కడప, జూన్ 20,
తొలకరి పలకరింపు కోసం రైతాంగం ఎదురుచూస్తోంది. నాలుగేళ్లుగా జూన్‌లోనే వాతావరణం చల్లబడి వర్షాలు కురిశాయి. జూలై మొదటి వారంలో ఖరీఫ్ సాగు మొదలు పెట్టేవారు. అయితే ఈ సారి ఇప్పటికీ ఎండల తీవ్రత తగ్గలేదు. తొలకరి జాడ కనిపించడం లేదు. నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత కూడా వాతావరణంలో మార్పు కనిపించడం లేదు. దీంతో రైతుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవసాయ శాఖ మాత్రం వర్షాలు వస్తాయన్న నమ్మకంతో ఈ ఏడాది ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేసింది.వ్యవసాయ శాఖ ఈ సారి ఖరీఫ్ సీజన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. రైతులకు సకాలంలో సహకారం అందించాలని ముందస్తు చర్యలు చేపడుతోంది. కలెక్టర్ ఇప్పటికే వ్యవసాయ అధికారులకు ఖరీఫ్‌పై సూచనలు చేశారు. వ్యవసాయ అధికారులు కూడా ఈ ఏడాది ఖరీఫ్ కలిసి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. నైరుతి రుతు పవనాలు ప్రవేశించడంతో సాగు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో ఖరీఫ్ సాగుకు అవసరమైన మేర నీరు ఉన్నప్పటికీ జిల్లా అంతటా ఈ వనరులు లేవు. వర్షాలు కురిస్తేనే ఖరీఫ్ సాగుకు ఊపు వస్తుంది. లేదంటే ప్రాజెక్టులు, బోర్ల క్రింద మాత్రమే సాగవుతుంది .ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమైన ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతుల పంటల సాగుకు అవసరమైన ఎరువులతో పాటు వేరుశనగ, పచ్చిరొట్ట విత్తనాలను ముందస్తుగా కేటాయించింది. జిల్లాలో 77,105 హెక్టార్ల సాగు లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు. 8,366 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయడం ప్రారంభించారు. వీటితో పాటు వివిధ రకాల ఎరువులు 59,342,89 మెట్రిక్ టన్నులు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వీటన్నింటిని రైతులకు అవసరాన్ని బట్టి పంపిణీ చేస్తారు.ఈ ఏడాది పూర్తి లక్ష్యంతో సాగయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ, ఉద్యానవన అధికారులు పేర్కొంటున్నారు. అత్యధికంగా 33,215 హెక్టార్లలో వరి పంట, 21,566 హెక్టార్లలో పత్తి, 5,739 హెక్టార్లలో వేరుశనగ, 3,453 హెక్టార్లలో శనగ, 3,044 హెక్టార్లలో పసుపు, 1,817 హెక్టార్లలో మినుము, 1,332 హెక్టార్లలో జొన్న, 1,170 హెక్టార్లలో పొద్దు తిరుగుడు తదితర పంటలుసాగు ప్రణాళికలు రూపొందించారు. జిల్లా రైతాంగం కూడా తొలకరి వర్షాలు కురిసి ఒకటి రెండు పదనుల వాన పడితే ఖరీఫ్ సాగుకు సన్నద్ద మయ్యేందుకు ఎదురు చూస్తున్నారు.