విజయవాడ, జూన్ 21,
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు కలకలం ప్రారంభమయింది. ఎన్నాళ్లో వేచిన తర్వాత బయటకొచ్చిన వారాహి.. బాగానే కలకలం సృష్టించింది. పవన్ జనాల్లోకి వస్తే.. ఏం జరుగుద్దో మీరే చూస్తారంటూ ఆ పార్టీ నాయకులు చెప్పిన మాటలు నిజంలా కనిపిస్తున్నాయి. యాత్ర మొదలై 4-5 రోజులు గడిచాయో లేదో అవతలి పక్షం నుంచి ఆరోపణలు.. కవ్వింపులతో ఊరుములు మెరుపులు మొదలయ్యాయి. అయితే ఉరుమే లేని పిడుగులా ఒక ఊహించని రియాక్షన్ వచ్చింది. అదే ముద్రగడ.. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాన్ ను ప్రశ్నిస్తూ.. లేఖాస్త్రం వదలడంతో కుల కలకలం మొదలైపోయింది. కులాల రహిత సమాజం.. మతాల ప్రస్తావన లేని రాజకీయం అంటూ పవన్ కల్యాన్ ప్రతీ ప్రచార సభల్లోనూ చెప్తుంటారు లే కానీ.. వాటి ప్రస్తావన లేకుండా ఆయన ప్రచారం జరగదు. పవన్ కల్యాణ్ మాట్లాడటమో .. లేక పవన్ మాట్లాడారు కాబట్టి ఆయన్ను టార్గెట్ చేయడానికి ఆయన సామాజిక వర్గానికే చెందిన మంత్రులు, నాయకులతో వైసీపీ ఆయన్ను తిట్టించడం వల్లనో కానీ.. పవన్ పర్యటనలు.. రాజకీయాలకు కులం అనేది ఒక ముఖ్యమైన అంశంగా మారింపోయింది. మామూలుగానే ఆ స్థాయిలో రియాక్షన్ ఉంటుంది... ఇక ఏకంగా వారాహి వాహనంపై నుంచి పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారంలోకి దిగాక.. కులం రాకుండా ఎలా ఉంటుంది.. ? అన్నవరం మొదలుకొని కాకినాడ ఏటిమొగ వరకూ వివిధ సభల్లో పాల్గొన్న పవన్ ఆవేశంగా ప్రసంగించారు. తనను ముఖ్యమంత్రిని చేయాలని అభ్యర్థించారు. అధికారం దక్కని కులాలకు రాజ్యాధికారం కావాలన్నారు. పనిలో పనిగా స్థానిక నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పవన్ పర్యటనపై రాష్ట్ర స్థాయిలో ఆయనకు వ్యతిరేకంగా కౌంటర్లు ఇచ్చే పేర్ని నాని, అంబటి, మరికొందరు నేతలు వంతుల వారీగా మాట్లాడినప్పటికీ.. కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డిపై పవన్ చేసిన వ్యాఖ్యులు.. దానికి ఆయన స్పందించిన తీరుతో ఫైట్ ముఖాముఖి అయిపోయింది. పవన్ కల్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేయబోతున్నారా.. అందుకే ద్వారంపూడిని టార్గెట్ చేశారా అన్న చర్చలు కూడా నడిచాయి. ద్వారంపూడి తనపై పోటీ చేయాలని సవాల్ కూడా చేశారు. ఇదిలా ఉండగానే అనూహ్యంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పవన్ కల్యాన్ ను తప్పు పడుతూ లేఖ విడుదల చేశారు. ఇప్పటి వరకూ ముద్రగడ తానకు ఏ పార్టీతో సంబంధం లేదని.. తాను కాపుల రిజర్వేషన్ కోసమే పోరాటం చేస్తున్నానని చెబుతూ వస్తున్నారు. అయితే కాపుల ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ద్వారంపూడిపై ఆరోపణలు సరికాదని.. ద్వారంపూడి తప్పు చేస్తే రెండు సార్లు ఎలా గెలిచారని ముద్రగడ పవన్ ను నిలదీశారు. ముద్రగడ జోక్యంతో వ్యవహారం కాపుల టర్న్ తీసుకుంది. ముద్రగడ లేఖ వెనుక ఉంది వైసీపీ ఏ అని జనసేన ఆరోపిస్తోంది. వైసీపీ గీతాన్నే ఆయన ఆలపిస్తున్నారని.. వాళ్లకి అవసరం అయినప్పుడు.. వాళ్లు రాసిన లేఖలపై ఈయన సంతకాలు చేసి పంపుతుంటారని జనసేన నేతలు తిరిగి ఆరోపిస్తున్నారు. ముద్రగడ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారని.. ఆయనకు ఎంపీ సీటు, ఆయన కుమారుడుకి ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు వైసీపీ నుంచి హామీ ఉందన్నది వీళ్ల వాదన. ప్రత్యేకంగా ఎవరూ చెప్పకపోయినా.. జనసేన బలం ఎక్కువుగా కాపు సామాజికవర్గంలోనే ఉంది. పవన్ పర్యటన కూడా ఆ సామాజికవర్గం ఎక్కువుగా ఉన్న నియోజకవర్గాల్లో సాగుతోంది. ఇంతకు ముందు మనం ఎవరో ఒకరికి మద్దతు ఇచ్చి బలపడాలి అప్పటి వరకూ ముఖ్యమంత్రి పదవి అడగలేం అని చెప్పిన పవన్ కల్యాణ్ ఈ పర్యటన మొత్తం కూడా పొత్తుల గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. పైగా తనను సీఎం చేయాలని అడిగారు. జనసేన ఒంటరిగా వెళ్లాలనుకుంటోందా లేక ఏదైనా వ్యూహంతో ఉందా అని రాజకీయ పరిశీలకులు అనుకుంటున్న వేళ.. ముద్రగడ ఎంటర్ అయ్యి.. కులాన్ని తీసుకొచ్చారు. ఆ వెంటేనే పాతకాలపు కాపు నాయకుడు.. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరిరామ జోగయ్య కూడా సీన్ లోకి రావడంతో కాపుకులకలం రేగింది. కాపులు, బీసీలు, మైనార్టీలు పవన్ కల్యాణ్ ను తమ భవిష్యత్ నేతగా చూస్తున్నారని.. వారాహి యాత్రలో ఇచ్చిన స్పష్టతతో ఆయన వెంట నడవడానికి సిద్ధం అవుతున్న దశలో ముద్రగడ ఇలా మాట్లాడటం ఏంటి అన్నారు. ముద్ర గడ పెద్ద మనిషి అనుకున్నా.. కాపు కులాన్ని జగన్ కు తాకట్టు పెట్టేందుకు కూడా సిద్ధమైపోయారా అంటూ నిలదీశారు. చేతి వరకూ వచ్చిన అవకాశాన్ని కాలరాయడానికి ముద్ర గడ ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని ఇలాంటి సమయాల్లో నోరు మూసుకుని ఉంటే సంతోషమని లేఖలో వ్యాఖ్యానించారు. మొత్తానికి వారాహి యాత్రకు వైసీపీ నేతల కౌంటర్లతో వచ్చిన బజ్ మాత్రమే కాదు. కాపు టర్న్ తీసుకోవడంతో మరింత బూస్ట్ కూడా వచ్చింది. రాష్ట్రంలో అధికారాన్ని డిసైడ్ చేయగల పరిస్థితిలో కాపుల సంఖ్య ఉంది. అయితే వారు మూడు పార్టీల్లోనూ ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా నడిపించే ఒక నాయకుడు లేకపోవడం, రాష్ట్రంలోని రెండు ప్రాంతీయ పార్టీలకు.. మరో రెండు బలమైన సామాజిక వర్గాలకు చెందిన నాయకులు నాయకత్వం వహిస్తుండటంతో మరో కులానికి అవకాశం రావడం లేదు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని పరిస్థితిని సృష్టించగలిగితే.. కర్ణాటకలో కుమారస్వామి తరహాలో ముఖ్యమంత్రి పదవి చేపట్టొచ్చన్నది వారి ఆశ. పూర్తి మెజార్టీ సాధించాల్సిన పనిలేదని తమకు బలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మెజార్టీ సీట్లు తెచ్చుకుంటే.. పదవిని డిమాండ్ చేసే పొజిషన్లో ఉంటామన్న ఆలోచనలున్నాయి. అయితే మొన్నటి వరకూ పొత్తులకు సంకేతాలు బలంగా ఇచ్చిన పవన్ కల్యాణ్ ఈ సారి యాత్రలో ఆ సూచనలు ఇవ్వకపోవడం.. తనను ముఖ్మయంత్రిని చేయాలని అడుగుతుండటంతో “ప్రణాళిక” లో ఏమైనా మార్పు వచ్చిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ పవన్ కల్యాణ్ పూర్తి మెజార్టీ సాధించలేకపోయినా.. రెండు పార్టీలకు అధికారాన్ని దూరం చేయగలిగే స్థాయిలో సీట్లు సాధిస్తే అది వైసీపీ -తెలుగుదేశానికి ఇబ్బందే. పవన్ బయటకు చెప్పకపోయినా .. ఆయన ఓటు బ్యాంక్ కాపులే. ఆ ఓట్లను ఎక్కడ కొల్లగొడతారనే భయంతోనే వైసీపీ ముద్రగడను రంగంలోకి దించిందా అన్న సందేహాలు జనసేన వైపు నుంచి ఉన్నాయి. ఈ మధ్యనే కొంతమంది వైసీపీ నేతలు ముద్రగడను కలిశారు. సో మొత్తం మీద కాపులను సొంతం చేసుకోవడానికి అన్నీ పార్టీలు పోటీపడుతున్నాయి. తమకు సహజంగా ఉన్న అడ్వాంటేజ్ తో రేసులో ముందుండాలని జనసేనాని భావిస్తుండొచ్చు. ఒకవేళ పొత్తు ఉన్నా కూడా బలం చూపిస్తే మరిన్ని సీట్లు డిమాండ్ చేయొచ్చు. సో.. గోదావరి రాజకీయాల నుంచి వేరు చేయలేని కాపు ఫ్యాక్టర్ అనివార్యంగా తెరపైకి వచ్చేసింది. ఇది ఏ టర్న్ తీసుకుంటుందో మరి.