YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

500 విమానాలకు ఆర్డరచ్చిన ఇండిగో

500 విమానాలకు ఆర్డరచ్చిన ఇండిగో

ముంబై, జూన్ 20, 
భారత విమానయాన చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం జరిగింది. భారత బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో.. ఒకేసారి 500 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి నారో బాడీ ఫ్లైట్ల కొనుగోలుకు డీల్ కుదుర్చుకుంది. టాటా గ్రూప్‌ నుంచి ఎయిరిండియా.. ఇటీవల ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి 470 విమానాలకు ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అప్పటివరకు దేశ ఏవియేషన్ హిస్టరీలో అతిపెద్ద డీల్ కాగా.. ఇప్పుడు ఇండిగో దానిని అధిగమించినట్లయింది. ప్రస్తుతం ఇండిగో 300 విమానాలు నడుపుతోంది. అంతకుముందు 480 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇవి డెలివరీ కావాల్సి ఉండగా.. ఇప్పుడు ఆర్డర్ చేసిన 500 విమానాలు అదనం.కొత్తగా ఆర్డర్ చేసిన 500 విమానాలు.. 2030-2035 మధ్య డెలివరీ కావాల్సి ఉందని ఇండిగో తెలిపింది. ఇక మొత్తంగా రానున్న పదేళ్ల కాలంలో ఇండిగో ఆర్డర్ బుక్‌లో ఉన్న 1000 వరకు విమానాలు డెలివరీ అవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన విమానాల్లో A320 నియో, A321 నియో, A321 XLR ఫ్లైట్స్ ఉన్నాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక వివరాలేం తెలియనప్పటికీ.. దీని వాల్యూ సుమారు 50 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఒక అంచనా.కరోనా సమయంలో విమానయాన పరిశ్రమ తీవ్రంగా దెబ్బతినగా.. మళ్లీ అంతేవేగంతో కోలుకుంది. విమాన ప్రయాణాలు కూడా భారీగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలోనే విమానయాన సంస్థలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. భారీ ఎత్తున విమానాల కోసం ఆర్డర్ పెడుతున్నాయి. ఇందులో భాగంగానే.. ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటాలు ఏకంగా 470 విమానాలకు ఆర్డర్ పెట్టగా.. ఇప్పుడు ఇండిగో 500 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. దేశీయ విమానయాన రంగంలో ఇండిగోకు ప్రస్తుతం 56 శాతం వాటా ఉంది.

Related Posts