YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రానికి కాపు కాస్తున్న కేంద్రం

రాష్ట్రానికి కాపు కాస్తున్న కేంద్రం

విజయవాడ, జూన్ 20, 
జగన్ రెడ్డి ప్రభుత్వం విషయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి. ఆంధ్రప్రదేశ్  ప్రజల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ తీరు మాటల్లో పలకరింపు, నొసటితో వెక్కిరింపు అన్న చందంగా ఉంది. గత నాలుగేళ్లుగా జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాలను అన్ని విధాలుగా సమర్ధిస్తూ వచ్చిన మోడీ సర్కార్.. ఇక ఎన్నికల సంవత్సరం వచ్చే సరికి ఎక్కడ లేని హడావుడీ ప్రదర్శించి ఒకే సారి రాష్ట్రానికి రెవెన్యూ లోటును విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడేసేందుకు చేయగలిగినంతా చేసింది. అదీ సరిపోదనుకుందో ఏమో అప్పులకూ అడ్డగోలు అనుమతులు ఇచ్చేసింది. అందించగలిగినంత సహకారం అందించేసి... ఇక ఇప్పుడు ఏపీ సర్కార్ పై విమర్శల పర్వానికి తెరతీసింది.  కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలు ఏపీ పర్యటనలో జగన్ సర్కార్ ను అవినీతి మయంగా అభివర్ణించారు. దోపిడీ, అవినీతి జగన్ నాలుగేళ్ల పాలన సారాంశంగా తేల్చేశారు. వారి తరువాత ఇక బీజేపీ ఏపీ నేతలు తమ నోటికి పని చేబుతున్నారు. అయితే మాటలు కోటలు దాటుతుంటే.. చేతలు మాత్రం ఇంకా జగన్ రెడ్డి సర్కార్ కు సహకారం అందిస్తూనే ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జగన్ ను మోడీ ఎంత అభిమానంతో  చూసుకుంటారో గతంలో చెప్పిన మాటలను ఒక సారి గుర్తు చేసుకోవాలి. జగన్ పట్ల మోడీకి ఉన్నది పుత్ర వాత్సల్యం అని నిర్మలా సీతారామన్ గతంలో ఒక సారి చెప్పారు.అందుకే అడ్డగోలు అప్పులు చేసి రాష్ట్రాన్ని గుల్ల చేసేస్తున్నా సహకారం అందిస్తూనే వస్తున్నారు. జగన్ సర్కార్ ను అవినీతి మయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించేసిన తరువాత కూడా ఈ సహకారం ఆగలేదు. తాజాగా రుణ పరిమితిలో విధించిన కోతకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది.   ఎన్నికల ఏడాదిలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులూ ఎదుర్కోకుండా ఉండేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ చేయగలిగినంతా, చేయాల్సినంతా చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే కేంద్రం జగన్ రెడ్డి ప్రభుత్వానికి రూ. 28,704.02 కోట్ల మేర ప్రయోజనాలను అందించింది.   మరింతగా రుణం పొందేందుకు అవకాశం కల్పించకపోయినా.. గతంలో విధించిన కోతను వాయిదాల పద్ధతిన తీర్చేందుకు వెసులు బాటు కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణపరిమితిపై   8,000 కోట్ల రూపాయల  కోత విధించాల్సి ఉంటే మోడీ పుత్స వాత్సల్యంతో జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ కోతను వాయిదా పద్ధతిలో  విధించాలని నిర్ణయించారు.అంటే  ఎన్నికల సంవత్సరంలో జగన్ నెత్తిన రుణభారం పడకుండా వెసులుబాటు ఇచ్చారు. ఇక ఎన్నికల తరువాత వచ్చే ప్రభుత్వం ఈ భారం భరించాల్సి ఉంటుందన్న మాట. ఒక వేళ ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా జగన్ రెడ్డి ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి రాకపోతే.. జగన్ రెడ్డి తప్పిదాలకు  మూల్యం వచ్చే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందన్న మాట.  తప్పులు ఈ ప్రభుత్వం చేస్తే.. తదుపరి ప్రభుత్వం ఆ భారం భరించాల్సి ఉంటుందన్న మాట.

Related Posts