ఇక్కట్లను తీర్చాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంత పరిధిలో శ్రీశైలం, ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి, నందికొట్కూరు, గిడ్యాల, బండి ఆత్మకూరు, చాగలమర్రి, ఆళ్లగడ్డ, రుద్రవరం, వెలుగోడు, జూపాడుబంగ్లా, మహానంది మండలాల పరిధిలో 42 చెంచు గూడేలు ఉన్నాయి. అందులో 8,160 మంది గిరిజనులు, 1682 జాబ్ కార్డులుండగా 3,272 మందిఉపాధి కూలీలు పని చేస్తున్నారు. వీరంతా అటవీ ఉత్పత్తులపై ఆధారపడి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో చాలా చెంచు గూడేల్లో చెంచులు తాగునీటికి ఇబ్బందులు పడ్డారు. గూడేల్లో చేతి పంపులు మరమ్మతులకు గురి కావడం, కొత్తపల్లి మండలంలోని అటవీ ప్రాంత పరిధిలో ఉండే బలపాలతిప్ప, జానాల గూడేలతోపాటు పెచ్చెర్వు, ఎదురుపాడు, ఎర్రగుంట్ల వంటి గూడేల్లో సోలార్ ద్వారా ట్యాంకులు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది.ఫలితంగా చెంచులు గ్రామాలు, గూడేల శివారు ప్రాంతాల్లోని వ్యవసాయ బావులు, కుంటలను ఆశ్రయించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. కొత్తపల్లి మండలంలోని ఎదురుపాడు, ఎర్రగుంట్ల చెంచు గూడేల్లో మంచి నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ గూడేల్లో పది రోజులుగా మంచి నీరు రావడం లేదు. ఎదురుపాడు గూడెంలో ఏర్పాటు చేసిన సింథటిక్ ట్యాంక్ పగిలిపోవడంతో నీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎర్రగుంట్ల గూడెంలో ట్యాంకులు ఏర్పాటు చేసినా వాటికి పైప్ లైన్లు వేయలేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని వారు కోరుతున్నారు.

Related Posts